కిలాడీ అల్లుళ్ళు

కిలాడీ అల్లుళ్ళు

రంగారావుగారికి ఇద్దరు కూతుళ్లు. పెద్దమ్మాయి లత, రెండో అమ్మాయి గీత. ఇద్దరూ డిగ్రీ వరకు చదివారు. పిల్లలు చదువు పూర్తి చేసుకున్న తర్వాత మంచి సంబంధాలు చూసి రంగారావు వారికి పెళ్లి చేసాడు. అల్లుళ్ళు ఇద్దరూ ఆస్తిపరులే. ఒకరికి మించి మరొకరు తెలివితేటలు కల వారు. ఇద్దరూ వ్యాపారం చేస్తూ ఉండేవారు. ఒకరోజు రంగారావు తన అల్లుళ్ళు ఇద్దరినీ పిలిచి, “నాకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎప్పుడు హరి అంటానో తెలియదు. అందుకే ఆస్తులు పంచేద్దామని అనుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలను నాకు తొందరగా తెలియజేయండి” అన్నాడు.

అప్పుడు పెద్ద అల్లుడు “చూడండి మామగారూ, మీరు ఆరోగ్య విషయంలో ఏమీ ఖంగారు పడవద్దు. సిటీలో మంచి వైద్యం దొరుకుతుంది. నా వద్దకు వచ్చేసి ఉండండి.” అన్నాడు. అప్పుడు రెండవ అల్లుడు “మామగారూ, మీరు చక్కగా పల్లెటూర్లో నా వద్దనే ఉండండి. ఇక్కడ అయితే కాలుష్యం ఏమీ ఉండదు. మంచి గాలీ, నీరు ఉంటుంది. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అరగంటలో దగ్గరనే ఉన్న పట్టణానికి వెళ్ళి అక్కడ ఆస్పత్రిలో వైద్యం పొందే అవకాశం ఉంది. నా దగ్గరే, ఇక్కడే ఉండండి” అన్నాడు.

రంగారావు చాలా సంతోషించాడు. తన అల్లుళ్ళు ఇద్దరూ తన మంచి గురించి ఎంత చక్కగా సలహాలు ఇస్తున్నారు అని మురిసిపోయాడు. రాత్రి భోంచేసి పడుకున్నాక పదకొండు గంటలకు మెలుకువ వచ్చింది. మంచినీళ్లు తాగుదాం అని రూమ్ బయటకు వచ్చాడు.

అప్పుడు పెద్ద అల్లుడు గది ముందు నుండి వెళుతుంటే తన కూతురు, అల్లుడి మాటలు వినపడ్డాయి. “ఆస్తి రాసిస్తానని మా నాన్న చెపితే మీరు ఎందుకు ఒప్పుకోలేదు” అంది రంగారావు కూతురు. అప్పుడు “ఇప్పుడు రాసేస్తే ఇద్దరికీ చెరి సగం అంటారు మామగారు. అదే మన దగ్గరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయనని చక్కగా మంచి చేసుకుని ఎక్కువ ఆస్తి
మనమే వ్రాయించుకుందాం” అన్నాడు పెద్దల్లుడు.

పెద్ద అల్లుడి మాటలు విని “ఔరా, ఎంత ముదురు వీడు” అని మనసులోనే అనుకున్నారు రంగారావు. అలా రూముకు వెళ్ళే దారిలో రెండో అల్లుడి రూము ఉంది. ఆ గది బయట నుంచి వెళ్తుంటే కూతురు, అల్లుడు మాట్లాడుకునే మాటలు వినపడ్డాయి. “ఆస్తి వ్రాస్తానంటే ఎందుకు వద్దన్నారు” అన్నది రంగారావు రెండో కూతురు తన భర్తతో. అప్పుడు “ఇప్పుడు కనుక మనం వ్రాయించుకుంటే చెరి సగం ఆస్తి వస్తుంది. అదే పెద్ద అల్లుడు వెళ్ళిపోయాక మనతో ఉన్న మీ నాన్నను మంచి చేసుకుని మొత్తం ఆస్తి మనమే వ్రాయించుకుందాం” అన్నాడు రెండో కూతురు భర్త.

వారి మాటలు విని “ఇద్దరు అల్లుళ్ళూ జగత్ కిలాడీలే. తన ఆస్తిని ఎలా తీసుకోవాలో తెలివిగా ప్లాన్ చేసుకున్నారు. వీరికి ఇప్పుడు ఆస్తులు వ్రాసి ఇవ్వటం నాకు మంచిది కాదు. నా తదనంతరం ఇద్దరికీ సమానంగా అందేట్లు రేపు వీలునామా వ్రాయించాలి” అనుకున్నాడు రంగారావు. ఆ నిర్ణయం తీసుకున్నాక అతని మనసు నెమ్మదించింది. ప్రశాంతంగా పడుకున్నాడు రంగారావు గారు.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *