లిఫ్ట్ -కథానిక

లిఫ్ట్ -కథానిక

బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2 వాహనాల రొదతో చిటపటలాడుతోంది. ఉబర్ లో క్యాబ్ రేట్ కు తలతిరిగిపోతుంటే

ఆటో కోసం వెతకసాగాను.

“సికింద్రాబాదా..ఏమిస్తర్ సర్” అంటూ ఆగకుండానే వెళ్ళిపోతున్నారు ఆటో సోదరులు. ఆలోచనలతో బుర్ర పాడయిందేమో,చెప్పలేని కోపంతో ఉన్నాను.

“Excuse me sir
ఎక్కడికి వెళ్ళాలి”
అన్న అతని మాటలతో ఈలోకంలోకి వచ్చాను. ఎవరా అని చూస్తే ఆటో డ్రైవర్ సీట్లోంచి తొంగిచూస్తున్నాడు.

“సికింద్రాబాద్.. వస్తారా”
అనుకోకుండా మర్యాద తొంగిచూసింది నాగొంతులో

“ష్యూర్.. కెన్ యూ గైడ్ మీ?” (can you guide me)
నేనెక్కింది ఆటోయేనా అనుకుంటూ సెటిల్ అయ్యాను.

“సారీ అంకుల్.. నేను కొత్తగా ఆటో తీసుకున్నాను. అందుకని అడిగాను. ఇంకా రూట్స్ తెలీవు”
కాస్త అపాలజెటిక్ గా అన్నాడు.

“ఫరవాలేదు.. ఆటో డ్రైవింగ్ కొత్త అని తెలుస్తోంది”
అతన్ని పరిశీలనగా చూశాను. ముప్ఫై ఏళ్ళుంటాయేమో అతనికి..

“అవునంకుల్
ఇంతకుముందు బిజినెస్ చేసేవాడిని. అందరిలానే నన్నూ కరోనా ముంచేసింది..” అంటూ ఆగాడు

నాలో చికాకు తగ్గటం మొదలయ్యింది. ఆసక్తి పెరగటం మొదలయింది.

“ఫర్లేదు చెప్పండి”
ఫ్రెండ్లీ టోన్ వచ్చేసింది నాలో.

“నేను స్కుల్సుకి మెటీరియల్ సప్లై చేసే బిజినెస్ లో ఉండేవాడిని. లాక్ డౌన్ కొట్టిన దెబ్బకు అన్నీ అమ్మేసుకున్నాను. సరిగ్గా అప్పుడే అమ్మకు కొవిడ్ వచ్చింది.

మీకు తెలియనిదేముంది. హాస్పిటల్స్ దోపిడి గురించి. బతికి బట్టకట్టింది కానీ కిడ్నీస్ పాడయ్యాయి. వారానికి రెండుసార్లు డయాలసిస్ అవసరం. ఉన్న డబ్బంతా ఖర్చయిపోయింది..”

“మీకెవ్వరూ లేరా..”
కుతూహలంగా అడిగాను

“అంతా బావున్నప్పుడు అన్నా,నేను కలిసుండేవాళ్ళం. ఎప్పుడయితే అమ్మ హెల్త్ బాగాలేదో అంత ఖర్చు నావల్లకాదు అని విడిగా వెళ్లిపోయాడు.

అమ్మని అలా వదిలేస్తామా అంకుల్? ఆమెకేదయినా అయితే మళ్ళీ ఆమెను చూడగలుగుతామా?”

“మరి నీ ఫ్యామిలీ సంగతి… వాళ్ళక్కర్లేదా”
అడిగాను.

“ఫర్వాలేదు అంకుల్. బాబు, పాప.. నా వైఫ్ ఇంతకుముందు టీచర్. ఇప్పుడు ఆ స్కూల్ మూతబడింది
చిన్నప్పుడు నేర్చుకున్న టైలరింగ్ ఇప్పుడు అక్కరకొచ్చింది. అలా దేవుడు దారి చూపుతాడు లెండి”
అంటూ నవ్వాడు.

“ఆటో కొత్తదిలా ఉందే”
“అవును సర్, పైగా ఇది బ్లాకులో కొనాల్సొచ్ఛింది. దాంతోపాటు ఆటోరూట్ పర్మిట్ ఖర్చు… ఇవన్నీ కలిసి కారుకయినంత అయింది.. ఇలా ఉంటుందనే చాలామంది కారు కొనుక్కుని టాక్సీగా తిప్పమన్నారు. నేనే వద్దనుకున్నాను సర్”

“అదేమిటి అంకుల్ నుంచి సర్ లోకి దిగావు.. అంకులే బెటర్.. సరే ఇంతకీ ఆటోయే ఎందుకు తీసుకున్నావు?”
అడిగాను..

“అమ్మ క్యాబ్ లో కూచోలేకపోతోంది. అందుకే.. ఆటోయే నయమనిపించింది అదేమిటో అంకుల్.. మా చుట్టాలందరూ ఆటో తీసుకున్నావా.. మా పరువు తీస్తున్నావన్నారు.

మొన్నొక కస్టమర్ కూడా ‘ఆటో నడిపిస్తున్నవా’ అని జాలి చూపించాడు.. ఈజ్ ఇట్ బ్యాడ్ అంకుల్”

“నీపేరేమిటో కానీ ఫ్రెండ్ మనదగ్గర ఆటో నడిపే వాళ్ళు కాస్త రఫ్ గా ఉండటం వలనో, కాస్త ఇంగ్లీషొచ్చి స్టైల్ గా ఉంటే చాలు ఆటో నడపటమేమిటి అన్న ఫీలింగ్ అందరికీ వచ్చేస్తుంది..

కానీ నువు మాత్రం నీ ఐడెంటిటీ నిలుపుకో..  మిగిలిన వాళ్ళలాగా తయారవకు.. కాస్త మర్యాదగా మాట్లాడితే అందరూ నీకు హారతిపడతారు..

కొంచెం ముందుకెళ్ళి ఆ రైట్ తిరిగి పక్కన ఆపు.. నేను దిగిపోతాను..” అంటూ అతని భుజం తట్టాను..

దిగగానే పర్స్ లోంచి గురుదక్షిణ సమర్పించినంత జాగ్రత్తగా అతని ఫేర్ చెల్లించాను..

“అంకుల్ ఇది నా నంబర్”
చిన్న స్లిప్ అందించాడు.

‘అమ్మ ఆటో’ అనే పేరు.. అతని నంబర్ తప్ప ఇంకమీ లేవు ఆ స్లిప్ మీద.
ఆటో మీద కూడా అదేవుంది..

అతని కమిట్మెంట్ కు ముచ్చటేసింది.. అతని అనుభవం డైరీలో ఎక్కించాలనుకున్నాను. ఇంతకీ నేనొక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ని.

మనుషుల అనుభవాలతో నా కోర్స్ డిజైన్ చేసుకుంటాను.. అందరివీ ఇంత దృఢమైన అనుభవాలు కాకపోవచ్చు. అలాంటప్పుడు అవసరమయితే కాస్త ఓదార్పు పంచుతాను.

ఎలా ఉండకూడదో స్టూడెంట్స్ కు చెబుతాను.. ఇలాంటి యువకులు నాలాంటివారికి పాఠాలు నేర్పుతారు. కృతజ్ఢత కోరకుండా ఏ ఫ్లోర్ కి కావాలంటే ఆ ఫ్లోర్ తీసుకు వెళ్ళే లిఫ్ట్ లాంటివారు అనుకుంటూ లిఫ్ట్ వైపు నడిచాను

– సి.యస్.రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *