కరువైన మనశ్శాంతి
సంధ్య ఇలా అయితే ఎలానే… ప్రాణమంటూ పెళ్ళి చేసుకున్నావు.. ఓక్షణమైనా విడిచి ఉండలేను అన్నావు. ఇపుడేమో అసల ఆ మనిషి ముఖం చూడను అంటున్నావు. ఇలా చెప్పాపెట్టకుండా వచ్చి గుండెల్లో బుల్లెట్స్ పేల్చుతున్నావేంటే… అంటుంది తల్లి సుధ. అవునమ్మా ఇంతకు ముందులా లేడమ్మా సుధాకర్. బాగా మారిపోయాడు. ప్రతీది ప్రశ్నిస్తున్నాడు. ఇది ఎందుకు ఇలా చేసావ్.. నిన్నెవరు డ్రాప్ చేసారంటూ ఆరాలు, అనుమానాలు నావల్లవట్లేదు అమ్మా…
చూడమ్మా సంధ్య భర్తన్నాక ఆ మాత్రం వివరాలు అడుగుతారు. దానికి నువ్విలా వచ్చేయడం.. తిరిగి వెళ్ళను అనడం బాలేదురా… ఒకసారి ఆలోచించు అంటుంది సుధ. కానీ సంధ్య ఇపుడేమీ ఆలోచించే స్థితిలో లేదు.
సుధ భర్తకి పోన్ చేసి జరిగినది అంతా చెబుతుంది. భర్త అంతా విని సరే సాయంత్రం ఇంటికివచ్చాక మాట్లాడతాను. నువ్వేమీ అనకని చెప్పి పోన్ పెట్టేస్తాడు. చేసేదేమిలేక వంటింట్లో కాఫీ కలపడానికి వెళుతుంది సుధ. సంధ్య తలస్నానం చేసి వచ్చి తలారబెట్టుకుంటూ హాల్లో టీవీ ముందు కూర్చుంటుంది. సుధ కాఫీతెచ్చి ఇచ్చి మరలా వంటింట్లోకి వెళ్ళిపోతుంది వంట చేద్దామని.
వంట చేస్తుందే కానీ ఆలోచనలన్నీ సంధ్య చెప్పిన విషయం మీదనే ఉన్నాయి. ఏం చేసేది తోచక అత్తగారికి ఫోన్ చేసి మనవరాలి సంగతి చెప్పింది. అంతా విన్న అత్తగారు నువ్వేమీ అధైర్యపడకు సుధ నేను వస్తున్నాను. ఇప్పుడే ఆయన నేను కలిసి బయల్దేరతాం అని అభయమిచ్చాక కాస్త ఊరటిల్లింది సుధ.
హఠాత్తుగా వచ్చిన నాన్నమ్మతాతయ్యల్ని చూసి సరదాపడిపోయింది సంధ్య. ఏమిటి చెప్పాపెట్టకుండా సడెన్ గా వచ్చేసారు అంతా కుశలమేనా అంటూ క్షేమసమాచారం తెలుసుకుంది. అంతలోనే సుందరయ్యగారు (తాతయ్య) నాన్నమ్మ (కాంతం) ని ఉద్దేశించి నీకసలు బుద్దుందా.. బస్సులో పక్కనున్న కుర్రాడితో ఆ ఇక ఇకలు పకపకలు ఏమిటి? మొగుణ్ణి నేనొకణ్ణి ఉన్నానని గురుతుందా లేదా? అంటారు.
సంధ్య అధిరిపడుతుంది ఆమాటకి. కాంతం ఆహా ఈయన రావడం రావడం పని మొదలు పెట్టేసారే అనుకుంటూ… అదేమీ కాదండి మన సంధ్య భర్త వయసు అతనే కదా ఏదో మన మనవడిలాంటోడని మాట్లాడాను అంతే తప్ప ఇంకే ఉద్దేశం లేదండి క్షమించండి అంటూ కోడలి వెనుక వంటింట్లోకి వెళుతుంది. సంధ్య తాతగారిని వాళ్ళ బ్యాగును పట్టుకుని రూంలో పెట్టి తాతయ్య స్నానం చేయండి. భోజనం రెడీ అవ్వగానే పిలుస్తానని చెప్పి నాన్నమ్మదగ్గరకొస్తుంది.
ఇదేమిటి నాన్నమ్మా తాతయ్య అంతలా అనిమానిస్తున్నారు నిన్ను అని అడుగుతుంది. ఇదేమన్నా కొత్తేమిటే…. మగాడన్నాక అలానే ఉంటాడు. తన భార్య తనకే సొంతమని మరొకరితో మాట్లాడినా, వేరెవరన్నా తనని గమనించినా తట్టుకోలేరు. అంతమాత్రానికి అదేమీ అనుమానం కాదు. జాగ్రత్త. వాళ్ళ బంధం తెగిపోకూడదని. కలకాలం పెనవేసుకుపోవాలని తపన. అంతే. అంటుంది.
అంతా విని అయోమయంగా బయటకు వచ్చిన సంధ్య భర్తని గుర్తుచేసుకుని నిజమే కదా చాలా చిన్న విషయానికి మా ఆయనకి అనుమానం అనుకుని అవమానించి పుట్టింటికివచ్చేసాను. నిజంగా అనుమానమంటే నరకం చూపించుండాలి అని అనుకుంటూ భర్తకు ఫోన్ చేసి క్షమాపణ అడగాలి అనుకుంటుంది. అంతలో భర్త నుండి ఫోన్ రావడం చూసి ఆశ్చర్యపోతంది.
క్షమించు సంధ్య నీమీద అనుమానంతో నేను నిన్ను ప్రశ్నించాను. బయట రోజులు బాగుందడంలేదు. జాగ్రత్తగా ఉండకపోతే కష్టం కదా అని అలా… అంటుండగా నాదే పొరపాటు నన్నే క్షమించండి. మీరు చేసింది నాకు ఇపుడే అర్ధమైంది అంటుంది. అలా మాటల్లో ఉండగా…
బయట సుధ కాంతం వాళ్ళ పాచిక పారిందని సంతోషపడుతుంటారు. ఏమోయ్ నేను బాగా నటించానా అంటూ వస్తారు సుందరయ్యగారు. సూపర్ మామయ్యగారు మీ నటన సంధ్యలో మార్పు తెచ్చింది అంటుండగా సుధ భర్త వస్తాడు. ఏమైంది ఏంటో ఫోన్ చేసావు ఇపుడు చెప్పు అంటూ..
అమ్మా నాన్న మీరెపుడు వచ్చారు. అంతా కులాసేనా? అంటుండగా.. సుధ తాగడానికి మంచినీరు అందిస్తూ అంతా కుశలమే… మీరు వచ్చెలోపే సమస్యంతా తీర్చేసారు మామయ్యగారు అత్తయ్యగారు కలసి. అంటుండగా సంధ్య ఫోన్ మాట్లాడేసి వస్తుంది హాల్లోకి.
తండ్రిని చూసి నవ్వుతూ నాన్నా ఆయన వస్తున్నారు. మేము ఒక రెండు రోజులుండి వెళతాము అంటుంది. అందరూ హాయిగా నవ్వుకుంటారు అపార్ధాలు తొలగి అంతా సుఖాంతమైందన్న ఆనందంలో… భోజనాలు చేసి తాతయ్య నాన్నమ్మలు సంధ్యతో అపార్ధానికీ… అనుమానానికీ మధ్య సన్నని గీత ఉంటుంది అది తెలుసుకోగలిగితే అసలు సంసారంలో చిన్నచిన్న గిల్లికజ్జాలే తప్ప పెద్ద పెధ్ద తుఫానులు రావు అని చెప్పి జాగ్రత్తగా హాయిగా ఉండండంటూ తిరగు ప్రయాణమవుతారు. అదన్నమాట సంధ్య కథ. సో ఇక కథ కంచికి మనం ఇంటికి అన్నమాట.
– ఉమామహేశ్వరి యాళ్ళ