ఐక్యమవనీ!
నీవే ప్రాణమనుకుని నమ్ముకున్న క్షణంలో…
మనసంతా నిండిన ప్రేమ పులకింతలో..
ఇసుమంతైనా భయమన్నది లేదు మదిలో…
ఒంటరయ్యానన్న భావన కలగలేదు హృదిలో…
మమేకమైన బంధానికి మురిసిపోయా తలపులో…
నేడదంతా గతమై స్మృతిలో తొలిచేస్తుంటే….
క్షణక్షణం తనువున గాయాలని రేపుతుంటే…
మనోసంద్రంలో వేదనంతా ఇంకి కన్నీరు రాకుంటే…
క్షణమొక యుగముగ గడుస్తుంటే….
వంచించబడిన మనసు మూగగా రోధిస్తుంటే….
నిత్యం నమ్ముకుని వచ్చే పుంగవులకి తనువర్పించి…
మనసున కారే కన్నీటిని అదిమిపడుతూ…
ముఖాన రంగులు పులుముకుంటూ…
అధరాలకి నవ్వుల రంగులు అద్దుకుంటూ…
పూట తిండికై నీ వంచన సాక్షిగా బ్రతికేస్తున్నా…
నిన్ను చేరని నా కన్నీరుని నిందిస్తూ…
నిన్ను నమ్మిన నా మూర్ఖత్వానికి దుఃఖిస్తూ…
అవసరాలకి నాకు ప్రేమ పరిచయం చేసి…
డబ్బుకోసమని అంగట్లో అమ్ముకున్న నీవు…
మరుజన్మలోనైనా నీ నిజప్రేమతో నీలో ఐక్యమైపోనీ….
– ఉమామహేశ్వరి యాళ్ళ