ఇదీ మా ప్రేమ కథ
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలవుతుందో ఎవరం చెప్పలేము, ఎవరికి తెలియదు కూడా. అంతేకాకుండా ప్రేమకి వయస్సుతో పని లేదంటారు. చిన్న పెద్ద అని ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రేమ అవసరమే. మన జీవితంలో ఈ ప్రేమ మనకి తెలియకుండానే ఎక్కడో, ఎప్పుడో మొదలయి, ఇంకెక్కడో, ఇంకెప్పుడో మనతో కలిసిపోతుంది. అలా ప్రేమంటే ఎంటో తెలియని వయస్సులో మన జీవితంలోకి వచ్చి ఆ ప్రేమానుభూతుల్ని పరిచయం చేసి వెళ్లిపోయి మళ్లీ మనకి ఆ ప్రేమ దోరుకుంతుందో లేదో అనే సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తే….??? అదే నా ప్రేమ కథ.
నాకు అప్పుడు సరిగ్గా పన్నెండేళ్ళు . అప్పుడు నాకు ప్రేమంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. అప్పుడే ప్రేమ నాకు పరిచయం అయింది. నేను నా చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుండి ప్రతి వేసవి సెలవులకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. ప్రతి సంవత్సరం సెలవులు అక్కడే గడిపేదాన్ని. అలాగే నా పన్నెండేళ్ళ వయసప్పుడు వేసవి కాలం సెలవులు రాగానే యధావిధిగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాను. కానీ ఆ వేసవి సెలవులు నాకు మర్చిపోలేని జ్ఞాపకాలని ఇస్తాయి అనుకోలేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలో నా స్నేహితుడు సాయి ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళిన ప్రతి సారి సాయిని కలిసేదాన్ని.
అలాగే అప్పుడు కూడా కలవడానికి వెళ్ళాను. అప్పుడే నేను అక్కడ సాయి తో తన స్నేహితుడు కూడా ఉండడం చూశాను. సాయి నాకు తనని పరిచయం చేశాడు, తన పేరు విక్కీ. అలా సాయిని కలవడానికి వెళ్లిన ప్రతి సారి విక్కీ కూడా అక్కడే ఉండడం తో మెల్ల మెల్లగా మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకో తెలియదు నేను విక్కీ తో ఉన్నంత సేపు, తనతో మాట్లాడినప్పుడు నాకు ఏదో తెలియని సంతోషం కలిగేది. తనతో అలాగే ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించేది. అలా సెలవులు గడిచిపోవడంతో నేను మా ఇంటికి తిరిగి వెళ్లాను. తనని విడిచి వెళ్తుంటే ఏదో బాధ కానీ తప్పదు ఇక వెళ్లాల్సిందే మళ్లీ వేసవి కాలం సెలవులు ఎప్పుడు వస్తాయో అని ఎంతో ఆతృతతో చూస్తూనే ఉన్నా అంతలోనే రానే వచ్చాయి. ఇక ఎంతో ఆనందంతో, ఎప్పుడు లేని సంతోషంతో వెళ్ళాను. (తప్పు నాదీ…శిక్ష ఆమెకి)
విక్కీ నీ కలుద్దాం అని ఎంతో సంతోషంగా సాయి దగ్గరికి వెళ్ళాను. కానీ అప్పుడే నాకు తెలిసింది విక్కీ వాళ్ళ తండ్రికి గవర్నమెంటు ఉద్యోగం, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు అని . ఏ ఊరో కూడా సాయి కి తెలియదు అని చెప్పాడు. నా ఆశలు అన్ని అడియాశలు అయ్యాయి. ఇక అక్కడ ఉండలేక మా ఇంటికి వచ్చేశాను. కానీ ప్రతి సంవత్సరం విక్కీ వస్తాడేమో అన్న చిన్న ఆశతో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేదాన్ని. కానీ తనని మాత్రం మళ్లీ కలవలేదు. ఎందుకో తెలియదు కానీ తను మాత్రం నా మనసుకి చాలా దగ్గర అయ్యాడు, తనతో గడిపిన అన్ని రోజులు ఎంతో సంతోషంగా ఉండేవి, తనని తలచుకొని రోజు అంటూ ఉండేది కాదు.
ఆ కొద్ది రోజుల మా పరియచయానికి ఏ పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. అలా అలా నా చదువు పూర్తయింది. మా తల్లిదండ్రులు నాకు పెళ్లి చెయ్యాలని ఒక మంచి సంబంధం తెచ్చారు. కానీ అప్పటికి నా మనసులో ఇంకా విక్కీ నే ఉన్నాడు, తనని నేను చాలా వెతికాను, తనకోసం నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అయినా విక్కీ నాకు దొరకలేదు. ఇక చేసేది ఏమీ లేక మా తల్లిదండ్రులు తెచ్చిన అబ్బాయినే నేను పెళ్లి చేసుకున్నాను, తన పేరు విక్రమ్, తనది గవర్నమెంటు ఉద్యోగం. విక్రమ్ కూడా చాలా మంచివాడు, నన్ను ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు. అయినప్పటికీ నా మనసులో ఏదో వెలితి, విక్కీని మళ్లీ కలవలేకపోయా అని. (తను చనిపోయాడు అనుకున్నాను, కానీ…!)
కలలో కూడా విక్కీని మళ్లీ కలుస్తానో లేనో అని అనుకునే సమయంలో, మళ్లీ విక్కీ రాకా నా జీవితంలో సంతోషాన్నిచ్చింది. పెళ్లి అయిన మూడు నెలలకి నేను విక్రమ్ తో కలిసి తన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అనుకోకుండా నేను విక్రమ్ చిన్నప్పటి ఫోటోని చూశాను. ఆ ఫోటో చూడగానే నేను ఆనంద, ఆశ్చర్యాలతో ఉండిపోయాను. విక్రమ్ మరెవరో కాదు నేను చిన్నప్పుడు కలిసిన విక్కీనే…విక్రమ్. ఎంతో సంతోషంగా విక్రమ్ దగ్గరికి వెళ్ళి నేనే తన చిన్నప్పటి నీతూని అని చెప్పాలి అనేలోపు విక్రమ్ నా దగ్గరికి వచ్చి….
నేను విక్కీని కలిశాక నాకు ఎలాంటి అభిప్రాయాలు, ఎలాంటి భావనలు అయితే కలిగాయో విక్కీ కి కూడా అలాంటి భావనలే కలిగాయి అని ఆ తర్వాత వాళ్ళు వేరే ఊరు వెళ్ళడం వల్ల మళ్లీ కలవలేకపోయా అని, తర్వాత కొన్ని సంవత్సరాలకు సాయి దగ్గరికి వెళ్లి నా వివరాలు అన్ని తెలుసుకుని, ఇప్పటికీ నేను తన గురించి వెతుకుతున్న అని తెలుసుకుని, తన ఇంట్లో వాళ్ళతో మాట్లాడి పెళ్లి వరకు తీసుకొచ్చానని చెప్పాడు. తన మాటలు విని నేను ఆనందంతో ఉప్పొంగి పోయాను. ఇలా విక్కీనే.. విక్రమ్ గా వచ్చి మా చిన్నప్పటి పరిచయానికి పేరే “ప్రేమ” అని నా ప్రశ్నకి సమాధానాన్ని, నా జీవితానికి ప్రేమని, సంతోషాన్ని ఇచ్చాడు.
ఇది మా కథ
నిత్య – విక్రమ్ ( నీతూ ❤విక్కీ
-భరద్వాజ్
కధ బాగుంది.