గతం ఉత్తేజితమా పరాభవమా
గతమంతా మంచేనా ఇప్పుడు జరిగేది మంచిగా గతంలో పాఠాలు నేర్పింది ఒక లక్ష్యాన్ని ఏర్పరిచింది కొన్ని గాయాలు చేస్తే కొన్నిటిని కొందరిని కొన్ని కలలను ఆశలను అన్నిటిని కోల్పోయేలా చేసింది గతమంతా మంచిది కాదు అలాగని చెడు కాదు పోయిన సంవత్సరం ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలు అనుభవించేలా చేసింది. గత ఏడాది అనుకున్న కలలు ఆశలు ఏవి నెరవేరకుండానే సగంలోనే మాయమైపోయాయి. జీవితం అందంగా ఉంటుందని ఎంతో ఆశించాను కానీ ఆ జీవితం అంధకారమవుతుందని ఊహించలేకపోయాను ఊహించనివి జరగడమే జీవితం అని అప్పుడే పాఠాలు నేర్చుకున్నాము.
అనుకున్నది జరగదు కోరుకున్నది రాదు. చేసి చేయగలిగేది చేయలేము అనుకున్నది సాధించలేము అని నిరాశ పడుతున్న సమయంలో ఎక్కడో ఒక చోట చిన్నగా ఆశ అనేది మొదలైంది ఆ చిన్న దీప కాంతి మెల్లిగా పెరుగుతూ పెరుగుతూ పెద్దదయింది ఆ ఆశ తీరాలి ఆ లక్ష్యం నెరవేరాలి అనుకుంటూ దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తూ, సలహాలు సూచనలు తీసుకుంటూ చేయాల్సిందంతా చేశాను.
ఇంకా ఇప్పటికి చేయాల్సింది చాలా ఉందని అనుకునే సమయంలో చావు చివరి అంచుల వరకు వెళ్లాను కానీ అదృష్టము లేదా నా లక్ష్యం కానీ బ్రతికి బయటపడ్డాను అప్పుడే అనిపించింది నావల్ల సమాజానికి ఇంకా ఏదో ఉపయోగం ఉందని అందుకే అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాను ఏదైనా మొదలుపెట్టడం సులభమే కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే చాలా కష్టం అది ఎంత కష్టమో మొదలుపెట్టిన తర్వాత కానీ తెలియరాలేదు.
అయినా భయం లేదు నేను చేయగలను నేను చేస్తాను ఇంతవరకు ఇదివరకు పిరికిగా భయంగా గడిపేదాన్ని కానీ ఇప్పుడు ఆ భయం ఆ పిరికితనం నాలో లేవు. నేను అనుకున్నది సాధించే వరకు విశ్రమించను నా లక్ష్యం నా ఆశయం నెరవేరేననాడే నాకు సంతోషం. అప్పటివరకు ఎంత ప్రయత్నం చేయాల్సిన అంత ప్రయత్నం చేయగలను అని నన్ను నేను నమ్ముతున్నాను.
నాకు నేనుగా ధైర్యం చెప్పుకుంటున్నా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎవరు ఎంత వెనక్కి లాగాలని చూసినా ఎవరు అవమానించినా ఎవరు అభిమానించినా ఎవరు ప్రేమించినా ఎవరు అసూయ చెందినా ఎవరు ద్వేషాలు పెంచుకున్నా ఎవరేమనుకున్నా నిరంతరాయంగా నిర్విరామంగా నా కృషి చేస్తాను ఇదే నా ఆశయంగా నూతన సంవత్సరంలో ఇంకా ముందుకు వెళ్లాలనేది నా ఆ.
శ నా ఆశ తీరాలని నా లక్ష్యం ఆశయం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గతమెంతో గాయం అయినా మరుపు మార్పు అనేది మనిషికి సహజం కాబట్టి గతం బాధపెట్టిన విషాదమైన దాన్ని మరచిపోయి మళ్లీ కొత్తగా జీవించాలన్నదే నా ఆశయం నవ్వుతూ ఉండాలి నలుగురితో బావుండాలి నలుగురిని నవ్విస్తూ ఉండాలి.
తెలుసుకోలేనివి తెలుసుకోవాలి తెలియనివి తెలియజేసుకోవాలి. మంచి చెడులను గమనిస్తూ చెడు మార్గంలోకి వెళ్లకుండా మంచి మార్గంలో కష్టపడుతూ ఉంటే ఫలితం దానంతట అదే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ముందుగా నన్ను నేను నమ్ముకుంటున్నా నేను చేయగలను అని నాపై నాకు ఉన్న విశ్వాసమే నా ఆయుధం అందుకే నేను సగర్వంగా చెప్పుకోగలను నేనే నా ఆయుధం అంటూ. గతమంతా ఉత్తేజంగా మొదలైన పరాజయం పాలు చేసింది అయినా తట్టుకుంటూ పరాజయాన్ని జయ కేతనంగా ఎగురవేయాలని, నన్ను నేను ఉత్తేజపరచుకోవాలని ఈ నూతన సంవత్సరంలో నిర్ణయం తీసుకుంటూ నిత్య నూతనంగా వెలుగొందాలని ఆశిస్తున్నాను.
– భవ్య చారు