గుబాళించే పరిమళం
వేడెక్కిన ధాత్రికి ఉపశమనాన్నిస్తూ
ఉరకలెత్తే సంద్రం అలలను
వేడెక్కిన సూరీడు ఆవిరుల
దూదిపింజెలను చేసుకుని
చల్లని మలయమారుతం అలా తాకగానే
సుతారంగా ప్రియుని చేతి స్పర్శ తాకగానే
తనువంతా పులకించిన ఆ ప్రేయసి మురిపెంలా
చిరు చిరు జల్లులు చిలకరిస్తూండగా…
తడుస్తున్న ఆ పుడమి నుండి వచ్చేటి పరిమళం
ఎంత పీల్చినా తనివితీరని ఆ మధురానుభవం
మాటలకందని మధురానుభూతిని సొంతం చేస్తుంటే
తెలుగుభాషలోని అక్షరాలను ఏరుకుని తెస్తున్నా..
పదాలన్నిటినీ ప్రోదిచేసి ఆ భావాలకి అక్షర రూపమీయాలని…
అలుపెరుగని మనసుతో ఎల్లకాలం ఆ పరిమళాలను సొంతంచేసుకుంటూ
కలకాలం నాతోనే దాచేసుకోవాలని…
చిత్రమేమిటో తెలీదుకానీ
ఎన్ని వాణిజ్య సంస్థలు వచ్చినా
ఎన్నెన్ని రకాల పరిమళాలను గుభాళింపచేస్తున్నా
ఆ ప్రకృతమ్మ పులకరింపులో దాగిన గమ్మత్తైన
ఆ పరిమళాన్ని అందిపుచ్చుకున్న ఘనుడేడనీ..
నాటికీ…నేటికీ…ఏనాటికీ…అది మన తరం కాదని
కాలాలు మారినా…జగమంతా మారినా..
మట్టివాసనకు మించిన పరిమళమేదని
గుభాళింపులో దాగిన ఆ గమ్మత్తు ఏదని
దానికదే సాటి కాక మరి దానికి పోటీ ఏదని…
– ఉమామహేశ్వరి యళ్ళ