కానుక

కానుక

అందరి అమ్మాయిల లాగానే నాకు కూడా మంచి భర్త, నన్ను ప్రేమించే భర్త రావాలని కోరుకునే దాన్ని నేను కూడా.

నేను కాలేజీకి వెళ్లే రోజుల్లో రోజు సరిగ్గా నేను కాలేజీ కి వెళ్లే సమయానికి తన బైక్ మీద మా ఇంటి ముందు నుండి మెల్లిగా వెళ్తూ మూడు సార్లు హార్న్ శబ్దం చేసేవాడు అతను…

ఆలా మూడు సార్లు హార్న్ శబ్దం చెయ్యడం అతను నాకు ఇస్తున్న సిగ్నల్… ఆ శబ్దం విన్న ఒక అయిదు నిమిషాలకి నేను బయలుదేరేదాన్ని…

మా వీధి చివర ఉన్న చాట్ బండి దగ్గర అతను బైక్ తో ఆగి నాకోసం ఎదురుచూస్తుండేవాడు… నేను అతని దగ్గరికి వెళ్ళగానే దగ్గేవాడు చిన్నగా… దానర్థం నేను అతనిని చూడాలని.

నేను అతన్ని కాస్త దాటి ముందుకు వెళ్ళగానే బైక్ మీద నెమ్మదిగా నా వెనకాలే కాలేజీ వరకు వచ్చేవాడు…

ఏమి మాట్లాడేవాడు కాదు, నన్ను రోడ్ మీద ఆపి పలకరించింది లేదు, తనని నేను తాను నన్ను చూడనపుడు మెల్లిగా చూసేదాన్ని.

సాయంత్రం నాలుగు గంటలకు నేను కాలేజీ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో అదే చాట్ బండి దగ్గర అలాగే నిల్చొని ఉండేవాడు నాకోసం ఇదే అతని దినచర్య..

**********

చాలా రోజులు ఎదురుచూశాను అతను నాతో మాట్లాడుతాడో ఏమో అని, కానీ అతను ఒక్కరోజు కూడా మాట్లాడేవాడు కాదు నన్ను చూసి చిన్నగా నవ్వేవాడు నేను తల మెల్లిగా క్రిందికి దించుకునేదాన్ని.

కొన్నిసార్లు అతన్ని పలకరించి, తనను నేనూ ఇష్టపడుతున్నానని చెప్పాలనిపించేది…. నాతో పాటు రోజు కాలేజీకి వచ్చే సౌమ్య అతను నీకు ఎప్పుడు తన మనసులో మాట చెప్తాడే అని అడుగుతూ ఉండేది.

అలా మూడేళ్లు గడచిపోయాయి… ఈ మూడేళ్ళలో అతని దినచర్య లో ఏమి మార్పు లేదు.

*************

ఒకరోజు ఉదయం దేవుని పూజ చేసుకొని, ఇంటిముందు ముగ్గువేసి మా నాన్న గారి కోసం కాఫీ కలుపుతూ ఉండగా ఎవరండీ లోపల అన్న శబ్దం విని వంటగది నుండి బయటికివచ్చాను.

నాకు చాల ఆశ్చర్యం వేసింది వచ్చింది ఎవరో కాదు నన్ను మూడేళ్ళ నుంచి చూస్తూ, ఉండే ఆ అబ్బాయే.

మా నాన్న గారు రండి బాబు లోపలికి అని అనడం తో నన్ను చూసుకుంటూ చిన్నగా నవ్వుతూ లోపలికి వచ్చి హాల్ లో కూర్చున్నాడు. నేను వేరే గదిలోకి వెళ్ళాను.

నా పేరు సుందర్.. ఇదే కాలనీ లో ఉంటాను. ఈ వీధి మొదట్లో ఉండేది మా ఇల్లే అని అన్నాడతను. నేనూ నిన్ను చూసాను బాబు కాలనీ లో చాలా సార్లు ఎం పని బాబు అన్నాడు మా నాన్న గారు.

అంకుల్ నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుదాం అని వచ్చాను. నేను ఒక ప్రైవేట్ కంపెనీ లో ఉద్యోగం చేస్తున్నాను. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాను అని అన్నాడతను.

తలుపు చాటు నుండి తన మాటలు వింటున్న నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. మూడేళ్ళలో ఒక్కసారి కూడా నాతో మాట్లాడని వ్యక్తి.

కనీసం నా పేరు కూడా ఇప్పటివరకు అడగని వ్యక్తి ఇంత హఠాత్తుగా వచ్చి పెళ్లి చేసుకుంటానని మా నాన్నతో ఇంత ధైర్యంగా అడుగుతున్నాడే అని ఆశ్చర్యం తో పాటు భయం కూడా వేసింది నాకు…

బాబు మీ కుటుంబానికి మంచి పేరు మర్యాదలు ఉన్నాయని తెలుసు, నాకేమి అభ్యంతరం లేదు నువ్వు నీ మనసులో మాట చెప్పావు, కానీ… మా అమ్మాయిని ఒక మాట అడగాలి, నువ్వు మీ పెద్దవాళ్ళని తీసుకొస్తే ఇంకా బాగుండేది అన్నాడు మా నాన్న.

మీకు అభ్యంతరం లేకపోతే ఒక్క 5 నిమిషాలు మీ అమ్మాయితో మాట్లాడుతాను, నా మాటను మా ఇంట్లో వాళ్ళు కాదనరు. మీరు, మీ అమ్మాయి ఒప్పుకుంటే చాలు అని అన్నాడతను.

సరే మాట్లాడు బాబు తనకి ఇష్టమైతే మీ పెద్దవాళ్ళని తీస్కొని రా అన్నారు మా నాన్న గారు.

****************

మిమ్మల్ని నేను మూడు సంవత్సరాల నుండి చూస్తున్నాను ఆ విషయం మీకు కూడా తెలుసు. ఈ 3 సంవత్సరాలలో నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని.

మీకు నేనంటే ఇష్టమేనని ఒకరితో ఒకరు చెప్పుకోలేకపోయిన ఇద్దరికీ అర్థమైంది, మీతో ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా మాట్లాడకుండా నేరుగా పెళ్లి ప్రస్తావన ఎందుకు తెచ్చానంటే…

నేను మీతో చాలా సార్లు నా మనసులోని మాట చెపుదాం అనుకున్నాను కానీ నాకు ఇన్ని రోజులు ఒక ఉద్యోగమంటూ లేదు, నేను స్థిరపడకుండా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పడానికి నాకు మనసు రాలేదు.

అందుకే నేను ఇప్పుడు నేరుగా మిమ్మల్ని పెళ్లి చేసుకుందామని అడగడానికి వచ్చాను అని అన్నాడు తను మా ఢాబా మీద నాతో…

నా ప్రేమ నిజమైంది కాబట్టి మిమ్మల్ని పెళ్లిచేసుకుందామని అనుకొంటున్నాను, అందుకే నేరుగా వచ్చి మీ నాన్న గారితో పెళ్లి విషయం మాట్లాడాను.

ఈ 3 సంవత్సరాలలో మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా లేను, మీరూ నన్ను సూటిగా చూడకపోయినా చాటుగా చూసేవారు అప్పుడే నేనంటే మీకూ ఇస్టమని అర్థమయ్యింది అని చెప్పి… ఇప్పుడు చెప్పండి మనం పెళ్లిచేసుకుందామా అని అడిగాడు తను.

ప్రేమంటే కలిసితిరగడం, షికార్లు కొట్టడం కాదని అది రెండు మనసుల కలయిక అని, అది మా విషయం లో ఎప్పుడో జరిగిందని నాకూ తెలుసు కనుక నేను తనతో పెళ్ళికి సిద్ధమయ్యాను.

*********

ఈరోజుతో మా పెళ్లి జరిగి 5 సంవత్సరాలు అవుతుంది ఈరోజు మా పెళ్లి రోజు.. సాయంత్రం 5 అవుతుంది ఆయన ఇంకా ఆఫీస్ నుండి రాలేదు “స్నిగ్ధ” బయటికి తీసుకెళ్లామని మారాం చేస్తుంది.

నాతో ఆఫీస్ నుంచి త్వరగా వస్తానని, సాయంత్రం బయటికి వెళదామని ఆఫీస్ కి వెళ్లిన సుందర్ సమయం అవుతున్నా ఇంటికి రాకపోయేసరికి కొద్దిగా అసహనానికి గురయ్యాను నేను…

నాన్న ఇంకా ఎప్పుడు వస్తాడు మమ్మీ అని స్నిగ్ధ అడగడంతో నేను ఈ లోకం లోకి వచ్చాను గత ఆలోచనల నుండి…

స్నిగ్ధ కి ఆరోజే మూడేళ్లు నిండాయి మా పెళ్లి రోజు అది పుట్టిన రోజు ఒక్కటే చిన్న పిల్లయినా అందరి పిల్లలాగా అస్సలు అల్లరి చెయ్యదు అదంటే సుందర్ కి, నాకు చాలా ఇష్టం.

స్నిగ్ధ పుట్టిన తర్వాతే సుందర్ కి కలిసివచ్చింది అని ఎప్పుడూ చెప్తుంటాడు తను… అంతగా ప్రేమించే తన కూతురి పుట్టిన రోజు కూడా ఇంటికి తొందరగా రాకుండా ఏమి చేస్తున్నాడో ఆఫీస్ లో అని నాలో నేనే అనుకుంటూ…

“డాడీ వస్తాడు లేరా నువ్వు రెడీ గా ఉంటె డాడీ రాగానే వెళ్లొచ్చు అని స్నిగ్ధ ని దగ్గరికి తీసుకుంటుండగా… కార్ హార్న్ శబ్దం విన్న స్నిగ్ధ గబుకున్న మంచం మీది నుండి దిగి వరండా లోకి పరిగెత్తింది.

దాని కన్నా ఎత్తుగా ఉన్న బాల్కనీ గోడ పై నుండి తన డాడీ సుందర్ ని చూడడానికి ఎగురుతూ ప్రయత్నిస్తుంది.

నేను వెళ్లి స్నిగ్ధని ఎత్తుకుని కార్ పార్కింగ్ చేస్తున్న సుందర్ ని చూపిస్తూ అదిగో డాడీ వచ్చేసాడు, రా లోపలికి వెళ్లి రెడీ అవుదాం అని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళాను.

హే స్నిగ్ధ వేర్ అర్ యూ స్వీట్ హార్ట్? నీ కోసం ఏమి తెచ్చానో చూడు అని సుందర్ హాల్ లో నుండి పిలుస్తున్నాడు.

బెడ్ రూమ్ బయటికి వచ్చిన నేను, స్నిగ్ధతో డాడీతో మనం మాట్లాడం అని చెప్పు స్నిగ్ధ లేట్ గా వచ్చినందుకు అన్నా నేను.

దానికి సుందర్ నవ్వుతూ సారీ లతా కొద్దిగా పని ఎక్కువయ్యింది త్వరగా రాలేకపోయాను అయినా చాలా ఆలస్యం అవ్వలేదుగా పదండి 10 నిమిషాలో రెడీ అవుతాను బయటికి వెళ్దాం అని తన రూమ్ లోకి వెళ్ళాడు సుందర్.

***********

ముగ్గురం కలిసి బోటింగ్ కి వెళ్ళాం చుట్టూ ల్యాండ్ స్కేప్స్, రకరకాల పూల చెట్లు, అప్పుడే సూర్యుడు వీడుకోలు చెప్తున్నాడు. శీతాకాలం అవ్వడంతో చలి తీవ్రత అప్పుడప్పుడే పెరుగుతుంది.

ముగ్గురం పార్క్ లో హాయ్ గా తిరుగుతూ ఉన్నాం. అక్కడ ఉన్న రకరకాల పక్షుల్ని, పార్క్ లో పిల్లల కోసం ఆడుకోవడానికి ఉంచిన ఆట వస్తువులని చూసి స్నిగ్ధ తెగ సంబరపడిపోతుంది.

ముగ్గురం ఆ సాయంత్రాన్ని ఆస్వాదిస్తుండగా సుందర్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది తన తండ్రి గారిని ఉంచిన వృధాశ్రమం నుండి, ఆయన మహా చాదస్తుడు.

ఆయనతో ఉండడం ఇష్టం లేక తన చాదస్తాన్ని భరించలేక నేనే సుందర్ ని బలవంతపెట్టి తనకి ఇష్టం లేకున్నా తన తండ్రిని వృధాశ్రమం లో చేర్పించాను.

ఆయన ఫోన్ చేసింది స్నిగ్ధకి బర్త్ డే విషెస్ చెప్దామని, కానీ నేను ఫోన్ సుందర్ దగ్గరి నుండి తీసుకొని స్నిగ్ధకి ఇప్పుడు మీ డాడీ తో మాట్లాడించాల్సిన అవసరం ఏమి లేదు.

స్నిగ్ధ మళ్ళీ మీ డాడీ దగ్గరికి తీసుకెళ్లమని మారం చేస్తుంది, నేను ఆ దగ్గుధమ్ము ఉన్న ముసలాయన దగ్గరికి రాలేను అని ఫోన్ కట్ చేసేసాను.

నా మాటలు విన్నాడో ఏమో సుందర్ వాళ్ళ నాన్న మళ్ళీ కాల్ చెయ్యలేదు. నువ్వు నా తండ్రి గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అన్నాడు సుందర్.

ఛి… నా మూడ్ అంత పాడు చేసాడు మీ డాడీ, సరదాగా బయటికి వస్తే ఫోన్ చేసి నీకు నాకు మధ్య గొడవ పెట్టాడు దూరంగా ఉన్నా మనల్ని సంతోషంగా ఉండనివ్వట్లేదు అని నేను కొద్ది దూరం లో ఉన్న బెంచి మీద వెళ్లి కూర్చున్నాను.

సుందర్, పద ఇంటికి వెళ్దాం అన్నాడు నా దగ్గరికి వచ్చి.. నేను తన వైపు చూడకుండా లేచి స్నిగ్ధ కోసం చూస్తున్నాను… అటుఇటు.. కనుచూపు మేరలో కనపడకపోయే సరికి కంగారుపడి సుందర్ స్నిగ్ధ కనపడట్లేదు అన్నాను కంగారుగా…

“ఏంటి లత నువ్వు… చిన్న పిల్ల స్నిగ్ధ జాగ్రత్తగా చూసుకోలేవా అన్నాడు సుందర్ చిరాగ్గా”. అంత చిన్న పిల్ల, ఇంత పెద్ద పార్క్ లో, రద్దీ లో ఎక్కడ ఉందొ ఏమో, ఎవరైనా ఎత్తుకెళ్లారో ఏమో…

రోజు టీవీ లో చూపిస్తూనే ఉన్నారు సిటీ లో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు ఎక్కువయ్యారు జాగ్రత్త అని.. నా మనసులో ఆవేదన చెందుతూ స్నిగ్ధ…. స్నిగ్ధా అని గట్టిగ పిలుస్తున్నాను…

దుఃఖం బయటికి వస్తుండడం వల్ల గట్టిగ పిలుద్దామని ప్రయత్నిచిన నా గొంతులోంచి శబ్దం బయటికి రావట్లేదు. అలా కొద్దిసేపు వెతికి ఒకచోట మోకాళ్ళ మీద కుప్పకూలిపోయాన్నేను…

అలా ఏడుస్తున్న నా దగ్గరికి సుందర్ వచ్చి లత స్నిగ్ధ కనపడట్లేదు రా పార్క్ సెక్యూరిటీ కి ఇంఫార్మ్ చేద్దామని నన్ను పైకి లేపడానికి నా చేతిని పట్టుకున్నాడు…

కన్నీళ్లతో నిండిపోయిన నా కళ్ళకు ఎదురుగ కొద్దిదూరం లో ఒక వ్యక్తి స్నిగ్ధని గాల్లోకి ఎగిరేస్తూ ఆడిస్తున్నాడు, తన వెనక నేను ఉండడం వల్ల అతని మొహం కనపట్లేదు నాకు సరిగ్గా…

స్నిగ్ధని, ఆ వ్యక్తిని చూడని సుందర్ తో ఏమండి అదిగో స్నిగ్ధ ఎవరో ఎత్తుకున్నారు అని చూపించి ఇద్దరం గబగబా ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాం స్నిగ్ధ… అని నేను కొద్దిదూరం నుండి పిలవగా ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూసాడు.

ఆయన ఎవరో కాదు సుందర్ వాళ్ళ నాన్న ఆయన చేతుల్లోంచి స్నిగ్ధని తీస్కొని గట్టిగ హత్తుకున్నాను నాన్న నువ్వెంటి ఇక్కడ అన్నాడు సుందర్ .

ఏమి లేదురా ఇవాళ శనివారం కదా మమ్మల్ని బయటికి తీసుకొస్తారు ఆశ్రమం నుండి అని అన్నారాయన.

అక్కడ పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ మా దగ్గరికి వచ్చి ఏందమ్మా పిల్లల్ని గట్ల వదిలేస్తే ఎట్లా, ఆ పెద్దాయన సమయానికి ఉండే కాబట్టి సరిపోయింది లేకపోతే పాప ఆ నీళ్ల కొలనులో పడిపోయేది మళ్ళీ ఏమైనా అయితే మమ్మల్ని అంటారు అని వెళ్ళిపోయాడు.

ఒక్క 10 నిమిషాలు నా కూతురు కనపడకపోయేసరికి ఇంత భాధ పడ్డానే, ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి పెద్ద చేసిన తన కొడుకుని నేను దూరం చేశాను దానికి ఆయన ఎంత బాధపడి ఉంటారో అని అర్థం అయ్యింది నాకు…

మీరు ఇవ్వాళ లేకపోతే స్నిగ్ధ దక్కేది కాదు మామయ్యా అని ఆయన గుండెల మీద నా తలపెట్టి ఏడుస్తుండగా మరేం పర్లేదమ్మ అమ్మాయి జాగ్రత్త అని చెప్పి నేను ఇక వెళ్తాను అన్నారాయన.

నేను ఆయన చేతుల్ని నా చేతుల్లోకి తీస్కొని నన్ను క్షమించండి మామయ్యా నా తప్పు నేను తెలుసుకున్నాను కన్నవారికి తమ పిల్లలు దూరం అయితే ఎలా ఉంటుందో తెల్సింది నాకు.

మీరూ మాతోపాటు ఇంటికొచ్చేయండి అనగానే సుందర్ నా భుజాల మీద చెయ్యివేసి రండి నాన్న ఎన్నోసార్లు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకొద్దామని చెప్పినా వినని లత ఈరోజు తన తప్పు తనే తెల్సుకుంది.

తన మాటని అంగీకరించి రండి నాన్న ఇంటికెళ్దాం అని సుందర్ అనగానే మామయ్య మా ఇద్దర్ని దగ్గరికి తీసుకున్నాడు. అందరం కలిసి ఇంటికెళ్ళాం. ఆ సంవత్సరం స్నిగ్ధకి మేమిచ్చిన పుట్టిన రోజు కానుక వాళ్ళ తాతయ్య. 

-శ్రవణ్ కుమార్ రాజా

0 Replies to “కానుక”

  1. మీ కథ కొందరికి అయినా కనువిప్పు కావాలని ఆశిస్తున్నా.. అభినందనలు ,💐💐💐💐💐💐

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *