జీవితం
మబ్బులు వీడినంతగా కలతలు వీడవు
రాత్రి గడిచినంతగా జీవితం గడవదు
గొడవల గొడుగేసుకుని నిట్టూర్పుల వర్షంలో తడుస్తూనే ఉంటాడు మనిషి
తనదన్న మోహం తనకే కావాలన్న వ్యామోహం
తిన్నగా ఉండనీక తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా చేస్తుంటే
లెక్కలన్నీ తారుమారై లక్కేమో చిక్కుల్లో పడితే
జ్ఞానోదయమవుతుంది
పరిహసించే కాలాన్ని ప్రతిఘటించలేక
పరిగెత్తే లోకంతో పోటీపడలేక
రివైండ్ అవుతూ జీవితం
నలుపు తెలుపుల చిత్రంలా సిత్రంగా చూస్తుంటే
బంధాలు బాధ్యతలు ఓదారుస్తూ ఉంటే
ఓపిక నీకు తోడుండి
దారి చూపుతుంటే
అప్పుడు కదా జీవితం కొత్తగా కనపడేది మనిషికి
-సి.యస్.రాంబాబు