జాగృతం
నాక్కొంచెం నమ్మకమివ్వు..!
కాలం చెల్లిన కఠిన నియమాల కర్కశ కబంధహస్తాలలోకి
తోసెయ్యకు నన్ను ఇక !
దశాబ్దాలుగా దారుణ వంచనకు గురైన నా దాస్యపు శృంఖలాలను ఛేదించుకునే అవకాశం ఇవ్వు!
సుమనోహరమైన సృష్టిలోకి
ఏకాకిగా ఏతెంచిన నేను
ఒంటి చేత్తో నన్ను నేను సంభాలించుకోగలనని
విశ్వసించు ఇకనైనా..!
స్వేచ్చావిహంగాన్నై
గగనవీధుల్లో విహరిస్తానో
జంట గూటిలో
కువకువరాగాలను ఆలపిస్తానో
నా అభిమతానికే వదిలేయి ఇక!
నా అంతరంగాన్ని ఆవిష్కరించే అవకాశాలను అందిపుచ్చుకోనివ్వు ఇప్పుడైనా!
అసమానతలను సమం చేసి ఆధునిక అడవి మృగాల పీచమనిచే ఆదిపరాశక్తిని
ఇప్పుడు నేను..!
ఓ సనాతన ప్రపంచమా!
నీ ఆధిపత్యపు భావజాల ఆవృతం నుంచి జాగృతం కానివ్వు
ఇకనుంచి నన్ను నాలా!
– మామిడాల శైలజ.