గొడవ -పరిణామాలు
గొడవ,తగాదా,జగడం, పదాలు ఎన్ని అయినా అవ్వచ్చు కానీ ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య గాని, వర్గాల మధ్య గాని, జరిగితే దాని పరిణామాలు ఊహించలేం.
సాధారణంగా గొడవలు ఎలా మొదలవుతాయి అంటేఒక చిన్న నిప్పు రవ్వ గాలి తోడ్పాటుతో ఒక పెద్ద అరణ్యాన్ని ఎలా అయితే దహించి వేస్తుందో,అలాగే మనుషులు చేసే చిన్న చిన్న తప్పులను పెద్దగా ఎత్తిచూపడం వల్ల గొడవ మొదలవుతుంది,
కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువగా అత్తా, కోడలు మధ్య గొడవలు చూసేవాళ్లం. కానీ రాను రాను ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం నువ్వెంత, అంటే నేనెంత, అనే ధోరణి ఇద్దరిలో ఉండటం వల్ల.
దీని పరిణామాలు ఎలా ఉంటాయో చిన్న కథ రూపంలో…
ఒకానొక చిన్న పల్లెటూర్లో ఒక వ్యక్తి ఉద్యోగం కొరకు పట్నం వెళ్తాడు. అలా కొన్ని రోజులు గడిచాక ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా, అదే ప్రేమ పెద్దల అంగీకారంతో పెళ్లి, ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయి.
కొన్ని సంవత్సరాల్లో ఇద్దరు ఆడపిల్లలు, ఇలా వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతుంది. ఇద్దరి సంపాదనతో ఇల్లు గడిచిపోవడమే కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ఆదా చేసుకుంటూ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.
కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఒక రోజు సాయంత్రం యధావిధిగా భర్త ఇంటికి వస్తాడు. కానీ ఆఫీసులో ఏం జరిగిందో ఏమో, కోపంగా, చిరాకుతో ఉండటం భార్య గమనించింది.
కానీ దృష్టంతా పిల్లలు స్కూల్ నుంచి ఇంకా రాలేదు ఏంటి ? వర్షం వచ్చేలా ఉంది. మీరు వచ్చినప్పుడు తీసుకురాలేదా అని గట్టిగా అరుస్తుంది. కోపంగా ఉండే భర్త దీనికి సమాధానంగా ఎప్పుడూ నేనే తేవాలంటే ఎలా నీకు పిల్లలు అంటే కనీసం లెక్కలేదు.
ఒక్కసారి అయినా తీసుకొచ్చావా ఇంటి గురించి బాధ్యత కూడా నీకు లేదు అని గట్టిగా నాలుగు మాటలు అనేస్తాడు.
ఎప్పుడూ ఒక మాట కూడా అనని భర్త అలా అనేసరికి ఒక్కసారిగా దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. పిల్లలపై ఆలోచన పోయి, నేను ఎందుకు ఇంకా బ్రతకాలని, క్షణకాల ఆవేశంలో, ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది.
కొంత సమయానికి పిల్లలు ఇంటికి వచ్చారు. కానీ ఇంట్లో ఎవరూ లేరు. చుట్టుపక్కల వాళ్లు ఏవేవో మాట్లాడుకుంటున్నారు.
కానీ ఆ చంటి పిల్లలకు ఏం అర్థం అవుతుంది. కన్నీరు కార్చడం తప్ప, అప్పుడే వాళ్ళ నాన్నగారు వచ్చి ఇద్దరిని ఆసుపత్రికి తీసుకువెళ్తాడు.
ఆ రోజు నుంచి దాదాపు పది రోజులు అదే ఆసుపత్రిలో కుటుంబం మొత్తం గడిపింది.రోజు ముస్తాబు చేసి స్కూలుకు పంపించే అమ్మ బెడ్ పై ఉండటం, రోజు తన భుజాలపై ఎక్కించి ఆడించే నాన్న,
బాధతో కృంగిపోతూ ఆసుపత్రి చుట్టూ తిరగడం, అమ్మ తిరిగి వస్తుందో రాదో అనే భయంతో మానసికంగా పిల్లలు కృంగిపోయారు. కొన్ని రోజులు నిశ్శబ్దం తరువాత ఆ పిల్లల ఆవేదన పైవాడు విన్నాడేమో వాళ్ళ అమ్మగారు కోలుకున్నారు.
కోలుకున్న మరుక్షణం ఆమె నుంచి వచ్చిన మొదటి మాట నన్ను క్షమించండి. ఆ మాటతో భర్త కళ్ళలో నీళ్లు తిరిగి ఇంకెప్పుడు కోపం పడను. ఇదంతా నా వల్లే అని బాధపడతాడు.
ఆ రోజు నుంచి వాళ్ల కుటుంబం ఇంతకుముందు లాగే ఆనందంగా ఉంటారు.
పైన జరిగిన అన్ని విషయాలకి కారణం ఒక చిన్న గొడవ. దాని వల్ల వచ్చే క్షణికాల ఆవేశం, కొద్ది నిమిషాలు ఆలోచనతో మెలిగి ఉంటే, ఆ పిల్లలకి ఆ పది రోజులు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు, ఒకవేళ జరగరానిది జరిగితే జీవితాంతం ఆ పిల్లలను ఎవరు ఓదార్చగలరు?
కొన్ని క్షణాల భారం. మరికొన్ని క్షణాల ఆలోచనతో ఉండదని నమ్ముతూ….
-కోటేశ్వరరావు
కుటుంబంలో వచ్చే గొడవలు అన్నీ టీ కప్పులో తుఫాను లాగా
మాయమైపోతాయి. మీరు వ్రాసిన కధ నేటి సమాజానికి కనువిప్పు.
dhanyavaadalu charu gaaru