జయించాలి
కోపం అనేది ప్రతిమనిషిలో ఉండే సహజ గుణం. నిజంగా
చెప్పాలంటే జీవితంలో కోపం
రానివాడు ఉండనే ఉండడు.
కొందరు తమ కోపాన్ని ఎలాంటి పరిస్ధితిలోనూ బయటకు ప్రకటించరు. వారు ఆ కోపాన్ని
మనసులో ఉంచుకుని లోపల రగిలిపోతూ ఉంటారు. అలా
చేయటం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. అలా
కోపాన్నంతా మనసులో దాచుకుంటూ ఉంటే ఏదో
ఒక రోజు అగ్నిపర్వతంలోని
లావాలా ఆ కోపం బయటకు
వచ్చేస్తుంది. ఆ కోపంతో వారు ఏదో ఒక అఘాయిత్యం చేసేసి
జైలుపాలు అవుతారు. పైగా
ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఇంకొందరు చీటికీ- మాటికీ తమ కోపాన్ని ఇతరులపై ప్రదర్శిస్తూ ఉంటారు. అది
కూడా అంత మంచిది కాదు
అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మనిషికి కోపం రావటానికి ముఖ్య కారణం తాను అనుకున్నట్లు ఇతరులు ఆ పనులను చేయకపోవటం.
తల్లిదండ్రులు తాము కోరుకున్న విధంగా తమ సంతానం చదవలేదని
కోపం తెచ్చుకుంటారు.
యజమాని తన దగ్గర
పనిచేసేవారు సరైన
కృషి చెయ్యకపోతే
కోపగించుకుంటాడు.
కొందరు ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించటం కోసం
కోపాన్ని నటిస్తారు. తమ
వద్ద పనిచేసేవారితో సరిగ్గా
పని చేయించుకోవటానికి
అలా నటిస్తూ ఉంటారు.
మొత్తానికి పని పూర్తి అయ్యేట్లు చేస్తారు. ఇంటి
పెద్ద తన కుటుంబాన్ని చక్కటి
క్రమశిక్షణలో పెట్టడానికి కోపం
నటించక తప్పదు. తెలివిగల మనుషులు నిజంగా కోపం తెచ్చుకోరు. కోపం నటిస్తారు.
ఎప్పుడూ కోపంగా అరిచేసే
వాళ్ళ దగ్గరకు ఎవరూ కూడా వెళ్ళేందుకు ఇష్టపడరు. ఆ
విషయం అందరూ గ్రహించాలి.
-వెంకట భానుప్రసాద్ చలసాని