కవి(త)త్వం
కవిత్వం ఎలా రాయాలో
నేర్పమన్నాడు ఓ యువకవి
“నవ్వడం ఎవరు నేర్పారో
ఏడ్వడం ఎవరు నేర్పారో
వారినే నేర్పమని అడుగు”
అడుగుముందుకేసి నడుస్తు చెప్పాను
మళ్ళీ కొన్ని రోజుల తర్వాత
తారసపడి,ఈ మాటన్నాడు
“నిజమే…..సార్ ….
కవిత్వమనేది
కలానికి కన్నీటికి మధ్యజరిగే
అనిర్వచనీయ రసాయన చర్య.
నిజమే …సార్ ….
కవిత్వమనేది
వేదనలోంచి వేదంలా పుట్టాలి
శోకంలోంచి శ్లోకంలా పుట్టాలి”
-గురువర్ధన్ రెడ్డి