కవితా ఓ కవితా
బాధలోనూ భయంలోనూ
నాకు తోడుంటావు
అణచివేతను ఆధిక్యతను
ప్రశ్నించే స్వరమవుతావు
గూడుకట్టుకున్న దుఃఖానికి
గూడురిక్షాగా మారి
అక్షరాల వెలుగుతోవలో నడుపుతావు
కాలం గాయాలకు లేపనం
పొగచూరిన బతుకులకు వెల్ల
వెలితినిండిన జీవితాలకు ఆశ
నీవేగా..నీవులేని నేను లేనుగా..
నిన్నను నేడును అనుసంధానిస్తూ
రేపటి రోజును అనుమానిస్తూ
వర్తమానమే గమ్యమంటూ గుంభనగా చెబుతావు
కలను కళగా మార్చే రసవిద్యవు
వెతల దారంతో వేకువనల్లి
సంవేదనల సమన్వయంతో
మనసును గట్టిపరిచే
“కవితా ఓ కవితా”
ఇదే నా అక్షరవందనం
– సి.యస్.రాంబాబు