కూతలరాయుడు పుస్తక సమీక్ష
నవతరం కూత ఇది
బోర్ కొట్టించే రచయితలున్నట్టే కొంతమంది బోర్న్ రచయితలుంటారు. అలాంటివారి వెలుగు మనలను వెతుక్కుంటూ వస్తుంది. ఇదిగో ఆ వెలుగు పుంజమే కూతలరాయుడు aka సాయి కౌలూరి.
బాగా రాయాలంటే బాగా చదవలన్న కాన్సెప్ట్ కు ఇలాంటి కూతలరాయుళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతూ నాకసలు చదివే అలవాటే లేదండీ అని నమ్మకంగా చెబుతారు. మరెలా సాధ్యం.. నీ అసాధ్యం కూలా అని మనమనుకోవాలి..
సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే చాలారోజుల తరవాత ఎత్తిన గ్లాసు దించనట్టు చేతిలోకి తీసిన పుస్తకాన్ని దించకుండా చదివే అవకాశం సాయి కౌలూరి మనకు కల్పించాడు.. *అ* నుంచి *ఋ* అక్షరక్రమంలో కథలను గల్పికలు, నవలికలతో మనలను చుట్టేస్తాడు.
అదీ తన ప్రత్యేకత. వాక్యాల వర్షమా అది.. వెన్నెల వర్షం.. అమ్మా, నాన్నల అనుబంధంతో మొదలైన కథాపర్వం అపురూపంగా సాగుతుంది. ఆంగ్ల భాషా పదాలను వద్దని అందరూ అంటారు గానీ.. ఒడుపుగా వాడటం తెలిసినప్పుడు పాత్రలకో సజీవత్వం వస్తుంది.ఆ కిటుకు తెలిసినవాడు మన రాయుడు.
ఇంకొంచెం క్లారిటీ తో చెప్పాలంటే సినిమాటిక్ భాషలో కథ చెప్పటం మన కథకులకు అంతగా అలవాటు లేదు. అందుకే పాత్రలన్నీ మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కథాగమనాన్ని హెయిర్ పిన్ బెండ్స్ తో నడిపిస్తాడు రాయుడు. దాంతోటి మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం.
*ఇమిరి* కథ మనల్నెంత తికమక పెడుతుందో.. సిడ్నీ కుగ్రామమంటాడు, డబుల్ హార్స్ యూనివర్సిటీ అంటాడు. డేవిడ్ వార్నర్ ఫ్లై ఓవర్ అంటాడు, రానా దగ్గుబాటి అంటాడు. మధ్యమధ్యలో చతుర్దశిలు, రాహుకాలాలు ఎదురవుతుంటాయి. థ్రిల్లర్ కథను చూలాగ్గా స్క్రీన్ ప్లేలా మార్చి చూపుతాడు. మనచూపును తనతో లాక్కెళ్ళతాడు.. ఇమిరి పేరెప్పుడైనా విన్నామా అసలు.
నవలికలాంటి పెద్దకథ *ఋతుపర్ణం* ఎలా ఉంటుందంటే యండమూరి కథను త్రివిక్రం డైరక్ట్ చేసినట్టు. ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లోని సౌందర్యం వెంట తీసుకెళ్ళి పోతాడు. పక్కా సినిమా కథే.. కానీ ఎంత ప్లెజంట్ గా కథను నడుపుతాడు. ఎస్కేపిస్ట్ ఫేర్ అని తెలుగు సాహిత్య విమర్శకులు కొట్టేసేయొచ్చు.. కానీ ఇలా రాస్తే యంగ్ పాఠకులు గ్యారంటీగా తయారవుతారనిపిస్తుంది..
రాయుడు గొప్పదనం సంప్రదాయాన్ని,మోడర్నిటీ ని సమపాళ్ళలో కలపగలగటం.అతని నెరేషన్ ఫ్లో లో లాగ్ కనిపించదు.
మరో నవలికను *ౠమ్* అన్నాడు. కొంచెం కన్ఫ్యూజన్ కు రూమ్ ఇచ్చాడిక్కడ. ప్రేత్తాత్మ, మంత్రించిన బూడిద, ప్రేతాలుగా మారే మనుషులు. రౌద్రం, రుథిరం కలిసిపోయిన కథ. ఇలాంటి థ్రిల్లర్ లో ఎత్తుగడొక్కటే కాదు, మొత్తం కథంతా పాఠకుడు మునివేళ్ళపై నిలబెట్టేటట్టుండాలి.
దయ్యాలు, ప్రేతాత్మలు భయపెట్టాలంటే రచయిత సీన్లను పకడ్బందీగా రాసుకోవాలి.. కథ పరంగా ఎక్కువ కష్టపడిన కథగా రచయిత దీన్ని చెప్పుకున్నాడు. సీనిక్ ఆర్డర్ తో సాగినట్ఠు సాగే ఈ కథ క్లైమాక్స్ పూర్తిచేయకుండా ఇంకోపని మొదలెట్టలేం.
ఎనభైలనాటి కథని క్లైమాక్స్ లో అర్థమవుతుంది మనకు. కాసేపు భయం నీడలో, భయంకరమైన చీకటి మర్రిమాను జుట్టువిరబోసుకుని పిలుస్తుంటే వళ్ళు జలదరించకుండా ఉండదు. పర్ఫెక్ట్ వెబ్ సరీస్ చూస్తున్న ఫీల్ చదువుతుంటేనే వస్తుంది.
అరుంధతి వంటి చాలా సినిమాల ఇన్స్పిరేషన్ రచయితకున్నా ఒక్క వృథా అక్షరం కూడా లేకుండా పేపర్ పై పెట్టడం మామూలు విషయం కాదు. కథలన్నీ జీవితానుభవంలోంచే రావాలని సీనియర్లు చెబుతారు. కానీ కాల్పనిక సాహిత్యం (ఫిక్షన్) పూర్తిగా రచయిత ఊహాలోకం.
ఏమాత్రం తేడాకొట్టినా అసలుకే మోసం వస్తుంది.ఈ కత్తిమీద సాము అతిలాఘవంగా చేస్తాడు మన కూతలరాయుడు. ఎక్కడికక్కడ మలుపుల విరుపులు వడ్డిస్తూ కథను లాక్కుపోతాడు.
ఈ రచనలు పుస్తకరూపం దాల్చటానికి కారకుడు అతని ట్విట్టర్ మిత్రుడు మధుసూదనరెడ్డి. ఈ పుస్తకంలో సామాజిక స్ప్రహ కనపడదు. కానీ ఈ పుస్తకం తాలూకు ప్రొసీడ్స్ (proceeds) (రాబడి)ని ఓ సామాజిక కార్యం కోసం వినియోగించడం మాత్రం పేదవిద్యార్థులను హత్తుకునే యువ హృదయాలను చూపుతుంది.
ట్విట్టర్ ఆప్తులు కొండుభట్ల చంద్రశేఖర్ కాండక్ట్ సర్టిఫికెట్ కానీ తెలుగు తీపి ని నిరంతరం పంచే మరో ట్విట్టర్ పక్షి కృష్ణ మోహన్ పలుకులు ఉగ్గాని తిన్నంత ఉత్సాహాన్ని పంచుతాయి. నిస్సందేహంగా స్తబ్ధుగా ఉన్న తెలుగు కథాకొలనులో తనరచనలతో ప్రకంపనలు పుట్టించాడు మన కూతలరాయుడు.. ఇది కొత్త తరం కోత.. నవతరం కూత అంటే ఔనని మీరే అంటారు
– సి.యస్.రాంబాబు
చాల బావుంది సార్.