క్షమాగుణం అనంతం
అతివ మది కడలి
అందు ఎగిసేను లహరి
సౌందర్యానికి ప్రహారి
ఆమె మన జీవన సరసి
జననం నుంచి మరణం వరకు
తీర్చలేము “ఆమె” ఋణం
ఉందా “ఆమె”లోని ఆటుపోటులను
తెలుసుకునే గుణం
ఎరుకపరచలేని ఎదురీతలు “ఆమె” జీవితం
అయినను ఆమె పరుస్తుంది ఎర్రతివాచీ నీ కోసం
మదిగర్భంలో నిక్షిప్తమాయె అనంత యోచనా తరంగాలు
తీర్ప శక్యంకాదు “ఆమెను” సృజియించిన సరసిజభవునకు సైతం
భువి అంత ఓర్పు – బ్రతుకు బాటలో నేర్పు
దివి అంత విశాలం – జీవితాన సౌశీల్యం
హృదిలో ఒదిగేను – అనంత బ్రహ్మాన్దం
అదే ఆమె విజయ శంఖారావం
అంతః సౌందర్యానికి మూలం
అంతర్గృహాన అంతర్లీనమై ఆనందాన్ని ఇచ్చే
ఆత్మవిశ్వాసపు సౌందర్యమే “ఆమె” అందం
అదే “ఆమె” క్షమాగుణం.
– గంగాధర్ కొల్లేపర (శ్రేష్ఠి)