గాయ గీతం..
గాయాన్నలా తీసి పారెయోద్దు
నీకు మామూలు విషయం
గాయపరచటం
చేతగాయమో, మాట గాయమో
దేహానికే కదా నొప్పి
నాలుగోడల మధ్య
గుట్టుగా కుమిలే గాయాలు
బయటకు కనిపించవు
పచ్చి గాయాల సలుపును మోస్తోన్న
అమ్మల ఊపిరి చుట్టూ
కర్ఫ్యూ విదించబడి ఉంటుంది
నవ్వుల్ని గాయపరచటం
పువ్వుల్ని రాల్చినంత తేలిక కొందరికి
గాయపు నెత్తుటి వాసన చూసినపుడు
వాడికి పురిటివాసన గుర్తుకు రాదు
గాయాలు స్వేచ్ఛగా మానకుండా
ఇనుప కంచెలు నాటుతారు
గాయాలు దుఃఖించడమే కదా
కొందరికి కావాలి
చర్మగాయాలకు మందు
దొరుకుతుందేమో కానీ
మనసు గాయాలకు ఒక్కోసారి
చిటికెడు ఓదార్పు దొరకదు
గాయాలు ఎపుడూ
గాయపడుతూనే ఉంటాయి
గాయాలు దేశమంతటా
మళ్ళీ మళ్ళీ పురుడు
పోసుకుంటూనే ఉంటాయి
బాధించకపోతే
గాయం పుండుగా మారదు
మలాము అవసరమూ ఉండదు
గాయపరిచే ముందు
గాయపు సలుపును దర్శించాలి
నీలో హింసాపాదును చదును చేయి
కాసింత మనిషిగా మొలకెత్తు
ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి….
– గురువర్ధన్ రెడ్డి
చాలా బాగా చెప్పారు..👌👌👌🙏🙏💐