కోపం
కోపం రావాల్సిందే, ఇతరులపై కాదు,మనమీద మనకే
సూర్యుడికన్నా, కోడికూత విన్నాక ఉదయించనందుకు
నిద్రలో జీవితం కలగానందుకు
మెలకువలో దాన్ని పాదాలుగా వేయనందుకు
మనపై మనకు కచ్చితంగా కోపమే రావాలి
వాడికి నచ్చినట్టు వాడుంటే మనకెందుకు వెర్రికోపం
వీడు శిఖరమైపోతే మనకెందుకు ద్వేషాగ్రహం
ఆమె సన్నజాజుల పరిమళమైతే మనకేల నచ్చనికోపం
వాళ్లనూ వీళ్లను కాదు, సరాసరి సూటిగానే
మనలోని నిస్సారానికీ కోపాగ్ని మనల్నే కాల్చాలి
నది పరుగులు చూస్తూ, బద్ధకాన్ని నడుస్తున్నందుకు
మట్టి చెట్టయి ఫలిస్తోన్నా, మట్టిదేహం ఒఠ్ఠిపోతున్నందుకు
పందారపలుకు తీపిని బహుకరిస్తే
మనం పనసభాషలో నసని మాత్రమే పల్కుతున్నందుకు
మనపై మనకు అవసరంగా కోపం రావాల్సిందే
కోపమొస్తే అలగడం అన్నాన్ని పస్తు పెట్టడం కాదు
కోపంతో విసురుగా బంధుత్వాన్ని విసిరికొట్టడం కాదు
కోపం రేగితే చేతిని కోసుకుని, కల్త కావడమూ కాదు
కోపమొస్తే ఆత్మ శుభ్రంకావాలి, మనిషిలో వెన్నపుట్టాలి
కోపమొక సగుణకారకమే, దురాగతానికి ఊతం కాదు
కోపమొస్తే అంకెలు లెక్కపెట్టడం కాదు,రంకెలూ వేయొద్దు
కోపమొస్తే పాతాళంలో దాగిన బావిని పైకిలాగే మబ్బవ్వాలి
నేరంతోనో, వంచనతోనో తెచ్చిన పైసల్ని తిననే తినొద్దు
కోపమే వస్తే, తప్పులెత్తి చూపేవాళ్లంతా
మనపై కీర్తిపాటలు పాడుకునేందుకు చరణాలివ్వాలి
ఎంత కోపమైనా మనమీద మనమే ప్రతాపంగా చూపాలి
మనమీద మనకి కోపమొచ్చిన రోజే
జగతిలో గతి మెరుగౌతుంది
మనమీద కాక అందరి మీదా కినుకబడుతుంటే
మనం హృదయపుటల్లో ఎక్కేచోట వెనకెనకబడతాం
నాకైతే నా మీదే విపరీతకోపం
కోపసముద్రంలో మునిగిన ప్రతిసారీ శాంతిసుధ లభిస్తోంది
నా కోపం మామూలుగా వుండదు
నన్ను నేనే మమకారంగా చాకిరేవు పెట్టుకుంటాను
పద్యాలబొగ్గులతో ఇస్త్రీ కూడా చేసుకుంటాను
మనసువస్త్రం తళతళమనేదాకా కోపవ్రతం చేస్తుంటాను
ఎంత కోపం పుడితే అంత మనిషవ్వాలి
ఎంత కోపం పుడితే అంత గాడిలో పడాలి
ఎంత కోపం మనపై మనం ప్రదర్శిస్తే
అంతజనం మనపై మోజుపడాలి
కోపమొస్తే మనలో ప్రేమజలపాతం పుట్టాలి
అపుడే మనల్ని కోపిష్టి అనీ, శత్రువుసైతం అనలేడు!
-గురువర్థన్ రెడ్డి