కలలు.. కాంతులు..

కలలు.. కాంతులు..

కలలు తాగని రాత్రులన్నీ
కలత నిండిన వనాలేగా
వెతలు పండిన పొలాలన్నీ
మేటవేసిన మనుషులేగా

దారితప్పిన మనసులన్నీ
ధ్వంస రచనకు వ్యూహమల్లగ
చీకటే మిగిలింది జగతిన
చిన్నబోయెను జ్ఞానమార్గము

నీరుగారెను ఆశలన్నియు
మోడువారెను ప్రేమవృక్షము
ఖేదమేమో కెలకసాగెను
మోదమేమో మసకబారెను

దుఃఖపడకోయ్ సోదరా
కాలమెన్నడు జడము కాదు
మార్పు తెచ్చే రోజు ఉంటది
నిన్ను వెతికే తీరుతుందది

బొమ్మ బొరుసు రెండు ఉంటయి
బతుకు పోరులో వెంట ఉంటయి
బాధపెట్టే రోజు వెంటే
అభయమిచ్చే ఆశ ఉంటది

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *