కలలమేడలు
అల్పజీవులు బడుగుజీవులు
అర్ధాయుష్కులు వారు
బుక్కెడు బువ్వ జానెడు చోటుకు
నోచుకోనివారు
ఆకాశం నీడలో నిద్రించేవారికి
స్వప్నలోకాలేముంటాయి
లాఠీతోడుగా నాట్యం చేసే రక్షకభటుల కర్కశమైన మాటతో రోజు మొదలు
భుక్తేలేనివారికి హక్కులేముంటాయి
విసిరేసిన విస్తరిలాంటి జీవితాలు కదా
నేడిక్కడ రేపెక్కడో అన్న నిట్టుర్పులే ఉంటాయి
ఫ్లైఓవర్లు,
పేవ్మెంట్లు,దించిన షట్టర్లు
ఈ చీకటి బతుకుల కథలకు
మౌనశ్రోతలు..కనిపించని దేవుడికి విన్నపాలు చేస్తాయేమో తెలీదు
అసమానతల ప్రపంచంలో
ఆరని మంటల్లో సమిధలై
వీరంతా కాలిపోతూనే ఉంటారు
‘మేడే’ లు బాగుచేయని బతుకులు వీరివి
మేడల్లో ఉండే మనకు ఇవేమీ కనబడని దృశ్యాలు కావు
మనసు గోడలను కోరికలతో కాంక్షలతో
తాపడం చేశాం కదా..ఏ దుఃఖమూ దరిచేరదు..
రాత ఆ దేవుడు రాశాడోలేదో కానీ
కొందరి రాతలను మాత్రం డబ్బు ప్రపంచం రాస్తుంటుంది
ఏమీచేయలేని వారేమో రాజుకున్న చైతన్యం అగ్గిలా ఎప్పుడో అంటుకోక మానదని
ఇలా అక్షరాలతో కలల మేడలు కడుతుంటారు
– సి.యస్.రాంబాబు