ఫ్యూజన్.. కన్ఫ్యూజన్ – కథానిక

ఫ్యూజన్.. కన్ఫ్యూజన్ – కథానిక

కొంతమంది తప్పులు చేసినా, మళ్లీ అదే తప్పు చేయరు. మరికొంతమంది చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఈ రెండింటికి ప్రతినిధుల్లా ఉంటారు ప్రసాద్, సీతారాముళ్ళు.

ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఆ స్నేహం పెరిగి పెద్దదయి, ఇప్పుడు రిటైరయినా కొనసాగుతోంది. ఫిజికల్ టాస్క్ కు ప్రసాద్, టెక్నాలజీ టాస్క్ కు సీతారాముడు అన్న పేరు కాస్తో, కూస్తో ఇద్దరూ సంపాదించుకున్నారు.

ప్రసాద్ కి ఎప్పుడవసరమయినా ట్రైన్ టికెట్ నుంచి ఏ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సీతారాముడు చూసుకుంటే కందిపప్పు నుంచి కరక్కాయ వరకు మార్కెట్లో ఏవస్తువు ఎక్కడ చవగ్గా దొరుకుతుందో ప్రసాద్ చెప్పేస్తాడు..

విషయమేమిటంటే ప్రసాద్ కి ట్రైన్ జర్నీ టికెట్లు రానూపోను టికెట్లు కొంటూ ఉంటాడు. ప్రసాదే కొనుక్కోవచ్చు కదా అంటే కుదరంటారు ఇద్దరూను. ప్రస్తుతం ప్రసాద్ కొడుకు దగ్గర ఉండటం తో చెన్నై నుంచి మైసూరు కి వెళ్లి రావటానికి టికెట్లు కొన్నాడు. అయితే,

రిటర్న్ జర్నీ కోసం రెండు తేదీల్లో కొనమన్నాడు ప్రసాద్. వద్దంటాడు సీతారాముడు.. పొరపాటున రాంగ్ డేట్ ది కేన్సిల్ చేస్తానేమో ఏదో ఒక డేట్ కే రిటర్న్ టికెట్ బుక్ చేస్తానంటాడు. ఈ విషయం పై ప్రసాద్ చెప్పే ప్రవచనం వినే ఓపిక లేక రెండు డేట్లకు రిటర్న్ జర్నీకి కొన్నాడు. ఒకటన్నా కేన్సిల్ చేయకపోతే వీడికి నిదరపట్టదు అని చికాకు పడ్డాడు.

మైసూరు లో ఓ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళటం ప్రసాద్ కి అలవాటు. అందుకోసమని ఇప్పుడీ ప్రయాణం భార్యా సమేతంగా పెట్టుకున్నాడు. ప్రసాద్ కు అవసరాన్నిబట్టి జర్నీని మార్చుకోవటం అలవాటు.తిరిగి వెళ్ళటం కోసం ప్రతిసారీ రెండు టికెట్లు కొనటం ప్రసాద్ ట్రేడ్ మార్క్.

ఆ విషయంలో అతను ప్రత్యేకం. తన ప్రత్యేకత సీతారాముడికి అర్థం కాదని తనలోతాను సణుక్కుంటుంటాడు. మూడున ఒక టికెట్, ఆరున ఒక టికెట్ కొనిపించాడు సీతారాముడి చేత. సీతారాముడి తిట్లు, శాపనార్థాలు పట్టించుకోకుండా…

**********

“రాముడూ మూడో తేదీ టికెట్ కేన్సిల్ చేసేయిరా..రెండు రోజుల ముందు కేన్సిల్ చేస్తే తక్కువ అమౌంట్ కట్ అవుతుందిగా. అందుకే ముందు చెబుతున్నా. ఆరునే వెళతాం ” మైసూరు నుంచి ఫోన్ లో చెప్పాడు ప్రసాద్.

“నువ్వెలాగు ఆరునే బయల్దేరతావనుకున్నా. అనవసరంగా ఇలా రెండు టికెట్లు కొనిపిస్తావు. సరే కేన్సిల్ చేస్తాలే ” ఫోన్ పెట్టేసి IRCTC app. ఓపెన్ చేశాడు.

******

సరిగ్గా మూడవతేదీ మధ్యాహ్నం మూడుగంటలకు ఫోన్ చేశాడు ప్రసాద్.

“అనవసరంగా నిన్ను టికెట్ కేన్సిల్ చేయమన్నాను. ఇక్కడ ఆశ్రమంలో కొన్ని కొవిడ్ పాజిటివ్ కేసులొచ్చాయి. రిస్క్ తీసుకోవటం ఇష్టం లేదు. ఆ టికెట్ కేన్సిల్ చేయకుండా ఉండాల్సిందేమో. బుద్దొచ్చింది. ఇకనుంచి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయాలని అర్థమయింది.ఇప్పుడిక్కడనుంచి బయటపడాలి.. ఎలా? బస్ ఆప్షన్ చెప్పకు. అది రూల్డ్ అవుట్.” ప్రసాద్ గొంతులో ఆదుర్దా..

“రాత్రి పదింటికి బెంగళూరు నుంచి చెన్నైకు లాస్ట్ ఫ్లైట్ ఉంది అందులో వెళ్లండి..” తాపీగా చెప్పాడు సీతారాముడు.

“తొందరగా బుక్ చేసేయ్.. టాక్సీలో బెంగళూరు వెళతాము.నిన్ను అనవసరంగా ట్రైన్ టికెట్ కేన్సిల్ చేయమన్నా..” చెప్పిందే చెబుతున్న ఆ పాట ఆపటం లేదు ప్రసాద్..

“ప్రస్తుతం నువు పడాల్సిన పాట్లు చూడు.ఎవడైనా కొనే ప్లాటు చూస్తారు, చేజారిపోయిన ప్లాటు గురించి కాదు” వెటకారంగా అన్నాడు సీతారాముడు..

సరిగ్గా ఆరింటికి మళ్లీ ఫోన్ చేశాడు ప్రసాద్.

“రాముడు ఏమిటిది ఛార్ట్ ప్రిప్రేర్డ్.బర్తు నంబర్లు డిపార్చర్ తొమ్మిది గంటలకు అంటూ IRCTC మెసేజ్ వచ్చింది. టికెట్ కేన్సిల్ అవలేదా. ఒకసారి చూసన్నా చెప్పాల్సింది. లాస్ వేగాస్ గేంబ్లింగ్ లో అంతా పోయినట్లు అన్నీ లాస్ బేరాలే ఈసారి..

కేన్సిల్ అయిందనుకున్న కన్ఫర్మడ్ టికెట్ కన్ను గీటి కిసుక్కుమన్ని నవ్వినట్టుంది కేన్సిల్ చేశాననుకుని చేయకపోవటం ఇది నీకు మూడోసారి” ఏడుపొక్కటే తక్కువ ప్రసాద్ గొంతులో… 

సీతారాముడుకి అప్పుడు ఫ్యూజులు వెలిగాయి.. ఫ్యూజన్ మ్యూజిక్ తో శంకరాభరణం పాటలు విన్నట్టనిపించింది. కన్ఫ్యూజన్ శకలాలు శకలాలుగా విడిపోతుండగా ఆరోజు జరిగింది గుర్తుకొచ్చింది.

ఆరోజు టికెట్ కేన్సిల్ చేయబోతుంటే ఏదో ఫోనొచ్చింది. తను ఫోన్ కాన్సెర్ట్ లో బిజీ అయిపోయాడు. తరవాత ఆ కేన్సిలేషన్ విషయమే మర్చిపోయాడు..

బుర్ర గోకుంటూ తలెత్తి చూశాడు. 

“అరవయేళ్ళొచ్చినా చేసిన తప్పే చేస్తుంటావు..కాస్త మారరా రాముడూ”

చిన్నప్పటినుంచి గారాబం చేసి తనను చెడగొట్టిన తల్లి అదే గారాబంతో ఫొటోలోంచి అడుగుతున్నట్టనిపించింది సీతారాముడుకి..ఫ్యూజన్, కన్ఫ్యూజన్ జోరుపెంచటంతో మళ్లీ ఫ్యూజులు పోయాయి సీతారాముడికి..

– సి. యస్. రాంబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *