కలము_పరుగులు

కలము_పరుగులు

 

ఉదయాన్నే లేచాను
కవిత రాద్దామని కలము తీశాను
అక్షరాలు నింపడానికి పేపర్లను
ముందరేసి కూర్చున్నాను
ఆలోచనలు అంతుపట్టలేదు
కడుపులో కాస్త ఆకలి మొదలయ్యే
కంచం ముందు కూర్చుంటే
ఆకలి కడుపు రొట్టెలను ఖాళీ చేసే
పేపరు పక్కన కదిలే
బుర్రలో ఆలోచన రాలేదు
తిన్న శరీరానికి బద్ధకం వచ్చే
కలం కాస్త జాలిగా చూసే
కలలో మట్టి కాస్త జిలవేసే
గోరుకు కాస్త పని పెట్టే
స్నానం చేస్తే పోతుందని
బకెట్ నీళ్లు గుమ్మరిస్తే
చల్లని నీళ్ళతో శరీరం కంపించే
తలంతా శుభ్రం అయ్యే
బుర్ర ఖాళీ అయ్యే
ఆలోచనలు మాత్రం రాలేదు
పేపర్ పై కలం చేర్చి
పాత పుస్తకాలు కాస్త తిరిగేస్తే
ఆంధ్ర చరిత్ర కాస్త చూస్తి
అద్భుత వైభవాలను చదివితిని
కాస్త లేచి బయటపడితే
దారివెంట చరిత్ర విలవిల పోయె
ఆంధ్ర వంటకాలు ఆవిరి పోయే
బర్గర్లు పిజ్జాలు ప్రత్యక్షమయ్యే
సంస్కృతి అంతా సంకరం అయిపోయే
పట్టు పంచ కాస్త జీన్స్ అయ్యే
పట్టు పావడాలో స్కర్ట్ వచ్చే
అంగడి పైన కనిపించే అక్షర పలకలు
తాటికాయంత తెలుగు అక్షరాలు పోయె
టెంకాయ అంత ఆంగ్ల అక్షరాలు ప్రత్యక్షమయ్యే
కట్టు బొట్టులో లేదు సంస్కృతి
కానరాదు దారివెంట ఎక్కడ
పరదేశాల సంస్కృతి ప్రక్కన
బిక్కుబిక్కుమంటు నక్కే
ఇక నా చరిత్ర పుస్తకాల కే పరిమితమా!
నా సంస్కృతి సంప్రదాయాలు నావి కావా!
ఆలోచనల్లో వేగం పెరిగే
ఇంటికి పరుగు పెంచే
పేపర్ పై కలము చిందులేసే
నా చరిత్రలో
నా భాషలో
నా వేషములో
నా సంస్కృతిలో
నా సాంప్రదాయాలలో
నా రుచులలో
నా అభిరుచులలలో
నవ నాడుల్లో
నా తెలుగుదనం ఉట్టిపడే
నా కవితకు ప్రాణం పోసే….!!

 

 -గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *