జవాన్
ఒంటరిగా గడప దాటిన పాదాలు….
వేవేలా మైళ్ళ దూరంలో… అలిసిపోయి…
భూ గర్భాన్ని చేరుకుంటున్నప్పుడు….
కన్నపేగు వంటి స్పర్శ ఏదో ఈ మట్టి నాకు ధారపోసింది…..
వెచ్చగా వెన్నుచూపని ధైర్యానికి….
వెన్నులో వణికించే హిమనిపాతం అలజడికి గురిచేస్తున్నప్పుడు….
శరీర కంపనమంతా…నరనరనా విద్యుత్ వేగంలా మారి గుర్తుచేస్తుంది…..కర్తవ్యన్ని
కోరికల యవ్వనమంతా…. కొవ్వొత్తిలా మారి…
నల్లని రాత్రుల్లో పహారా కాస్తూ… కరిగిపోతూనే..
జత కొవ్వొత్తిని మనసులో ఓ మూల నిలుపుకుంటుంది ఆ సమయాన వింతగా….
ఎడారి కంచెల నడుమ దేహపు చిప్పలో కారే ప్రతి చెమట చుక్క..
మాతృభూమి మెడలో మూత్యల దండను పేర్చి తొడుగుతున్నప్పుడు…
మూడు ముళ్ల బంధమేదో చిన్నగా తోస్తుంది….ఈ జన్మకు…
నుదిట దిద్దిన ఎరుపు వర్ణం…
సాయంసంధ్యాన సూరుడిలా ఉసూరుమంటూ ఒదిగిపోతూనే…
మరొక్కమారు కొత్తగా తళుక్కుమంటుంది…
నా ఆయవుని గుర్తుచేస్తూ… పాపిట నడుమ…..
ఆకలిదప్పులన్ని…. రక్షణ జ్వాలలో పునితమవుతున్న….
అగ్ని చూపే వెలుగుల్లో…అడుగులు వేస్తూ…
ప్రాణాన్ని తృణప్రాయంలా మార్చి ..బాధ్యతను….
తల్లిగర్భంలా మోసుకుపోతున్నాను…
చివరికి ఒకనాటి…. అస్తమాయ క్షణాన
మౌనముద్రను దాల్చిన హృదయం…
సంద్రంలాంటి కన్నీళ్ల నడుమ కరగని రాయిలా
మారి నిశ్శబ్ద భావ వీచికలో…
పరిమళాన్ని నింపే… పువ్వుల ప్రేమ..
శరీరాన్ని అలకరించినప్పుడు…
ఈ పుట్టుక సార్థకమంటుంది…. గర్వంగా….
– కవనవల్లి