గాలికెక్కిన కవిత్వం
ఎంతటివాడైనా గాలితీసుకుని
బతుకీడ్చాల్సిందే
తీసుకోనని భీష్మిస్తే ఎవరైనా
అతడిని పాడెపైకి ఈడ్చాల్సిందే
గుండెవాద్యం మీద
గాలి మోగించే సంగీతమే ప్రాణం
గాలితో గుండె తగవు పడితే
ఆగాల్సిందే ఊపిరి
బతుకాశ వున్నోడెవరైనా
గాలితో పగపెట్టుకోడు
కడగొట్టు దళితుడైనా
అగ్రహారపు జందెమైనా
క్షత్రియుడైనా ఇంకెవురైనా
గాలి సమానంగానే పీల్చుకుంటారు!
చెమటదేహాల మీదుగా
గాలి విసనకర్రలు పడుతుంది
అది శ్రమజీవికి చేసే ప్రకృతిసన్మానం
మల్లెతోట మీంచి వీచిన గాలి
బాట మీదకు పరిమళమై వ్యాపిస్తుంది
ప్రయాణికులు మలినపుచరణాలు
వేయకూడదనే సంకేతమది
బాటసారి అపగతులు అయినా ఎందుకో..!?
ఊరకనే తిరిగేటోణ్ణి గాలిగాడంటారేం?
అది కచ్చితంగా సరిగాదు
గాలి తిరిగితే ఔపయోగం
మనిషి ఉత్తనే తిరగడమో రోగం
అనాథ స్నానంజేసి
గాలినే తుండుజేసి తుడుచుకుంటాడు
అతడి నిద్రతోనూ రేయంతా
వేపగాలి ఊసులాడిపోతుంది
చాకిరేవులో ఉతికిన బట్టల్ని
గాల్తాడికి ఆరగుచ్చాక
గాలి వాటిని
ఎగిరే కొంగల్ని చేస్తుంది
సముద్రం మధ్య అలల్ని
తీరంతో కలిపే వంతెన గాలి
గాలి ఓ రకంగా అలలకు తల్లి
గాలిగాడు చిలిపి నాట్యాచారుడు
ఆమెల కురులకే కాదు
పైటకూ నటనలు నేర్పుతున్నాడు
చిమ్నీలేని దీపపుజ్వాలతో
గాలి తెగబడుతుంది
పరీక్షలకి చదివే పిల్లాడి తల్లి
రెండుచేతుల్ని చిమ్నీగా అమర్చింది!
గాలిని పోగెట్టి బొమ్మలుగా గీయగలవాడు
ఒకే ఒక్కడు కవి, అది నేను!
-గురువర్థన్ రెడ్డి
చాలా బాగా రాశారు.