కలలతీరం

కలలతీరం

కలలతీరాల చేరికకై
ఆశలనావలో ప్రయాణమై
మౌనం చుక్కానితో
సంఘసాగరాన్ని తరించే
మగువగుండెలోయ
లోతులెవరికి తెలుసు?
అగ్గికొండలన్నీ అంబుధి
అడుగునే అడుగంటి పోతుంటే..
నిప్పులుకక్కే లావా ఉప్పునీట కలసిపోతుంటే…
స్త్రీ “వివక్ష”ను సులువుగా చెప్పడం
ఏ ఎఱ్ఱనకైనా…
ఏ శ్రీనాథునికైనా సాధ్యమా!
రాత్రి కనే కలలన్నీ
ఉదయరాగపు నిట్టూర్పులై గాలిలో కలిసిపోవాల్సిందే..
ఆర్ధిక స్వాతంత్ర్యంలో స్త్రీ
పెనం మీద నుంచి పొయ్యిలో పడి
కలలు కనే సమయాన్నే కోల్పోయింది..
కలలన్నీ కల్లలే అని తెలిసినా,
కనుకనుమలలో కలల సౌధం నీలి నీటి పరదాలు పరుస్తూ మళ్లీ మళ్లీ ఆహ్వానిస్తూనే ఉన్నాయి…

– సలాది భాగ్యలక్ష్మి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *