ఇకనైనా మేలుకోండి.!

ఇకనైనా మేలుకోండి.!

కోయిల‌మ్మ కమ్మని‌ పాటని వింటూ పెరిగాం.. గుప్పెడంత పిచ్చుకలు కట్టే చక్కని గూళ్లను చూసి ఇసుక తిన్నెల్లో మనమూ కట్టి బాల్యంలో ఆటలాడుకున్నాం.. యుక్తవయసు వచ్చాక చిలుకలతో కబుర్లు చెప్పుకున్నాం.. తోడు దొరికాక‌ పావురాలతో ప్రేమ సందేశాలు పంపుకున్నాం.. దేశ సేవలో రహస్యాలు చేరవేసే వేగులుగా డేగలను వినియోగించుకున్నాం..

రామాయణంలో సీతమ్మను రావణుడి నుంచి రక్షించడానికి ప్రాణ త్యాగం చేసిన గరుడ పక్షి నుంచి నేడు మానవ తప్పిదాలతో కనమరిగైపోతున్న పక్షుల వరకూ ఏ ఒక్కటీ మనుషులకు ఎలాంటి‌ హానీ చేయలేదు.. కానీ మనమేం చేస్తున్నాం.. అభివృద్ధి పేరుతో అమాయక ప్రాణుల ఆయువు తీస్తున్నాం..

ఒకప్పుడు పంటచేలకు పురుగు‌ మందులు చల్లాల్సిన అవసరం ఉండేది కాదు.. క్రిమి కీటకాలను పక్షులు ఆహారంగా తీసుకుని పచ్చని పంటను కాపాడేవి.. ఇప్పుడు వాటికి నాలుగు వడ్ల‌ గింజలు కూడా దొరక్కుండా చేసేశాం.. సెల్ టవర్లు ఇష్టానుసారం,అవసరానికి మించి పెట్టేసి..

ఆ రేడియేషన్ తో పిచ్చుకుల పీకనులిమి చంపేశాం.. పంటలను తెగుళ్ల‌పాలు.. రైతుని అప్పులపాలు చేసేశాం. చివరికి చిలకజోస్యం చెప్పుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వారికి జీవనాధారాన్ని‌ పోగొడుతున్నాం.

విదేశాల నుంచి వేల కిలోమీటర్లు ఎండా, వాన, గాలి వంటి ప్రతికూలతలకు ఎదురొడ్డి ఖండతర పక్షులు మనదేశానికి వస్తే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడి పక్షులతో పాటు వాటినీ కాపాడుకోలేక చేతులుముడుచుకున్నాం.

పురుగుమందులతో నిండిన పంట పొలాల్లో తిండిలేక, చెరువులు పూడ్చి బహుళ‌ అంతస్తుల భవంతులు కడుతుంటే తాగేందుకు నీరు లేక, చెట్లను కొట్టి రోడ్లు నిర్మిస్తే గూడు కట్టుకునేందుకు నీడ లేక పక్షులు చస్తున్నా చోద్యం చూస్తున్నాం. వాహనాల పొగ, పరిశ్రమల‌ వ్యర్థాలు, విష వాయువులతో నీటిని, గాలిని‌, నేలని కలుషితం చేసి పక్షుల మనుగడే లేకుండా చేస్తున్నాం.

ఈ తరం పిల్లలు టెలివిజన్ కార్టూన్ బొమ్మల్లోనే చాలా‌ వరకూ పక్షులను చూడాల్సిన పరిస్థితిలోకి మన ప్రపంచం చేరుకుంది. రేపటితరం ఒకప్పుడు ఈ భూమిపై పక్షుల జాతి కూడా ఒకటుండేదని పూస్తకాల్లో మాత్రమే చదువుకోవాల్సిన దుస్థితిలోకి రానుంది. ఇప్పటికైనా కళ్లుతెరవకపోతే, మనం‌ మారకపోతే మనుషుల‌కీ కొన్నాళ్లకి పక్షుల గతే పడుతుందనేది పచ్చినిజం. తప్పదు.. ఇకనైనా మేలుకోండి.!

– ది పెన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *