జోక్

జోక్

భర్త: ఆ పెనం కింద కాస్త మంట తగ్గించు…! మరీ సిమ్ లో పెట్టకు…! పెసలు మరీ పేస్టల్లే రుబ్బినట్టున్నావ్…! ఉల్లిపాయ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నట్టు లేదూ…? ఇంకాస్త సన్నగా తరగాల్సింది..! అల్లం ముక్కలేంటీ, మరీ తురిమేసినట్టు ఇంత సన్నగా ఉన్నాయేంటీ..? కాస్త మందంగా తరగాల్సింది..! ఆ జీలకర్ర సన్న సెగ మీద కాసేపు వేయించావా, లేదా..? లేకపోతే పచ్చివాసనేస్తుంది..!

కాస్త నెయ్యీ, కాస్త నూనె కలిపివేస్తేనే అట్టు రుచి బావుంటుంది. మరీ పల్చగా వేయకు, అలా అని మరీ బండగా వేయకు..! మధ్యస్తంగా వేయి…! మంట కాస్త తక్కువ సెగ ఉండేట్టుగా ఎక్కువ సేపు కాలేట్టుగా పెట్టు. ఆ పెద్ద బర్నర్ మీద పెట్టావనుకో, అట్టు అన్నివైపులా సమానంగా కాలుతుంది…! పుట్నాల పప్పు పచ్చడీ, అల్లం పచ్చడీ రెండూ చేశావుగా..? పుట్నాల పప్పు పచ్చడి కాస్త పల్చగా ఉండాలి, కానీ తిరగమోత గాఠిగా పడాలి. ఇహ అల్లం పచ్చట్లో కాసింత కొత్త చింతపండు, పండుమిర్చీ కారం తగిల్తేనే ఆ చమక్కుంటుంది..!

ఉప్మా ఎలా చేసావ్..? పోపులో మినప్పప్పు వేసి నాశనం పట్టించలేదు కదా..? ఉల్లిపాయ ముక్కలు సన్నగానే తరిగేసావ్ కదా..? ఓ గుప్పెడు జీడిపప్పన్నా అధమపక్షం వేసావ్ కదా..? గట్టిగా గుండులాగో, జారుడుబల్లలాగో వేయకండా మధ్యస్తంగానే వేసావ్ కదా..? ఆ వెధవ టమాటా ముక్కలేం వేయలేదు కదా..?

*********

భార్యామణి ఆ భర్తగారిని ఓ సారి తీక్షణంగా చూసింది. నుదుటినుండి కారుతున్న చెమటని ఆయన లుంగీతో అద్దుకుంది. ఆ తర్వాత ఆయన టీ షర్టు కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కుంది. అట్లకాడ పక్కన పెట్టి, అల్లం పచ్చట్లో చూపుడు వేలు పెట్టి తీసి ఆయన నాలిక్కి రాసింది. తర్వాత దూరంగా నెట్టింది.

భార్య: ముప్ఫయ్యేళ్ల నుండి పెసరట్టుప్మా, పాతికేళ్ల నుండి సంసారం చేస్తున్నాను. ఈవాళేంటీ చోద్యం..? మరీ అతి చేస్తున్నారేం…? ఉప్మాలో, అట్టు పిండిలో ఉప్పెంతేసానో అడగలేదేం…? నోర్మూసుకుని తినండి. నాకు తిక్క రేపకండి..!

మొగుడుగారు చిరునవ్వుతో దగ్గరికి వచ్చి గరిటెతో ఉప్మా ఓ ముద్ద తన నోట్లో వేసుకుని, ఇంకో ముద్ద ఆవిడ నోటికందించాడు. ఆమె మెడ మీది చెమటని సుతారంగా తన చేత్తో తుడుస్తూ…

“నేను ముప్ఫైనాలుగేళ్లనుండి కారు నడుపుతున్నాను. నువ్వస్తమానం పక్కన కూర్చుని, ముందు ఆటో వుందీ, పక్కన బస్సొస్తోంది. బ్రేకెప్పుడేయాలీ, గేర్లెప్పుడు మార్చాలీ అని నువ్వు చెబుతుంటే నేను విన్నప్పుడెలా అనిపిస్తుందో నీకు చెబుదామనీ..!!”

“మహా ఘనకార్యం చేశారు గానీ, ఆ ప్లేట్లు తీసుకోండి..!”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *