కుటుంబం

కుటుంబం

(ఆటవెలదులు)

1) జనులు ఎక్కువున్న ఝంఝాటముండును
    కళకళమనుచుండు కాంతితోడ
    అన్నదమ్ములంత ఆప్యాయతలతోడ
    కలిసి మెలిసి యుంద్రు కనులముందు

2) పెద్దవారి మాట పెడచెవి బెట్టరు
     అణిగిమణిగి యుండు ఆదరముగ
     బంధు మిత్రులంత బంధాల పిలుపులు
     ఐకమత్యమెపుడు అనుసరించు

3)  సంఘమందుపేరు సాటివారియందు
      కలిసి మెలిసి యున్న కలదు సుఖము
      పాలు పంచుకొనును పరుల కష్టాలను
      పనులు తేలికౌను పలువిధముల

4) పెద్దవారి జాడ పెరుగుతూ ఉందురు
      అవసరమ్ము వస్తె అడుగు చుంద్రు
      తప్పటడుగు లేక తడబాటు రాకుండ
      లక్ష్య మెంచి సాగు లక్షణంబు

5) పిన్నవారి పనుల పర్యవేక్షణముండు
     తగినపనులు జెప్పు తగవులేక
     పనులు చేసుకుంటు పనులు నేర్చెదరంత
      అనుభవమ్ము వచ్చు అందరకును

– కోట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *