కాలమేఘం
నీలిరంగు ఆకాశం నిర్మలంగా ఉంది
ఒక్కప్పటి నా నిరామయ జీవితానికి నిదర్శనంగా!
ఎక్కడినుంచి ఏతెంచిందో
కరిమబ్బుల దండొకటి
కరిమింగిన వెలగపండులా
వెలవెలబోయేలా చేసింది వెలుగులీనే రవిబింబాన్ని!
క్షణకాలo మ్లానమయినా మరుక్షణం అరుణమై
ప్రభవిస్తుంది భాను తేజం!
కానీ కాలమేఘం
నా బ్రతుకు చిత్రంపై
చిలకరించిన
చీకటి చినుకులు
చెదిరిపోయి నిత్యనీల
స్వచ్ఛ ఆకాశం అవుతుందా ఎప్పటికైనా నా సొంతం?
– మామిడాలు శైలజ