హాస్యరసం
మా పెళ్లి ఐన సంవత్సరం లోనే మా ఆయనకి యాక్సిడెంట్ ఐ కాలు కాస్త బెణికింది డాక్టరు ఒక నెల వరకు బెడ్ రెస్ట్ చెప్పారు.సరే పాపం కదా అని ఆ రోజు నించీ , ఆడవాళ్లు వంట చెయ్యడం లోక విరుద్ధమైన పని ఐనా కూడా నేనే వంట చేసాను.
ఆ తర్వాతి నెల పాపం ఆయనకీ జ్వరం వచ్చింది .సరే ఒక పదిరోజులు నేనే వంట చేసాను .ఆ తర్వాత ఆయన వంట మొట్టమొదటి సారిగా తిన్నాను .అంతే ! హడలిపోయాను కూర నిండా డబ్బా ఉప్పు గుమ్మరించారు.ఒక రెండు డబ్బాల కారం ఒక అరకిలో చింతపండు వేసి, ఆప్యాయం గా వడ్డించారు .తినలేక చచ్చాననుకోండి .
ఇంక ఆ రోజు నించీ నేనే వంట చెయ్యడం మొదలుపెట్టాను .సాధ్యమైనంతవరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా వుంచాను .కానీ నా ఖర్మ కొద్దీ మా పనిమనిషీ నా వంట తప్ప ఎవ్వరి వంటా తినదు .దానిమూలాన మా ఇంట్లొ నేనే వంట చేస్తానని, అంట్లు వగైరా పనిమనిషికి వెయ్యడం బట్టలు వాషింగ్ మెషిన్ లో వెయ్యడం లాంటి పనులన్నీ చేస్తానని ప్రచారం అయిపోయింది.
ఒకసారి మా మహిళామండలి సభ్యులు అనుకోకుండా మా ఇంటికి వచ్చారు.నేను వంట చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయాను.వాళ్ళల్లో వాళ్లు ఒకటే నవ్వుకోడం ! నేను రాగానే ఆపెయ్యడం.వాళ్ళ భర్తలచేత నాకు ఫోన్ చేయించి గుత్తివంకాయ కూర ఎలా చెయ్యాలో చెప్పండి చెల్లాయ్ గారూ! అని అడిగించడం .వీళ్ళమొహాలు మండ ! ఎగతాళి చెయ్యడం కాకపోతే, యూట్యూబ్ లో చూసుకొని చేసుకోవొచ్చుగా !
తర్వాత ఒకరోజు మా ఆయన వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటే విన్నాను.నువ్వుచెప్పిన ఐడియా బాగా పారింది నాన్నా! ఇప్పుడు ఇంట్లో పనులన్నీ మా ఆవిడే చేస్తోంది అని !
కాబట్టీ , ఓ ఇంతులారా! ఈ మగవాడి మాయాజాలం లో చిక్కుకోకండి .వంటింటి కుందేళ్లు కాకండి .
యువర్స్ …….. కాసేపు నవ్వుకోండి.
-ఉమాదేవి ఎర్రం