💖 కుట్టి లవ్ స్టోరీ 💖
ఇవ్వాళ్టి చాల్లే పోయి పడుకుని రేపొద్దున్నే వచ్చి మిగిలింది పూర్తిచేద్దాం అని రూమ్ కి బయల్దేరా!
రాత్రి పదకొండున్నర కావొస్తుంది. పేరుకి పెద్ద సిటీయే గానీ పది దాటితే రోడ్డు మీద పిట్ట కూడా తిరగదు. నిర్మానుష్యంగా వుంది, కంటోన్మెంట్ దాటి విక్రమ్ పురి వచ్చింది.
నెక్స్ట్ వున్న ఖార్ఖానా లో రూమ్. రోడ్కు పక్కన కుక్కలు మొరుగుతూ గుమిగూడాయి. బండి స్లో చేసి చూశా, ఒక పెద్దాయన వాటిని బెదిరిస్తున్నాడు. ఇవి ఆయన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉష్షో!! అని అరిచి ఆయన పక్కన బండి ఆపాను.
“ఎక్కడికి వెళ్లాలండీ?”
“తిరుమలగిరి బాబూ.. స్కూటర్ ట్రబుల్ ఇచ్చింది, ఆటోలు కూడా దొరకలేదు.”
“అయ్యో!! అక్కడిదాకా ఎలా వెళ్తారు? రండి నేను డ్రాప్ చేస్తా..”
“చాలా థాంక్స్ బాబూ..”
“ఫర్వాలేదు సర్!”
ఆయన ఇల్లొచ్చింది. కొడుకు అనుకుంటా కంగారుగా బయటకి వచ్చి ఇంత లేటయ్యింది అని కనుక్కొని, నాకు థాంక్స్ చెప్పి తండ్రిని లోపలికి తీసుకెళ్లాడు.
“యెస్, ప్లీజ్!!” (నాకు కొత్త వాళ్ళతో మాట్లాడాలంటేనే భయం. అందులోనూ అమ్మాయిలతో..)
“నేను నేహా అండి, న్యూ జాయినీ.. మార్నింగ్ పరిచయం చేశారు..!”
“చెప్పండి నేహా, ఎనీ ప్రాబ్లెమ్?” (ఇడియట్.. ఎనీ ప్రాబ్లెమ్ అని అడుగుతారా ఎవరైనా..?)
“నేను మీకు థాంక్స్ చెబుదామని పిలిచాను సర్..”
“ప్లీజ్ కాల్ మీ సందీప్, థాంక్స్ ఎందుకు?”
“పోయిన వారం మీరు ఇంటికి తీసుకువచ్చి దింపింది మా ఫాదర్ నే….”
“ఓహ్, ఐ సీ!! మెన్షన్ నాట్. ఇట్స్ నథింగ్. ఎలా వున్నారు మీ ఫాదర్?”
” బావున్నారు. థాంక్ యు వెరీ మచ్ సందీప్!! ఆరోజు కంగారు పడ్డాం.”
“రండి, లంచ్ చేద్దాం..” (అబ్బ ఎంత ధైర్యం?)
ఎందుకో ఎప్పటినుండో పరిచయం వున్న అమ్మాయితో మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్. మరుసటిరోజు తను రాగానే నా సీటు దగ్గరకి వచ్చి
“నిన్న ఈవెనింగ్ కనబడలేదు, ఉన్నారేమో టీ తాగుదాం అని వచ్చా..”
“కొంచెం పర్సనల్ వర్క్ ఉండి త్వరగా వెళ్ళిపోయా.. హౌ అబౌట్ కాఫీ నౌ?” (రాత్రి కాలేజ్ మేట్స్ కలిసి మందేశాం!)
తన గురించి చెప్పింది. వాళ్ళు తిరుమలగిరి లో వుంటారు, ఇక్కడే పుట్టి పెరిగింది. అన్న, తను ఇద్దరే పిల్లలు. అన్న కూడా సాఫ్ట్ వేర్ లోనే చేస్తున్నాడు.
రోజులు గడుస్తున్నాయి. వర్క్, సినిమాలు, ఫుడ్, ఇలా అన్నీ డిస్కస్ చేసుకునేవాళ్లం. తను మ్యూజిక్ లవర్, పాటలు పాడుతుంది. మ్యూజిక్ గురించి సింగర్స్ గురించి చెబుతుంది.
నాకేమో అందరి వాయిస్ ఒక్కలాగే అనిపిస్తుంది, ఇంక మ్యూజిక్ సరేసరి! నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, తను మహేష్ బాబు. లంచ్ టైం లో అప్పుడప్పుడూ ఫ్యాన్ వార్స్ జరిగేవి. ఎవరి సినిమా రిలీజైనా గ్యాంగ్ అంతా వెళ్ళేవాళ్ళం. అంతా బాగుంది..
ఓ గురువారం ఆఫీసుకి రాలేదు. మామూలుగా ఎప్పుడూ సెలవు పెట్టదు. ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ ఏమనుకుంటుందో ఎప్పుడూ చేయలేదు కదా అని ఆగిపోయా. వాళ్ళ టీం వాళ్ళని అడిగితే ఈరోజు లీవ్ పెట్టింది అన్నారు.
నెక్స్ట్ డే తను వచ్చే వరకూ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ వున్నా. రాగానే ..
“హై, అంతా ఓకే కదా?”
“యెస్, ఆల్ గుడ్!”
“ఏంటి ఏమైనా ఫంక్షనా? హఠాత్తుగా రాకపోయేసరికి ఏమైందో అని కంగారుపడ్డా.. సాయంత్రం తెలిసింది లీవ్ పెట్టావని.”
