ఘోష
ఆకలి చావుల ప్రపంచంలో
ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది
మనిషికి మతం ఉన్మాదమిస్తే
దేశాలది విస్తరణ కాంక్ష
శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు !
ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ
ప్రపంచం మళ్ళీ కుంగిపోతోంది
ఉత్తర దక్షిణ ధ్రువాలుగా !
విశ్వ రహస్యాలను ఛేదించే మనిషి
విస్తరణ కాంక్ష అనే అయస్కాంతానికి దేశాలతుక్కుపోతుంటే
నివారించలేని అచేతనుడయ్యాడు !
రణం మొదలవటానికి కారణమక్కర్లేదు
సాకు మాత్రమే చాలని
చరిత్ర చెబుతూనే ఉంటుంది !
కాలం కరుకైనదంటాం
కాదు
దేశాలమధ్య రగిలే కాంక్షలు కరాళనృత్యమై
ఉషోదయాల ఉసురుతీసి
అనిశ్చితి ఊబిలో నెట్టేస్తాయి !
నిట్టూర్చే గొంతులనూ నొక్కేసే నెగళ్ళు రాజుకుంటుంటే
రెక్కలు తెగిన శాంతికపోతాల రుథిరం నిస్సహాయతకు సంకేతమై
జాలిగా ఘోషిస్తుంటుంది !
– సి.యస్.రాంబాబు