కొందరి మనుషుల జీవితాలు
రంగురంగుల భవంతులు
అద్దాలమేడలు
అబ్బురపరిచే వింతలు
విలాసవంతమైన జీవితాలు కొందరివి అయితే…
నిత్యం జీవన పోరాటంలో
చాలి చాలని బ్రతుకులతో
ఆకలి అవమానాలు ఆర్తనాధాలతో
కాలం సాగిస్తున్న కటిక పేదరికం
మరికొందరివి
కర్మ సిద్ధాంతాలు కాటేస్తేనే
కాలం ఇలా తిరగబడి
విధి విసిరేసిన జీవితాలు
ఇలా ఉన్నాయి అంటారా
కాదు… కాదు…
ముమ్మాటికి కానే కాదు…
రాసుకున్న రాతలు
చేసుకున్న చట్టాలు
కుర్చీలాటలో ఖూనీ చేయబడుతూ
అధికార దాహంతో
అజ్ఞానికి ఆజ్యం పోస్తూ…
దేశం సంపద అంతా కొందరి దగ్గరనే
అల్మారిలో, అర్రలలో, గోడంలలో
మూటలతొ కట్టి
కుక్కి కుక్కి పెట్టినవి
ముక్కిపోయి పాడవుతుంటే…
మరోవైపు…
భూమాఫియా
ఇసుక మాఫియా
మైనింగ్ మాఫియాలతో
ఖనిజ సంపాదనంతా దోచుకుపోయి
ప్రకృతి సహజ సిద్ధ వనరులను కొల్లగొడుతూ
సకల సంపదలను అనుభవిస్తున్నారు కొందరు
మేము మీలాంటి మనుషులమేనా
ఒకే దేశంలో ఉంటూ కూడా
సకల సంపదలు కలిగి
దుర్భరమైన కఠిన పేదరికాన్ని
అనుభవిస్తూ…
తిండికి, బట్టకి, నీడకి నోచుకోలేక మా బతుకులు ఇలా కావడానికి
ఎవరు కారుకులో అని
తెలుసుకోలేని జీవితాలు…
వారి చావులకు ఎర్ర తివాచీపరిచి
ఎదురుచూసే మూగ జీవులు
మరికొందరు
మారాలి…
ఈ వ్యవస్థ మారాలి…
ఈ వ్యవస్థలో మార్పులు రావాలి…
నేను
నా పిల్లలు
నా కుటుంబం
నా జాతి
నా కులం
నా మతం
నా బలగం
నా బంధుమిత్రులు అని కాకుండా
పేదలు, ధనికులు అని తేడాలు లేకుండా
అందరికీ సమానంగా హక్కులు పంచబడాలి
అందరూ సమానంగా జీవించగలగాలి
” సర్వ మానవ సమానత్వమే
సమసమాజ నిర్మాణం”
-బొమ్మెన రాజ్ కుమార్