కూతురు లేఖ

కూతురు లేఖ

ప్రాణ సమానమైన నాన్నకు.. తమ కూతురు ఆత్మఘోషతో వ్రాయు లేఖ.

నాన్న! నువ్వు నన్ను నీ కంటి పాపలా కాపాడుకుంటూ.. నిలువెత్తు ప్రేమ మూర్తిగా మారి నన్ను పెంచావు. చిన్నతనం నుండే ఎన్నో ఆదర్శ వ్యక్తుల కథలు, ఉన్నత వ్యక్తత్వాల జీవిత కథలు నాకు వెన్నముద్దలుగా పెట్టావు. నీతో పాటు ఎన్నో సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనేలా చేసి సంఘటితమే సగం బలం అని నేర్పించావు. నైతిక విలువలనే గొప్ప ఆస్తులుగా ఇచ్చావు. దేశ ఔన్నత్యాన్ని చెబుతూ నాలో దేశభక్తి బీజాలను నాటావు. నన్ను అన్ని రంగాలలో రాణింపజేసేలా నాలో ఉత్సుకతను నింపావు. సంఘంలో నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేలా నన్ను తీర్చిదిద్ధావు.

నీలాగే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచి వారే అని, ఎదుటి వారు మన ప్రవర్తనకి దర్పణాలు అనుకొని మధ్యవర్తుల మాయమాటలు నమ్మి, పుతికా వియోగ నరకంతో, నీ శక్తికి మించి కట్నమిచ్చి, ఖర్చు చేసి నన్ను ఒక అయ్య చేతిలో పెట్టావు. పెళ్లి అయ్యాక కానీ తెలియలేదు నీ జామాత ఎంతటి మహానుభావుడో… దవడగాసం (గుట్కా, జర్ధా) లేనిదే పూట గడవదు. సురాపానం లేనిదే రోజు ముగియదు. కనీసం పదవ తరగతి కూడా చదవలేదు. బాధ్యత తెలియదు. సొంత నిర్ణయాలు తీసుకోలేడు.

మద్యపానం చేసిన వ్యక్తిని దగ్గరగా చూడడం తననే మొదటిసారి నాన్న. ఆ వాసన భరించలేక కడుపులో తిప్పుతుంది. చీకటి పడితే నాకు నరకం కన్పిస్తుంది. ఇక్కడ ఏడవడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదు. నువ్వు ఇచ్చిన కట్నం మా అత్తకి సరిపోలేదు. ఎంత వెట్టి చాకిరీ చేసినా నా పని తనకు నచ్చడం లేదు. నాకు ఇక్కడ తిండి సహించడం లేదు. వంట పనిలో సహాయం పేరుతో నా చేతులకు చురకలు అంటిస్తుంది. చేతులపై అన్నీ వేడి నూనె పడి కాలిన గాయాలే నాన్న.

శారీరకంగా.. మానసికంగా నలిగిపోతున్నాను నాన్న. కట్టుకున్నవాడు అక్కున చేర్చుకోక, తల్లిలా చూసుకుంటుందనుకున్న అత్త చీదరింపులకు లోనై గుండె భారమవుతుంది నాన్న.

“నేను కన్న కలలు, ఆశయాలు.. నా మనసు అనే గర్భగుడిలో శిలా విగ్రహాలుగా మారాయి.”

ఈ అకృత్యాలు భరించలేక మీతో చెప్పుకోలేక ఒక బలహీన క్షణంలో ఆత్మహత్యకు పాల్పడ్డాను. ఆ తర్వాత నువ్వు వచ్చి గుండెలు బాదుకుని ఏడ్చిన క్షణం నాకు అర్థమైంది నాన్న. నేను ఎంత పెద్ద తప్పు చేసానో అని. ఈ లోకంలో నేను భరించలేని గంభీరమైన విషయం ఏదైనా ఉంది అంటే అది నీ రోదన నాన్న. దాని ముందు నేను అనుభవించినవన్నీ నాకు చిన్నవిగా తోచాయి. బతికి బయట పడ్డాను కానీ కోలుకోలేకపోతున్నాను. పిల్లలు పుట్టాక అయినా మారతాడు అనుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లినయ్యాను. కానీ పరిస్థితిలో మార్పు రాకపోగా.. బాధ్యతా రాహిత్యం, విచక్షణా రాహిత్యం ఎక్కువైపోయింది.

ప్రతీ చిన్న సంబరానికి నిన్ను కట్నకానుకల కోసం ఇబ్బంది పెడుతుంటే.. నన్ను బాగా చూసుకుంటారనే భ్రమతో నీవు నీ రక్తం చిందిచి నాకు చీర సారెలు పెడుతున్నావు. అయినా నీకు నేను ఇక్కడ జరిగే పరిణామాల్ని వివరించలేని అభాగ్యురాలిని నాన్న. పిల్లలకోసం.. పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతున్నాను. కానీ నేను బ్రతికున్న జీవచ్చవన్నే.

“నా ఆత్మ ఘోషిస్తూ నిన్ను ఆలింగనం చేసుకొని రోధిస్తుంది నాన్న.”

– శంభుని సంధ్య 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *