గిల్లికజ్జాలతో మన ఈ అనుబంధం

 గిల్లికజ్జాలతోమనఈఅనుబంధం

అరేయ్ అన్నయ్య ఎక్కడున్నావు రా నాకు భయపడి ఎక్కడైనా  దాక్కున్నావా రారా… బాబు నాకు టైం అవుతుంది నేను బయటకి వెళ్ళాలి…

ఎందుకే చెవికోసిన మేకలగా అలా అరుస్తునావు…

అమ్మ అన్నయ్య ఎక్కడ వాడికి ఈరోజు రాఖీ కట్టాలి కదా ఎక్కడికి వెళ్ళాడు అంటూ అరుస్తుంది కీర్తి…

వాడు ఉదయాన్నే బయటకి వెళ్ళిపోయాడు నీతో రాఖీ కట్టించుకుంటే ఎక్కడ వాడి పర్సు ఖాళీ చేసేస్తావేమో అని భయపడి ఉదయాన్నే బయటకి వెళ్లిపోయాడేమోలేవే…

అదేంటమ్మా మేము ఈ ఒక్క రోజే కదా రాఖీ కట్టి దానికి గుర్తుగా బహుమతి అడిగేది… ఏ మాకోసం కొంత డబ్బు అయినా ఖర్చు పెట్టకూడదా అంత పరాయివాళ్ళం అయిపోయామా…

పెళ్లి అయిపోతే ఇలా రాఖీ కట్టే అవకాశం ఉంటుందో లేదో చెప్పలేము కదా…

అయినా నేనేమి డబ్బుల కోసం రాఖీ కట్టడం లేదులే…

వాడు అంటే నాకు ఇష్టం నా ఇష్టాన్ని ఈ విధంగా వాడికి చెప్పుకుంటున్నాను ప్రతి సంవత్సరం రాఖీ కట్టి నువ్వు అంటే నాకు ఇష్టం అన్నయ్య నా రక్షవి నీవే, నీ రక్త బంధాన్ని నేనే, మన ఇద్దరం ఎక్కడున్నా ఈ రక్షా బంధన్ రోజునా కలిసి ఒకే దగ్గర ఉండాలి అని చెప్పాలి అనుకుంటాను…

కానీ వాడు నేను డబ్బుల కోసమే రాఖీ కడుతున్నాను అని అనుకుంటున్నాడు అని అలిగినట్లు మూతి ముడుచుకొని లోపలికి వెళ్లిపోయింది కీర్తి…

ఏంటో ఈ పిల్ల వాడు దగ్గర ఉంటే రోజు గొడవ పడుతుంది. వాడు కనిపించకపోతే బాధపడుతుంది…

వాడేమో చెల్లికి ఏదో సర్ప్రైజ్ ఇస్తాను నన్ను అడిగితే బయటకు వెళ్ళిపోయాడు అని చెప్పమని వెళ్ళిపోయాడు…

ఇప్పుడు వాడు ఎప్పుడొస్తాడో దీని కోపాన్ని ఎప్పుడు తీరుస్తాడో అని రాజ్యలక్ష్మి గారు వంటింట్లోకి వెళ్లిపోయింది…

అమ్మ నేను గుడికి వెళ్లి వస్తాను నా మనసేమి బాలేదు అంటూ తన స్కూటీ తీసుకొని గుడికి ప్రయాణం అయింది కీర్తి…

గుడికి చేరుకున్న కీర్తి ఆ దేవుడిని దర్శించుకొని కొంత సేపు గుడి ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని తన స్నేహితురాలి దగ్గరకి వేలెందుకు ప్రయాణం అయింది…

అలా వెళ్తు ఉంటే చిన్న అడవిని తలపించేలా ఒక ప్రదేశం తనకి ఎదురాయింది…

తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళాలి అంటే అది దాట్టుకొని వెళ్లక తప్పదు…

అక్కడ ప్రశాంతంగా, గాలి శబ్దం స్పష్టంగా వినిపిస్తూ ఒక్క మనిషి జాడైనా లేనట్లు ఉంది…

అక్కడక్కడా అలా వచ్చిపోయే వాహనాలు తప్ప పెద్దగా అక్కడ జనసంచారం లేదు…

అది చూసి కీర్తి భయపడుతూనే ముందుకు వెళ్తు కొంత దూరంలో తన ముందున్నది చూసి సడన్గా తన స్కూటీ ఆపి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది…

మళ్ళీ కొన్ని నిమిషాలకు తెరుకొని ఎదురుగా రక్తపు మాడుగులో వున్నా ఒక వ్యక్తి నీ చూసి మానవతా దృక్పథంతో కాపాడటానికి వెళ్లి చూసింది…

ఆ వ్యక్తి దగ్గరకి భయపడుతూనే వెళ్లి చూసేసరికి మాట రాక కళ్ళలోనుంచి కన్నీళ్ళో వచ్చేస్తుంటే వాటిని తుడుచుకోవడం కూడా మర్చిపోయి అన్నయ్య అంటూ నించున్న చోటే కుప్ప కూలిపోయింది…

మళ్ళీ వెంటనే తన అన్నయ్య దగ్గరకి వెళ్లి అన్నయ్య లేవరా నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు…

ఈరోజు నీకోసం ఎంతగా ఎదురు చూశానో తెలుసా నీకు హారతి ఇచ్చి, బొట్టు పెట్టి, రాఖీ కట్టి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అనుకున్నాను అన్నయ్య…

కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారాలుగా కారిపోతు ఉంటే అవి తుడుచుకొని అన్నయ్య నాకు నువ్వు ఏమి ఇవ్వనవసరం లేదు నేను నిన్ను ఏమి అడగను నువ్వు నాతో మాట్లాడితే చాలు…లే అన్నయ్య అంటూ కుదిపేస్తుంది భయంతో…

అలా కీర్తి ఏడుస్తూ ఉండగా సడన్గా రక్తపు మాడుగులో పడివునా వ్యక్తి లేచి కూర్చున్నాడు…

కీర్తి ఒక్కసారిగా పెద్దగా  ఆ…! అంటూ అరుస్తూ దెయ్యం దెయ్యం అని కళ్ళు మూసుకొని వెనక్కి జరిగి కింద పడిపోయింది…

ఆ వ్యక్తి నోరు తెరిచి అలా చూస్తూ ఒసేయ్ దెయ్యం నేను దెయ్యన్ని కాదే నీ అన్నయ్యని అని తన ముందుకి వచ్చి నిలబడ్డాదు…

భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని మిస్టర్ యమ నేను బాధ పడుతున్నాను అని మా అన్నయ్యని తిరిగి మళ్ళీ నా దగ్గరకి పంపించవా కొంపదీసి రాఖీ కట్టిన తరువాత మళ్ళీ తీసుకు వెళ్ళిపోతావా ఏంటి ఐతే నేను అసలు రాఖీ కట్టాను చూసుకో అని మనసులో మాట్లాడుకుంటున్నాను అనుకోని బయటకే మాట్లాడేసింది కీర్తి…

కీర్తి మాటలకి నవ్వాలో ఏడ్వాల్లో తెలియక తల కొట్టుకొని అవ్వ అంటూ పెదాలపై రెండు చేతులు వేసి  అలా ఉండిపోయాడు ఆ వ్యక్తి…

ఈలోపు పక్కన చెట్లు చాటు వున్నా కొంతమంది బయటకి వచ్చి అరేయ్ కార్తీ షాట్ ఓకే రా అంటూ పెద్దగా అరిచారు…

ఆ మాట కీర్తి చెవినా తాకగానే ఎర్ర బద్ద కళ్ళతో కార్తీక్ నీ చూస్తూ కోపంతో ఉగిపోతు ఈరోజు నువ్వు అయిపోయావు రా… నా చేతుల్లో నన్ను ఎంత భయ పెట్టేసావు కొంచెం ఉంటే నా ప్రాణలు పోయేవి అంటూ పక్కన చిన్న చెట్టు కొమ్మ కనిపిస్తే దానితో కార్తీక్ నీ కొట్టడం మొదలు పెట్టింది కీర్తి…

కార్తీక్ కీర్తికి దొరకకుండా పరిగెడుతూ దెయ్యం నా బుజ్జి కదా, నా బంగారం కదా ప్లీజ్ ఏ… కొట్టడం ఆపవే తల్లి వాళ్ళు చూడు ఎలా నవ్వుతున్నారో అంటూ కీర్తి చుట్టూ తిరిగేస్తున్నాడు…

ఒక్కసారి ఆగి నవ్వుతున్న కార్తీక్ స్నేహితుల వైపు చూసేసరికి మాకు ఏమ్ సంబంధం లేదు అంటూ మెల్లగా అక్కడి నుంచి జరుకున్నారు వాళ్ళు…

ఒరేయ్ ఆగండి రా ఈ రాక్షసి దగ్గర నన్ను బుక్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని కేకలు వేస్తున్నాడు కార్తీక్…

కొట్టి కొట్టి అలిసిపోయిన కీర్తి మోకాలు మీద కూర్చొని ఇందగా తాను చూసింది తలుచుకుంటూ మళ్ళీ ఎక్కేక్కి ఏడవడం మొదలు పెట్టింది…

కీర్తి ఏడుపు చూడలేక అరేయ్ బంగారం సారీ రా నేను కావాలని ఇలా చేయలేదు నువ్వు ఈరోజు నాకు రాఖీ కట్టడానికి వేయి కళ్ళతో నా కోసం ఎదురు చూస్తావు కదా ఆ కళ్ళలో ఇంక మెరుపు చూడాలనిపించి నీకోసం నేను సొంతంగా డబ్బులు సంపాదించి గిఫ్ కొనాలి అనుకున్నాను…

ఎలా డబ్బు సంపాదించాలా అని చూస్తూ ఉంటే నా స్నేహితుడు ఇలా యాక్టింగ్ చేస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు…
తాను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటాడు…ఆపదలో వున్నా వాళ్ళ దగ్గరికి మానవతా దృక్పథంతో ఎవరైనా వస్తారో లేదో తెలుసుకోడానికి ఇలా చేసాము…

ఈలోపు నువ్వు వచ్చి హైరణ పడుతూ భయపడిపోయావు…

నాన్న డబ్బులతో నీకు బహుమతి కొనే కంటే నా సంపాదనతో కొని ఇస్తేనే నాకు సంతోషం అంటూ ప్రేమగా  కీర్తి తల నిమిరాడు కార్తీక్…

ఏమో అన్నయ్య నాకు చాలా భయం వేసింది ఒక్కసారిగా ప్రపంచం ఆగిపోయినట్లు అయిపోయింది ఇంకెప్పుడు ఇలా చేయకు నాకు నువ్వు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నీకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను అంటూ కార్తీక్ ని చుట్టుకుపోయింది కీర్తి…

బంగారం నీకు చెప్పకుండా ఇంకేమి చేయను నువ్వు నాకోసం పడ్డ బాధ చుస్తే నా వల్ల కాలేదు…
అనవసరంగా నిన్ను చాలా బాధపెట్టేసాను.

ఇంకెప్పుడు ఇలా చేయను సరేనా అంటూ కళ్ళు తుడిచి… మరీ నా రాఖీ ఏది అంటూ కళ్ళు ఎగరేసి తమాషాగా అడిగాడు కార్తీక్…

కీర్తి నవ్వుతు ఉండు ఇప్పుడే తీసుకు వస్తా అంటూ తన స్కూటీ దగ్గరకు వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రాఖీని తీసుకువచ్చి ఇది నీకోసమే నేను స్వయంగా తయారు చేశాను చెయ్యి ముందుకు చాపు అంటూ వుండంగానే…

కార్తీక్ మధ్యలో అడ్డుకుంటూ బుజ్జి మన చిన్నప్పుడు మన స్కూల్ లో రాఖీ కట్టించేటప్పుడు ఒక వాక్యం లాంటిది చెప్పిస్తూ రాఖీ కటించేవారు కదా మన టీచర్లు అలా అంటూ రాఖీ కట్టు రా… విని చాలా రోజులు అయింది అంటూ చిన్నపిల్లడిలా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ అడిగాడు…

దానికి కీర్తి నవ్వుకుంటూ రాఖిని రెండు చేతులతో పట్టుకొని కార్తీక్ చేయి ముందుకు పెట్టమని…

           నువ్వు నాకు రక్షా…
                  నేను నీకు రక్షా…
                       మనిద్దరం ఈ దేశానికి రక్షా…

అంటూ ఆనందంతో రాఖీ కట్టి మన ఈ గిల్లికజ్జాలతో కూడిన అనుబంధం ఎప్పడు ఇలానే ఉండాలి గుర్తు పెట్టుకో అంటూ…

హమ్మయ్య రాఖీ కట్టేసాను… మరీ నా గిఫ్ట్ అని చేయి చాపగానే…

తన పాకెట్ లో చేయి పెట్టి ఏదో వెతుకుతునట్లు వెతికి బయటకి తీసి కళ్ళు మూసుకో అన్నాడు కార్తీక్…

తన అన్నయ్య ఏదో పెద్ద బహుమతే తనకోసం తెచ్చాడు అనుకోని సంతోషంగా కళ్ళు మూసుకున్న కీర్తి చేతిలో ఒక రూపాయ్ పెట్టి చాక్లెట్ కొనుక్కొని పండగ చేసుకోవే అంటూ తూర్రు మని పారిపోయాడు…

ఒరేయ్ అంటూ కార్తీక్ వెనకాలే కీర్తి పరుగు తీస్తు వాళ్ళ టామ్ అండ్ జెర్రీ కొట్లాటను మళ్ళీ మొదలు పెట్టారు ఇద్దరు…

 

పల్లా క్రాంతి కుమారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *