కాలం కలిసొస్తే

కాలంకలిసొస్తే

నేనెవరికీ,
ఏమి కాను.
ఎండనక వాననక
రేయనక పగలనక
నిర్మానుషమైన చోట
నిర్జీవమై నిలుచున్న
అనర్థమైన రూపాన్ని.
నా దేహమంతా దుమ్ము ధూళితో
నిండిపోయి అశుభ్రంగా వుంది.
తల దాచుకోవడానికి కూడా,
చోటులేని జీవితం నాది.

ఎందరు, నన్ను కాలితో ముద్దాడారో…
మరెందరు, నాపై ఉమ్మి ముచ్చటించారో…
అయినా, ఏమి చేయలేని
నిస్సహాయత, నన్నావరించింది.
వేదనతో, హృదయం బరువెక్కింది
ఈ జన్మకు ఈ జీవితమింతేనని
నిట్టూర్చాను.

కాలం కలిసి రానప్పుడు
కర్ర కూడా పామవుతుందంటారు,
అది నిజమే అన్నది….
ఇప్పుడు తెలుసొచ్చింది.

కాలం కలుసొస్తే
పేదవాడు సైతం పెరుమాళవుతాడంట…!!?
అందరికీ మనం, అయిన వాళ్ళవుతామంట…!!?

ఏదో అద్భుతం నా చుట్టూ ఆవరించింది.
ఏవో గుసగుసలు….
ఏవేవో మాటలు….
నన్ను ఎగాదిగా చూసే వాళ్ళు…!!
చుట్టూ చేరి కొలతలెట్టే వాళ్ళు…!!
ఓహో….
ఇక్కడ కూడా నాకు చోటు లేదన్నమాట..!!
అనుమానం నిజమైంది.

ఓ పదిమంది చుట్టుముట్టారు
తాళ్లతో నను బంధించారు
మరో చోటుకి తీసుకెళ్లారు.
ఓ మండలం రోజులు అనేక రకాలుగా
సుత్తితో సుతిమెత్తగా మలచి తొలచి
ఉలితో ఊపిరి పోస్తూ నను ఊరడించారు.
రూపు రేఖలు సరిపోయాక
ఆచార వ్యవహారాలతో
నన్నొక సుముహూర్తాన…
ఓ మందిరంలో కూర్చోబెట్టారు.
అనర్థమైన రూపం అర్థవంతమైంది.

ఇప్పుడు, నేనొక దేవతా మూర్తిని
అర్చనలు చేస్తూ నైవేద్యాలు పెడుతూ
నిత్యం పూజలతో నను ముంచెత్తుతున్నారు.
ఆహా… ఎంత మార్పు..!? ఇంతలోనే ఎంత వైభవం..!!!

కాలం కళ్ళు తెరవాలే గానీ…
ఎవర్ని ఎక్కడైనా కూర్చోపెట్టగలదు.

 

-గురువర్ధన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *