కవిత్వమంటే
కత్తికంటే పదును కలంపోటు…
కవుల వారసత్వమై మధిని తొలచిన
పదాలు ప్రవాహమై పోటెత్తిన ప్రతి సందేశం
అవినీతిపై విరుచుకు పడ్డదే…
అఘాయిత్యాల అరణ్యాలను దావానలమై
కాల్చుతు తలచిన తరుణంతో పొడిచే
పొద్దును నుదిటికి తిలకంగా దిద్దుకొని…
పోరుబాటను నడిపించే కనిపించని
మనస్సుకు మార్గం కవిత్వమంటే….
కవి మనస్సు బంధాలకు లొంగని భంగురమై
తపన సాయుదమై…వేదన చెందని
కవణపు ఉద్దేశాలను చిలుకుతు వాదించే
వాక్యాలుగా ఊతకర్ర నడగని వేదంగా
ప్రయాణమవుతు శృంఖలాలను తెంచేటి
సమ్మెటపోటై…ధీటుగా నిలిచిన దివిటీలతో
విప్లవం వర్ధిల్లాలనే పులికేకను పుట్టించి
విల్లు నొదలిన శరవేగంతో గమ్యాన్ని
గుచ్చేదే కవిత్వమంటే….
రవి గాంచని అడుగు పాతాళం జగతికి
మాయని…ఆ మాయని కనిపించే
ఎండమావులతో పారదోలుతు… అవని
అంచులలో తొంగి చూచిన నింగిలోని
యద్భావనని తబ్ధావనగా తాకుతు…
తరుణి అందాలను తానెరిగిన దేహంగా
తొడిగిన అక్షరాలై…కదలిన ఏరువాకతో
భూమిని పగిల్చిన బీజపు చిరుసహనానికి
స్వాగతం పలికిన గెలుపు కవిత్వమంటే….
ఆయుధంలేని మాటల యుద్దంతో
ఎరుపెక్కని కదన రంగపు శూరత్వంతో
అంతులేని పరాభవాలను అక్షరాలతో
జయిస్తు…మన్నింపుల ఆవేశాలను మానసిక
స్వేచ్ఛతగా తాగుతు…రాజీపడని ధోరణితో
రాజ్యమేలుతు బలివాడన ఆర్తనాధాలను
తన గుండె చప్పుడుగా స్పందిస్తు…
కిరీటం లేని రాచరికాన్ని పది మందికి
పంచుతుంది కవిత్వమంటే…
-దేరంగుల భైరవ