గీతలు దాటిన యువత
రేయ్ నవీన్ రారా టిఫిన్ చేయి మళ్లీ టైం అయిందంటూ హడావిడి చేస్తావు. అలాగే ఈరోజు బాక్స్ కూడా నీకు ఇష్టమైన సేమియా ఉప్మా చేశాను అంటూ పిలిచింది రమ్య.
తన గదిలో నుండి హడావిడిగా బ్యాగు వేసుకుంటూ వస్తున్న నవీన్ ,ఏంటి టిఫిన్నా , అలాగే బాక్స్ కూడా అవసరం లేదు. నేను బయట క్యాంటీన్లో తింటాను. రోజు ఇంట్లో తిని, తిని బోర్ కొడుతోంది. అంటూ తల్లి చెప్పేది కూడా వినకుండా హడావిడిగా వెళ్ళిపోయాడు.
రమ్య బిత్తర పోయింది. పొద్దున తొందరగా లేచి గబగబా వాడికి ఇష్టమైన పూరి కూర చేసింది. అలాగే బాక్స్ లోకి వాడికి ఇష్టమైన సేమియా ఉప్మా చేసింది. అయినా కూడా ఇవి వాడికి బోర్ కొడుతున్నాయా? చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా తినేవాడు. ఈమధ్య మరి ఇంట్లో తిండి బోర్ కొడుతుందని అంటున్నాడు. అంటూ ఆలోచించుకుంటూ అలాగే కుర్చీలో కూర్చుంది.
అమ్మ…. ఏం టిఫిన్ చేసావు ,తొందరగా పెట్టు. నాకు కాలేజీకి టైం అవుతుంది. అంటూ వచ్చిన వినుత మాటలతో ఈ లోకంలోకి వచ్చిన రమ్య పెడతాను అంటూ సంతోషంగా ప్లేట్ లో పూరి, కూర వేసుకొని వచ్చింది. అది చూసిన వినుత ఛిఛి నాకసలు పూరి అంటేనే ఇష్టం ఉండదు. పొద్దున్నే ఆయిల్ ఫుడ్ ఏంటమ్మా పీపుల్స్ వస్తాయని తెలిదు. ఓ ఓ నీ పుత్ర రత్నానికి ఇష్టమని చేసి ఉంటావు. వాడు తినకుండా వెళ్ళుంటాడు. అందుకే నాకు అంట కట్టాలని చూస్తున్నావా ? నాకేం అవసరం లేదు అంది విసురుగా వినుత.
సరే పోనీ కనీసం సేమ్యా ఉప్మా అయినా తిను అంటూ అది కూడా ప్లేట్ పెట్టుకోనివచ్చింది. అది కూడా నీ కొడుకు కు ఇష్టమనే చేశావు. అంతేగాని ఏ రోజైనా నా ఇష్టాలు పట్టించుకున్నావా? నాకు ఏది ఇష్టమో నీకు తెలుసా? అదేమీ నాకు వద్దు, నేను కూడా క్యాంటీన్లోనే తింటాను, అంటూ విసురుగా వెళ్ళిపోయింది వినుత.
కొడుకు కూతురు అలా వెళ్ళిపోవడంతో బిత్తర పోయిన రమ్య ఏం చేయాలో తెలియక అలా కూర్చుండిపోయింది. ఇంటర్ వరకు పిల్లలు ఇద్దరు బుద్ధిగా ఉన్నవాళ్లే, బీటెక్ లో జాయిన్ చేసిన తర్వాతే కూడా బుద్ధిగానే ఉన్నారు. రెండో సంవత్సరంలోకి వచ్చాకే వాళ్ళ బుద్ధులు కొంచెం కొంచెం గా మారడం మొదలైంది.
మాకు ఇది నచ్చలేదు ,అది నచ్చలేదు అంటూ వంకలు పెట్టడం. ఇంట్లో తినకపోవడం ఎక్కువగా క్యాంటిన్లోనే తింటామంటూ హడావిడిగా వెళ్లిపోవడం. ఆ తర్వాత సాయంత్రం ఎప్పుడో 8:00 కి రావడం పచ్చి రావడంతోటే గదిలోకి వెళ్లి తలుపులు వేసుకోవడం తప్ప తమతో ఎప్పుడూ మాట్లాడలేదు .కాలేజీ విషయాలు ఏవి తమతో చెప్పరు. ఎప్పుడైనా డబ్బు కావాలంటే మాత్రం వాళ్ళ నాన్నగారిని అడిగి తీసుకుంటుంది వినుత నవీన్ లు.
శేఖర్ కూడా అంతే పిల్లల్ని ఏమీ పట్టించుకోడు. వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి పంపిస్తాడు. తప్ప ఎందుకు? ఏమిటి ?అని అడగడు. అని ఆలోచిస్తున్నా రమ్య దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేశాడు శేఖర్.
శేఖర్ నీకు కోపంగా చూస్తూ చూశారా ,ఇదంతా మీ గారాభమే మీరే వాళ్ళని చెడగొడుతున్నారు. డబ్బులు ఇచ్చి. చూడండి నేను చేసిన టిఫిను వాళ్లకి నచ్చలేదట. క్యాంటీన్లో వెళ్లి తింటారట, క్యాంటీన్ వాడు అంత బాగా చేస్తాడా ?తల్లి చేతి ముద్ద కన్నా క్యాంటీన్ వాడి రుచి బాగుంటుందా ? అంటూ తన కోపాన్ని వెళ్ళగక్కింది రమ్య.
అది కాదు రమ్య పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ వాళ్ళ ఇష్టాలు మారుతూ ఉంటాయి. తమ స్నేహితుల్లా తాము ఉండాలని అనుకుంటారు. కాబట్టి తమ స్నేహితులను చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్లు కూడా అదే చేయాలనే అనుకుంటారు.
అందుకే మన ఆహారం నువ్వు చేసిన ఫుడ్ వాళ్ళకు నచ్చదు. వాళ్ళు క్యాంటిన్లో తినడం చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళని మనం అదుపులో పెట్టుకోవాలని అనుకోవడం మూర్ఖత్వమే తప్ప ఇంకేమీ కాదు. మనం ఎలాగో ఎంజాయ్ చేయలేదు. కనీసం పిల్లల్ని అయినా ఎంజాయ్ చేయని అంటూ రమ్య ని ఓదార్చాడు శేఖర్.
ఆ మీరు అలాగే అంటూ ఉండండి .ఏదో ఒక రోజు మన మెడ పైకి వస్తుంది చూస్తూ ఉండండి. అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది రమ్య.
****
కొన్ని రోజుల తర్వాత నవీన్ హడావిడిగా వచ్చి తన రూమ్ లోకి వెళ్లి నాలుగు జతల బట్టలు బ్యాగ్ లోకి కుక్కుకొని డాడ్ అంటూ శేఖర్ దగ్గరికి వెళ్లి నాకు ఒక పది వేలు అర్జెంటుగా కావాలి అంటూ అడిగాడు .శేఖర్ మారు మాట్లాడకుండా తన జేబులోంచి పదివేలు తీసి ఇచ్చాడు.
నవీన్ ఆ డబ్బు తీసుకొని కనీసం రమ్యకైనా చెప్పకుండా హడావుడిగా వెళ్లిపోయాడు. నవీన్ వెళ్లిన కాసేపటికి వినుత తలదించుకొని మెల్లిగా ఇంట్లోకి వచ్చింది.
ఎప్పుడూ హడావిడిగా ఫోన్లో మాట్లాడుతూ తన గదిలోకి వెళ్లిపోయి పడుకునే వినుత ,ఫోన్ ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా తన గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. వీరిద్దరి ప్రవర్తన రమ్యకి ఏమీ అర్థం కాలేదు. శేఖర్ మాత్రం ఇవేమీ గమనించే స్థితిలో లేడు. తన పని ఏదో తాను చూసుకుంటూ ఉన్నాడు.
భోజనం సమయం అవ్వడంతో వినుతను పిలవాలని రమ్య తన గదికి వెళ్లి తలుపులు కొట్టింది. పది నిమిషాలలో తలుపు తీసే వినుత అసలు తలుపులు తీయలేదు. కనీసం వస్తున్నా అనే పిలుపు కూడా లేదు. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటుందేమో, అని అనుకుంటూ తన ఫోన్ కి ఫోన్ చేసింది రమ్య. అయినా సమాధానం లేదు.
అనుమానం వేసిన రమ్య శేఖర్ దగ్గరికి వెళ్లి, శేఖర్ వినుత తలుపులు తెరవడం లేదు. నాకు ఏదో భయంగా ఉంది. కాస్త వచ్చి చూడు అంటూ పిలిచింది. ఏంది తలుపులు తెరవడం లేదా, వస్తున్న ఆగు అంటూ సిస్టం పక్కన పెట్టి, హడావిడిగా బయటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి వినుత వినుత అని పిలువ సాగారు. అయినా లోపలి నుంచి సమాధానం లేదు.
ఇక శేఖర్ ఉండబట్ట లేక తలుపుల్ని లాగి ,లాగి ఓపెన్ చేయాలని చూశాడు. అయినా అవి గట్టి తలుపులు కావడంతో యెంతకీ రాలేదు. ఆ తరువాత ఇంట్లో ఉన్న ఒక పెద్ద గుణపాన్ని తీసుకొచ్చి తలుపుల్ని పగల కొట్టాడు. తలుపులు విరిగిపోయాయి. ఎదురుగా ఫ్యాన్ కు వేలాడుతూ వినుత శవం ఊగుతోంది.
అది చూసి ఇద్దరు షాక్ అయ్యారు ,కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. తర్వాత వెళ్లి వినుత, వినుత అంటూ తనని కిందికి దించే ప్రయత్నం చేశారు. కానీ వారిద్దరి వల్ల అవలేదు.
ఇక శేఖర్ పోలీసులకు ఫోన్ చేశాడు తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ, రమ్య ఏడుపుకు అంతులేదు. వినో,వినో, విను అంటూ ఏడుస్తూనే ఉంది. ఇంతలో పోలీసులు రావడం, జరిగిన విషయం శేఖర్ చెప్పడం .వినుత బాడిని కిందికి దించడం జరిగింది. పోలీసులు ఆ గదిలోకి ఎవరిని రావద్దు అని చెప్పి, ఆగది అంతా సెర్చ్ చేశారు.
అక్కడ వారికొక లేఖ దొరికింది. శేఖర్ ను గ్లౌజులు తడుక్కోమని చెప్పి ఆ లేఖను వారికి ఇచ్చారు. శేఖర్ ఆ లేఖ ను చదవడం మొదలుపెట్టాడు.
అమ్మా,..నాన్న.. నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను .నా క్లాస్మేట్ ఒకతని ప్రేమించాను. కొన్ని రోజులు అతను నన్ను వాడుకొని, ఇప్పుడు పెళ్లి చేసుకోమని అంటే చేసుకోకుండా, ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు.. అడిగితే చేసుకోను ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, అని నన్ను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
అందుకే నేను నా జీవితాన్ని చాలిస్తున్నాను. మీరు నాకు చాలా స్వేచ్ఛనిచ్చారు. కానీ నేను దాన్ని ఉపయోగించుకోలేకపోయాను. నన్ను క్షమిస్తారు కదూ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపులోనే పుట్టాలని కోరుకుంటూ మీ వినుత…
అది చదివిన శేఖర్ ఎంతో బాధపడ్డాడు. అతను కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. అతని చేతుల్లోంచి రమ్య ఆ లెటర్ తీసుకొని చదవడంతో .ఇంకా ఏడుపు ఎక్కువ చేసింది. పోలీసులు బాడీ తీసుకొని పోస్టుమార్టం చేయడానికి ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
పోస్టుమార్టం చేసిన తర్వాత, పోలీసులు వినుత బాడిని వారికి అప్పగించారు. ఇక వినుత చివరి వీడ్కోలుకు వారి కాలేజీ నుంచి కొంతమంది వచ్చారు. మిగిలిన ఎవరూ రాలేదు. వినుత దగ్గర కూర్చొని ఏడుస్తున్నప్పుడు హఠాత్తుగా రమ్యకు నవీన్ గుర్తుకు వచ్చాడు.
నిన్న వాడు హడావిడిగా రావడం ,బట్టలు తీసుకొని పది వేలు తండ్రిని అడిగి తీసుకొని వెళ్లడం .అంతా గుర్తుకొచ్చి వాడు ఏక్కడికి వెళ్లి ఉంటాడు. అని ఆలోచిస్తూ అదే మాటను తన భర్త శేఖర్ కి కూడా చెప్పింది.
శేఖర్ కూడా అనుమానపడి నవీన్ ఫోన్ కు ఫోన్ చేశాడు.. ఫోన్ ఎవరో లిఫ్ట్ చేశారు. హలో అనగానే హలో నవీన్. నవీన్ ఇక్కడ మీ చెల్లి వినుత చనిపోయింది రా, అంటూ చెప్పాడు శేఖర్ ఆత్రుతగా, హలో మీరు ఎవరండి మాట్లాడేది. మేము రైల్వే పోలీసులం, ఇక్కడ మాకు ఒక బాడీ దొరికింది. ఆ బాడి దగ్గర ఈ ఫోన్ ఉంది. మీరు ఇతనికి ఏమవుతారు అంటూ అడిగాడు అవతలి వైపు నుంచి పోలీస్.
ఆ మాట వినగానే శేఖర్ కుప్పకూలిపోయాడు రమ్య అంటూ …ఏంటండీ ఏమైంది అంటూ రమ్య హడావిడిగా శేఖర్ వద్దకు వచ్చింది. రమ్య, రమ్య మన నవీన్ మనకి ఇక లేడు, అంటూ తన ఒళ్లో తల పెట్టుకుని ఏడ్చాడు శేఖర్. ఏంటండీ ఏమైంది అంటూ అతని దగ్గర ఉన్న ఫోన్ తాను తీసుకుంది రమ్య.
అందులో ఎప్పటిలాగే రైల్వే పోలీసు మాకు ఇక్కడ ఒక బాడీ దొరికింది. దాంట్లో ఈ ఫోన్ ఉంది. ఇంతలో మీరే ఫోన్ చేశారు వచ్చి ఇది మీ పిల్లాడిదేనా ఒకసారి చూసుకొని వెళ్ళండి. అని చెప్పడంతో రమ్య షాక్ అయింది.
అయ్యో ఏమిటి ఘోరం, అటు నవీన్, ఇటు వినుత ఇద్దరూ, ఎందుకిలా మాకే ఎందుకు ఇలా జరగాలి ? అంటూ తన భర్తను తీసుకొని రైల్వే పోలీసుల దగ్గరికి వెళ్ళింది. అక్కడ పోలీసులు నవీన్ బ్యాగు తో పాటు బాడీని అతని దగ్గర ఉన్న వస్తువులను అన్నిటినీ ఇస్తూ, మీ అబ్బాయి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. నిన్న అతన్ని పట్టుకునే క్రమంలో సిగ్నల్స్ దాటబోయి రైలు గుద్దేసి చనిపోయాడు.
అయినా మీకు పిల్లలను ఎలా పెంచాలో తెలియదా? పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? ఎవరితో ఉన్నారు ? ఎలా మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు ? అని గమనిస్తూ ఉండాలి. తల్లిదండ్రులు మీకు ఆ మాత్రం కామన్సెన్స్ లేదా పైగా చదువుకున్నట్టున్నారు అంటూ నాలుగు మాటలు కూడా అన్నారు.
ఆ మాటలు పడుతూ, ఏడుస్తూ నవీన్ మృతదేహాన్ని కూడా ఇంటికి తీసుకుని వచ్చారు రమ్య శేఖర్ లు. వినుత శవం పక్కనే నవీన్ శవాన్ని కూడా ఉంచి, ఏడవడం మొదలుపెట్టారు.
వచ్చిన వారిలో కొందరు పెద్దలు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం, పిల్లల్ని సక్రమంగా పెంచడం రావాలి. వాళ్లు ఏ టైం కి వెళ్తున్నారు .ఏ టైం కి వస్తున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారు. అనేది మీరు ఆ మాత్రం గ్రహించుకోలేరా ?
అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వడం, ఆ డబ్బులు అసలు ఎందుకు అడుగుతున్నారో, కనుక్కోకపోవడం వాటిని ఏం చేస్తున్నారు. అనేది తెలుసుకోకపోవడం మీ తప్పే కదా.
కనీసం వారానికి ఒకసారి కాలేజీకి వెళ్లి మా పిల్లలు కాలేజీకి కరెక్ట్ గా వస్తున్నారా లేదా ? పరీక్షల్లో సరిగ్గా చదువుతున్నారా ? లేదా మార్కులు సరిగ్గా వస్తున్నాయా లేదా ? అని కనుక్కోకపోవడం మీ తప్పే, మీరే మీ పిల్లలను అతి గారాబం చేసి పాడు చేస్తున్నారు. ఇప్పుడు చూడండి మీకు కడుపు కోత తప్ప ఇంకేం మిగిలింది. అంటూ అనడంతో వారి దుఃఖం ఇంకా పెరిగింది.
నిజమే తాము పిల్లలకు ఒక గీత గీయకపోవడం, తమ తప్పి పిల్లల్ని స్వేచ్ఛగా ఉంచాలని అనుకోవడం కూడా తమ తప్పె తాము చేసిన తప్పుకు తాము కర్మ అనుభవించాల్సిందే.
నవీన్ గంజాయి సప్లై చేస్తూ దొరకడం ఏంటి? తండ్రిగా నేను నవీన్ ని గ్రహించలేకపోవడం, తల్లిగా రమ్య వినుతని గ్రహించలేకపోవడం, గమనించకపోవడం రెండు తాము చేసిన తప్పులే.
తమ తల్లిదండ్రులు తమని హద్దుల్లో పెట్టారని, తమ పిల్లల్ని తాము హద్దుల్లో పెట్టకపోవడం, వాళ్ళని గీత దాటేలా చేసి నేరాలకు ఉసిగొలిపింది, అందుకు ప్రతిఫలంగా రెండు ప్రాణాలు బలయ్యాయి, మాకు కడుపుకోతని మిగిల్చాయి, అంటూ ఏడవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు రమ్య శేఖర్లు…..
*మీరు మీ పిల్లలకి ఒక గీత గీయండి. ఆ హద్దుల్లో నుంచి వారిని బయటకు పోనివ్వకండి ,కానీ ఆ గీత అనేది ప్రేమగా ఉండాలి తప్ప, శిక్షించేలా ఉండకూడదు అనేది గ్రహిస్తే మంచిది.*
– భవ్యచారు