కవి మరణం

కవి మరణం

ఎవరికైనా
మరణం సహజమే గానీ
కవి మరణం
నేలకు చాలా లోటు

కవి తిరిగిన భూమ్మీద
ద్వేషం మాయమవుతుంది
భ్రమలు తొలగుతూ
సత్యదర్శనమవుతుంది
పగకత్తులు నూరేచోట
కవి ప్రేమవంతెనలు నిర్మిస్తాడు

కవి బతికుంటే
అన్యాయాన్ని నిలదీసే
ప్రశ్నలపిడికిళ్లు రాస్తాలెక్కుతాయి
దీనుల కన్నీటివైపు
మానవత్వం అడుగులేస్తుంది

కవి తిరిగిన తావులన్నీ
హృదయాల్లో తడి
చేతులలో సాయగుణం పెరుగుతుంది
కవి ఎవరైనా
విభజనరేఖలు గీసేవాడు కాదు
విడిపోయిన వాళ్లను
తిరిగి కలిపే మమతవాడు!

కవి పాడెక్కితే
లోకానికి బూజులెక్కువైతాయి
ఇంటిని అద్దంలా శుభ్రపరిచే
తల్లిలాంటోడు కవి
ప్రపంచపాదాలకు నిర్మలత పూస్తాడు
బిడ్డను పతనాల్లో పడకుండా
చేయిపట్టి నడిపించే
తండ్రిలాంటోడు కవి
మనుషుల్ని వక్రగతులు పట్టనీడు

కవిమరణిస్తే
నేలనుంచి
కొంత వెలుగు తరలిపోయినట్టే

కవి సమాధి పై
చల్లిన పూలు వాడిపోవచ్చు
అతడు రాసిన కవితలు
ఇక్కడ ఎప్పటికీ వాడిపోవు
ఈ నేలను వీడిపోవు!!

-గురువర్థన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *