ఎవరు వాళ్ళు?
ఆకలి, అవమానాల ఒడిలో
బంధీలైపోయిన….వారు
సంకలో బిడ్డ పాలకై
ఎండిన తన రొమ్ములను
నింపుకోవడానికి
చేయి చాచి అడిగేవాడు
కడుపు చేతపట్టుకొని
పెన్నులు అమ్ముకునే
నిత్య కార్మికులు…వాళ్ళు
మాసిన బట్టలు వేసుకొని
దుమ్ము పట్టిన నీ కారు
అద్దాలను తుడిచే వాళ్ళు..వారు
ఇంతకీ ఎవరు వాళ్ళు..??
కాలాన్ని వదిలి ఇళ్లను వదిలి
పంటలను వదిలి ఊరును వదిలి
కోడిపిల్లల గుంపులోకి గద్ద
వచ్చినట్టు అల్లకల్లోలమై,
పచ్చి నెత్తురు అంటిన
పాదాలతో ప్రయాణమైన..వాళ్ళు
ఎవరు వాళ్ళు…??
కట్టుకునే బట్ట పైన, తినే తిండి పైన
ఆధిపత్యం చలాయిస్తున్న
ప్రశ్నించలేని మూగవాళ్ళు..వారు
ఎవరు వాళ్ళు…??
చదువుకునే సోపతి లేక
పంట పండించే సామర్థ్యం లేక
అన్నీ వారిలానే బీడువారిపోతే
కాకరకద్దలాంటి కార్పొరేటర్లు
భూములను రొట్టెముక్కలా
పొడుచుకు తింటుంటే
న్యాయం చేయలేని
గవర్నమెంట్లు గుడ్లగూబల్లా చూస్తుంటే
కష్టాన్ని నమ్ముకొని పల్లెలు
వదిలి పట్టణాలకు బయలుదేరిన
బాటసారులు…వాళ్ళు
వాళ్లు అడిగింది ఏమిటి?
ఖాళీ కడుపులో మెలి తిరిగిన
పేగుల కోసం పట్టెడన్నం
కట్టుకోవడానికి ఓ బట్ట
ఉండడానికి ఆ మురికి కాలువల
పక్కపొంటి ఉండే ఓ గుడిసె
కానీ మనం వాళ్ళకి ఇచ్చింది ఏమిటి?
మానభంగం చేసినా తిరిగి
ప్రశ్నించలేని గొంతును,
గుడిసెల్లో కాలిన కొన్ని శవాల
కమురు వాసనను,
చెయ్యి చాచి అడిగిన వారికి
బిచ్చగాళ్ళు అని బిరుదును.
-విశ్వనాథ్