జగమంత కుటుంబం

జగమంత కుటుంబం

ఏం రా ఏడికి బోతున్నవ్ అంటూ అడిగాడు శీనయ్య రాజు ను, కాక బాయి కాడికి పోయేస్త అన్నాడు రాజు. గిప్పుడు బాయి కాడికి ఎందుకు రా అన్నాడు శీనయ్య.

గాదె నే అడ్లు అడనే ఉన్నాయి మిల్లు కు తోల్క పోలే ఆయన్ని కల్లం కాడ నే ఉన్నాయి. ఈ దాపా దొంగలు మోపయ్యిర్రి అడ్లు ఎత్తుక పొనికి గందుకే అడ్నే కావలి ఉండని కి వోతున్న అన్నాడు రాజు.

అరే అవును తమ్మి నా పొలం లో సూత అడ్లు పడి ఉన్నాయి. నువ్వు జర సస్కుంట ఉండు నేను బువ్వ తిని అస్త, అవు నువ్వు బువ్వ తిన్నావా లేవా అడిగాడు శీనయ్య.

తినలేదు అన్నా, తినే అవసరం లేదు ఇగ అన్నాడు రాజు. అరే గట్ల అంటావ్ ఎంది అన్నాడు శీనయ్య. ఏంలేదన్న కడుపుల అంతా యెట్లనో ఉన్నదే అందుకే గట్ల అంటున్నా అన్నాడు రాజు.

గoతే కదా నేను ఇంకా ఏదో అనుకున్న, సరే తి పోయి బువ్వ తిని అస్త ,నువ్వు మెల్క తోని ఉండు. అడవి పందులు అస్తున్నయి అంట అంటూ ముందుకు కదిలి వెళ్ళాడు శీనయ్య.

కాస్త దూరం వెళ్ళాక రాజు అన్నా మా ఇంటాలకు సెప్పు నేను యాడికి బోత లేనని , ఇడనే ఉంట నని అన్నాడు. శినయ్య అది విని ఎందో ఏమో సక్కగా ఇనిపిస్త లేదు అంటూ ఇంటి వైపు గా వెళ్ళాడు.

రాజు నీరసంగా అడుగులు వేస్తూ పొలం వైపు వెళ్ళాడు. పొలం దగ్గర ఉన్న అడ్లు సూస్తుo టే రాజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. జలజల కిందకు రాలుతున్న కన్నీళ్లను తుడుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా పంటను చూస్తూ పంట ఎస్తందుకు సావుకారు దగ్గర ఎంత బాకీ చేసింది యాది కచ్చి ఇంకా దిగులు పడ్డాడు.

*******

ఇంటికి అచ్చిన శీనయ్య ను సూసిన భార్య ఎందయ్య గింత సేపు యడ ఉన్నావ్, బువ్వ సల్లగ అయిపాయే అంటూ వడ్డించడానికి లోనికి వెళ్ళింది.

కానీ తియ్యే యెట్లుంటే ఏంది తిన్నామ లేమా అన్నదే ముఖ్యం నువ్వు బువ్వేయి అంటూ కాళ్ళు కడుక్కోవడానికి బాయి దగ్గరికి వెళ్ళాడు.

కానీ శీనయ్య మనసులో మాత్రం రాజు చూపులు అతని వాలకం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది.

రాజెప్పుడు మంచి హుషారుగా ఉంటాడు. అసలు రాజు అస్తుండు అంటే ముందుగాల్ల అని పా ట నే ఇనోస్తది మంచి పాట గాడు రాజు గాడు. ఏ సమయం కు తగ్గట్టుగా ఆ పాటలు పాడుడు అనికి సిన్నప్పటి సంది అలవాటు.

పొలం కాడ ఏ పని సేస్తున్న పాట లేనిది ఉండడు రాజు గాడు. పొద్దున లేవగానే ఎత్తిన గొంతు రాత్రి నిద్ర పొతే తప్ప ఆగదు. అసుంటిడ్ రాజు ఈ య్యాల నోరు తెరిచి మాట్లాడానికి కూడా ఇష్టపడతా లేడు.

ఇంట్ల ఎన్ని రందులు ఉన్న సుత అని గొంతు ఆగదు. గసుంటి ది ఈ య్యల అడు మాట్లాడలేదు. పాట సుత లేదు. 

పెండ్లికి ఎదిగిన చెల్లెళ్ళు, లేవలేని కదలకుండా మంచం లో పన్నా తండ్రి, ముసలి అవ్వ, ఇద్దరు సిన్న పొరల్లు ఉన్న సుత అని కి రంధి లేదు.

ఉన్న పొలాన్ని కాకుండా కౌలు తీసుకున్న పొలాన్ని కూడా సేద్యం సేస్తు మంచిగానే ఉంటుండే కని గియ్యల ఏమయింది అనుకుంటా బాయి దగ్గరే నిలబడిన మగన్ని సూస్తు ఆగో గాన్నే నిలవడతివి బువ్వేసిన అంది రాణి.

ఆ ఆ అస్తున్న అనుకుంటా లోపలికి పోయిన శీనయ్య బువ్వ కల్పుత మల్ల ఆలోచనలో పడ్డాడు. గది సుస్తున్న రాణి ఏందయ్య ఏం సొంచయిస్తున్నవ్ తినయ్య అంది.

రాణి నీ సస్తు అవునే రాజు గానీ ఇంట్ల ఏమన్నా పంచాయితీ అయ్యిందా అన్నాడు. రాణి పంచాయితీ ఎందయ్య పొద్దుగాల్ల గా సవుకారి అచ్చి ఇజ్జత్ మొత్తం తీసి పాయె, బాకీ సగం కూడా కట్టకుండా పంట మొత్తం తొల్క పోతా అంటూ ఆగమాగం చేసిండే.

రాజు అని పెళ్ళాం మస్తు బతిమాలిండ్లు అయిన సూత గా సావుకారి ఇనకుండ ఇంట్ల ఉన్న సమను మొత్తం తీసుక పోయే.

ఇగ ఉల్లే ఏం ఇజ్జాత్ ఉంటది అంటూ పొద్దున జరిగింది చెప్పంగానే, శీనయ్య మనసులో ఏదో మేదిలి ఓరి కొడుకా అంటూ ఓర్రుకుంట రండ్రి రండ్రి రాజు గాడు సావనికి పోతాండు అంటూ గట్టిగా ఓర్రుకుంట పొలం దిక్కు నా ఒకటే ఉరుకుడు వెట్టిండు.

మొగుడు గట్ల ఆర్రకుంట ఉర్కంగనే రాణి కి సగం అర్దం అయ్యి యే న్క నే ఆమె సూత ఉరుక్కుంట ఓరి రాజయ్య, మల్లేశు, ఎంకటి రండి రాండి అనుకుంటా ఉర్కవట్టే ఇగ రాణి అరుసుడు ఇన్న అందరూ ఆమె యేన్క ఉరుకిండ్రు. అల్లకు మొన్న సాచ్చిన యాదయ్య గ్యా పకం అచ్చిండు. అడ్ని కాపడలే క పోయిండ్రు కానీ గది మతిలకు అచ్చి ఊరుకుడు మొదలు వెట్టిండ్రు.

సినయ్య ఏళ్లే సరికి రాజు పురుగుల మందు తాగి కళ్లం కాడ కదలలేని స్థితిలో పడి ఉన్నాడు. మల్లేషు బండి తేవడం తో బండి మిన కూసో యెట్టికుని యేనక శీనయ్య అట్టుకుని దగ్గరలో ఉన్న ప్రైవేటు దవాఖానకు తోలక పోయారు.

అడ గిది పోలీస్ కేస్ అని పట్టం అనేవరకు ఏంట అచ్చ్చిన రంగన్న అస్తూ ఆస్తూ తెచ్చిన ఆ దొండ ఆకుల రసం నొట్ల పోషిండు.

ఆ రసం పొయ్యంగనే రాజు కడుపుల ఉన్న మందంత కక్కిండు. మల్ల మల్ల గదే రసం పోసి కడుపుల ఉన్నదంతా కక్కించిండ్రు.

కండ్లు తేర్శిన రాజు సుట్టూ అందర్నీ సుస్తూ కండ్లల్ల నీళ్ళు దిసుకుంటే శీనయ్య సూస్తా బిడ్డా గిట్ల నీ పానానికి నువ్వు బోతే నీ బిడ్డల సెల్లెండ్ల పరిస్థితి ఏంది రా?

గింత సుత ఆలోచన లేకుండా పానం దిస్కుంటే ఏం అస్తది బిడ్డ మేమంతా లేమా ,నువ్వు మాలో ఒకనివి నువ్వెప్పుడు పాటలు పాడుకుంటూ హుషారుగా ఉంటే నే

మంచిగుంటాది బిడ్డా, ఇగో ఏ కష్టం అచ్చినా ఊరంతా ఒకటే అయ్యి ఉంటాం. ఇగ ఎవలికి కష్టం అచ్చినా అందరం కూడి ఉందాం. ఏమట్టర్ర అని అందర్నీ సూస్తూ అడిగాడు.

బాపు నువ్వు జెప్పుంది మంచిగా ఉందే. నీ మాటంటే మాకు ఇష్టమే బాపు . నువ్వెట్ల అంటే గట్లనే అన్నారు అంతా ముక్త కంఠంతో..

రాజు గా ఒక మంచి పాట పాడురా బిడ్డా అని అడిగాడు శీనయ్య. రాజు చిరునవ్వు తో జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనగానే..

శీనయ్య కాదు బిడ్డ ఏకాకి వి కాదు మేమంతా లేమా మనది జగమంతా కుటుంబం గంతనే అన్నాడు. అందరూ నవ్వారు.

-భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *