ఇప్పటి పోరలం – రేపటి పౌరులం
భుక్తి కోసం శక్తి ధార పోస్తాం మేము
కార్మికులం మేము బాల కార్మికులం
కార్మికులుగా చేయ మాకేమి కర్మ వచ్చె
ఇప్పటి పోరలమే గాని రేపటి పౌరులం
మేము
ఇప్పటి బాలకులమే గాని
రేపటి పాలకులం మేము
చదువు కొమ్మని మా దేశం ఆదేశం ఇచ్చె
రేపటి దేశం మాది దానికి పునాది మేము
బాల్యం మా జన్మ హక్కు
అమూల్యం మా బాల్య శక్తి
చేసి చేసి పని చేసి మసిబారె మాచేతులు
పసి వాళ్ళమే కాని పనివాళ్ళం కాదు మేము
దుమ్ము ధూళి అస్సలే వద్దు
చదివే మాకెంతొ ముద్దు
పొగల శగల పరిశ్రమల ఊసే మేకిక వద్దు
అమ్మ అబ్బ చేసే వెట్టి చాకిరి
చెయ్య బోము మేమింక ఎట్టిచాకిరి
పలక బలపం పట్టుతాం
మా మనోబలం చూపెట్టుతాం
నట్టు పాన విసిరికొట్టి
మా బుర్రకి సానపెట్టుతాం
పలుగు,పాఱ,పారవేసి
పుస్తకం చేపట్టుతాం
– రమణ బొమ్మకంటి