కుస్తీ
వందల కోట్ల ప్యాకేజిల దండలను
మెడలో వేయమని మేమడుగుత లేము
అంబాసిడర్ గుర్రమెక్కి
ఊరేగాలన్న ఆశ అంతకన్నా లేదు.
మల్ల యుద్ధాల్లోని
ఉడుంపట్టు తెలిసిన వాళ్ళమే గాని
ఏ పార్టీనో విడిచిన బాణాలం కాదు
ఒలంపిక్స్ ఆటల్లో
బంగారు పతకాలను ముద్దాడుతున్నపుడు
మువ్వన్నెల భరతమాతను
మా భుజాల మీద మోస్తున్నప్పుడు
పొంగి పొర్లిన దేశభక్తి
ఇప్పుడేమయ్యిందని మేము ప్రశ్నించం లేదు.
చలితో , వానతో , ఎండతో
కుస్తీ పడుతూ అడుగుతున్నం
న్యాయం మీరే చెప్పండి?
ఇపుడు
కామపు వేళ్ళ మధ్య నలిగిన
గాయపడ్డ గువ్వపిల్లల భాష మాది
ఇమ్మంటే ఇవ్వడానికి
ఇవి బోటన వ్రేళ్ళు కాదు
ఆటస్థలాలు వేశ్యా వాటికలు కావు
మేమెవరి ఆటబొమ్మలంగాము
గీత దాటామని మీరనుకోవచ్చు గాని
ఆడతనం మీద చేయేస్తుంటే
అరువకుండా ఎన్నాళ్ళుంటాము.?
ఎంతటి మల్లయోధులమయినా
మాది మీ అక్కాచెల్లెండ్ల లాంటి సున్నితమైన గుండెనే
అశ్విని నాచప్పను చూసి
ఊరి చివరున్న ఓ జింకపిల్ల
పరుగు పెట్టడం నేర్చుకుంటుంది
మేరీ కోమ్ ను చూసి గూడెంలో ఓ నెమలిపిల్ల
బరువుల్ని ఎత్తడం నేర్చుకుంటుంది
రక్షణగా నిలబడాల్సిన కంచెనే
పట్టపగలే చేనును మేస్తుందని
వాళ్ళకు ఎట్లా చెప్పమంటారో మీరు చెప్పండి ?
ఆడబిడ్డలను
ఆటలవైపు పంపే తల్లిదండ్రులందరికీ
గుండెధైర్యాన్ని ఇచ్చె
చారిత్రకతీర్పు కోసం ఎదురుచూస్తున్నం
‘ఖేల్ రత్నాలను ‘
రోడ్డు మీద పారబోసి అడుగుతున్నం
మా మన్ కీ బాత్ ను కూడా వినండని
జంతర్ మంతర్ నుంచే ప్రసారమౌతున్నం.
చెమటధారల మధ్య , రక్తపుటేరుల మధ్య
అవతలిదేశాన్ని ఓడించిన
పిడికిళ్ళతోనే అడుగుతున్నం
న్యాయం మీరే చెప్పండి ?
-గురువర్థన్ రెడ్డి