“అంత కంగారు పడితే ఫోన్ చేయొచ్చుగా?”
“అంటే, అలా ఫోన్ చేస్తే ఏమనుకుంటావో అనీ..”
“నంబర్ ఇచ్చింది ఫోన్ చేయడానికే.. నువ్వు ఇలాగే రాకపోతే నేను చేసే దానిని తెలుసా?”
కొంచెం ఆనందం, అంతలోనే కొంచెం అనుమానం..
“ఇంతకీ ఏమిటి అకేషన్?”
“నా పెళ్లిచూపులు..”
అనుకున్నంతా అయింది. ప్చ్, డిజప్పాయింట్మెంట్.. కాదు ఇంకొంచెం ఎక్కువ. నిజానికి ఒక్కక్షణం బాడీలో ఆక్సిజన్ అంతా ఎవరో పీల్చేసినట్టు అనిపించింది.
“ఏంటి దీర్ఘంగా అలోచిస్తున్నావ్”
“పెళ్లెప్పుడా అని..” మాట నూతిలోంచి వచ్చినట్లుంది.
“నీ ఫేసులో ఏమీ దాగదు తెలుసా?”
అయ్యో దొరికిపోయానా? ఛీ, అసహ్యంగా వుంటుంది. సరదాగా మాట్లాడితే యిలా ఆలోచిస్తాడేంటి అనుకుంటుందేమో!?
“నో నో.. రాత్రి మందెక్కువైంది అంతే..”
“ఛా, ఇంకా..?”
దొరికిపోయాను. అమ్మాయిలంటే ఆమడ దూరంలో వుండే నేను అడ్డంగా బుక్కయిపోయాను. నిజాయితీగా ఒప్పేసుకోవడమే బెటర్. కొంచెం ఎంబరాస్ మెంట్ తో పోతుంది.
“ఐ యామ్ రియల్లీ సారీ నేహా. ఐ డింట్ మీన్ ఎనీథింగ్ బ్యాడ్. ప్లీజ్ ఫర్ గివ్ మీ..”
“ఇట్స్ ఓకే, నో ప్రాబ్లెమ్”
హమ్మయ్య బతికాం రా దేవుడా..
కొద్ది నిమిషాలు ఇబ్బందికరమైన నిశ్శబ్దం తరువాత
“ఇంతకీ పెళ్ళెప్పుడు?”
“సంబంధం కుదరలేదు”
యురేకా!!
“వాట్? ఎందుకు? నీకేం తక్కువ?”
చురుగ్గా చూసింది
“అంటే వాళ్ళే వద్దన్నారని ఫిక్స్ అయిపోయావా?”
మళ్ళీ దొరికిపోయారా, దేవుడా!!
“ఓహ్, అబ్బాయి బాగోలేడా?”
“షటప్!”
“సారీ..”
“నీ ఫేసులో ఏమీ దాగదు తెలుసా?” (డేజా వు, సేమ్ రిపీట్ అవుతుందా?)
మోహంలో ఆనందం దాగట్లేదు అనుకుంటా.. హఠాత్తుగా నేను అక్కడనుంచి మాయమైపోతే బావుణ్ణు.. కొంచెం ఫీలింగ్స్ దాచుకోవాలిరా నువ్వు.. మరీ 70mm స్క్రీన్ లాగా అన్నీ కనబడిపోతే కష్టం!
“నీ అంత పిరికోడిని నేను చూడలేదు తెల్సా?”
“నేను కొంచెం ఇంట్రావర్ట్ ని..”
“పిరికితనం అను”
ఛలో, ఇంతకంటే మంచి ఛాన్సు రాదు.. మిస్ చేసుకోకురా సందీప్..
“అదికాదు, ఏమైనా తేడా అయితే వున్న ఫ్రెండ్షిప్ కూడా చెడుతుంది. అది ఇంకా పెయిన్ ఫుల్ కదా?”
“బయటకి చెప్తేనే కదా నీ మనసులో ఏముందో తెలిసేది?”
ఆనందం తట్టుకోలేకపోతున్నా.. కొంచెం భయం కూడా వుంది..
“అయినా ఎప్పుడూ అబ్బాయిలే చెప్పాలా? అమ్మాయిలు ఏం తక్కువ? జెండర్ ఈక్వాలిటీ వుండాలిగా?”
“ఆహా, ఇంకా!!”
నేను నాన్సెన్స్ మాట్లాడుతున్నా అని నాకే అర్ధమైపోతుంది.
“రేపు శనివారం ఇంటికి రా, డాడీ మాట్లాడతానన్నారు”
“అలాగే.. వ్వాట్?”
“నువ్వు విన్నది కరెక్టే, రేపు లంచ్ కి వచ్చెయ్.”
ఏమంటాం.. అలాగే అంటాం.
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే..
కట్ చేస్తే..
శనివారం వాళ్ళ డాడీతో నేను మాట్లాడా.. తప్పు తప్పు, వాళ్ళ డాడీ నాతో మాట్లాడారు. ఆపై వారం మా డాడీతో మాట్లాడారు. రెణ్ణెళ్ళకి పెళ్లయిపోయింది.
అలా.. కనీసం “ఐ లవ్ యు” కూడా చెప్పుకోకుండానే పెళ్లయిపోయింది. పనిషమెంటుగా రోజూ “ఐ లవ్ యూ” చెప్పాలని మేడం గారి ఆర్డర్. ఐ హావ్ నో కంప్లైంట్స్.
– శ్రీకాంత్