కవల సహోదరులు
అనగనగా వీరాపురం అనే ఒక పల్లెటూరు ఉండేది. అచ్చట చంద్రయ్య అనే రైతు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు. ఆయనుకు ఇద్దరు అబ్బాయిలు. బాగా చదువుకుంటారు. ఇద్దరు కవల సహోదరులు. వారి పేర్లు సదానందం మరియు చిదానందం. పక్క ఊరు నర్సాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుకుంటున్నారు.
దసరా పండుగ సెలవలు వచ్చాయి. పదిహేను రోజులు ఆనందంగా గడపటానికి ఇంటికి వచ్చారు. తల్లితండ్రులు చాల ఆనంద పడ్డారు. ఎందుకు పడరు? కవల పిల్లలంటేనే ఇంటికొక అందం! అమ్మ శాంతమ్మ రకరకాల పిండివంటలు చేసారు పిల్లల కోసం.
ఈ సంవత్సరం వర్షాలు బాగానే పడ్డాయి. పొలం పనిలో చంద్రయ్య ఇంటినుండి బయటకి వెళ్ళటం మొదలు పెట్టారు. వారికి పొలంలో ఒక నుయ్యి ఉన్నది. నీరు కోసం బావి నుండి చోదకయంత్రం (మోటారు) పెట్టి, గొట్టం ద్వారా నీరు తీసి పొలానికి పంపిణి చేస్తారు. వీరాపురం గ్రామం నుండి 9 కిలోమీటర్ల దూరంలో గోదావరి పాయతో నీరు ప్రవహిస్తూ ఉన్నది.
అక్కడ ఇద్దరన్నదమ్ములు ఆడుకోవటానికి వెళ్లారు. నీటిలో ఆడుతూ ఆడుతూ సదానందానికి ఒక ఆలోచన తట్టింది. మన ఊరికి ఈ పాయ నుండి ఒక కాలువ తవ్వితే పొలాలకు నీరు వెళుతుంది కదా అని! ఎందుకంటే ఎప్పుడు నూతినీటి మీద ఎందుకు ఆధార పడాలి? ఈ మాట సదానందం చిదానందంకి చెప్పాడు. అది విని చిదానందానికి ఇది సరైన మాట అని అనిపించింది. కానీ సుమారు 9 కిలోమీటర్లు కాలువ తవ్వటం ఎలా? అందరి సహాయం లేనిదే అది సాధ్యం కాదుగా!!
ఇంటికి వెళ్లి ఇద్దరన్నదమ్ములు తన తల్లితండ్రులతో ఈ మాట చెప్పారు. చంద్రయ్యకు ఇది సరైన విషయమనిపించింది. ఎందుకంటే గోదావరి నీరు వర్షాకాలంలో ఎక్కువ ఉంటుంది. కానీ తరువాత సమయంలో పాయ ఎండిపోతుంది. అందుకు చిదానందం ఏమిటన్నాడంటే మన ఊరి కోనేరులో నీరు ఉండదు. ఈ పాయ నుండి వచ్చే కాలువ నీరును కోనేరుతో చేర్చుదాం!
తల్లి కూడా ఇది ఒక మంచి ఆలోచన అన్నది. ఇంకేముంది! ఇద్దరన్నదమ్ములు మెల్లగా సలకపార తీసుకుని పాయ నుండి కాలువ తవ్వటం మొదలుపెట్టారు. ఊరులో మిగతా జనాలు చూసి నవ్వటం మొదలు పెట్టారు. ఎందుకంటే వారికి ఈ విషయం ఏమి అర్థం అవలేదు.
9 రోజులు గడిచాయి. కేవలం 900 మీటర్లు కాలువ తవ్వబడింది. ఇక ఊరులోని మిగతా జనం ఒకొక్కరు సహాయం చెయ్యటం మొదలుపెట్టారు. ఆలా మెల్లగా చాలా మంది అయ్యారు. కాలువ పని వారం రోజులలో తాత్కాలికంగా పూర్తి అయ్యింది. మట్టి కాలువ కావున మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కానీ సంతోషకర విషయం ఏమిటంటే కోనేటిలో గోదావరి నీరు వచ్చింది. ఈ నీరు మళ్ళీ పొలాలకు పంపిణి చెయ్యటానికి ఆస్కారం కూడా ఉంది.
వీరాపురం జనాలు కవల సహోదరుల మంచి పని చూసి చాల ఆనందించారు. వారి నీటి సమస్యకొక పరిష్కారం చూపించారు. ఎందుకంటే భూగర్భ నీరు ఎక్కువ వాడుకోకూడదు. అది చెట్లకోసం భూమి ఏర్పాటు చేసిన సౌకర్యం. ఇది సదానందం తన విజ్ఞానం విషయంలో చదివాడు. ఈ వార్త మిగతా గ్రామాలకు ఇకేనా ఇంకా పశ్చిమ గోదావరి జిల్లాధికారి వద్దకు చేరింది.
జిల్లాధికారి ఇద్దరు అన్నదమ్ములను సత్కరించి ఇంకా అభినందించి ఈ కాలువకు పక్కా కాలువ చెయ్యటానికి నిర్ణయించారు. ఈ కాలువపెరు “ఆనందం పెద్దకాలువ” అని పేరు పెట్టారు. ఇద్దరన్నదమ్ముల ఉన్నత చదువులకు విద్యార్థి వేతనం కూడా ఇచ్చారు. చంద్రయ్య ఇంక శాంతమ్మ వారి పిల్లల ఔన్నత్యానికి ఏంటో పొంగిపోయారు.
నీతి వాక్కు: చదివిన చదువు మరియు సంపాదించిన మేధస్సుతో పరుల కోసం మంచిపని చెయ్యాలి. అప్పుడే నేర్చుకున్న విద్య రాణిస్తుంది.
– భరద్వాజ్