ఎవరు పార్ట్ 5
అలీ నీళ్లు చల్లి లేపాడు. లేవగానే తాగటానికి నీరు ఇచ్చి, నేను పైకి లేచిన వెంటనే
“ఏంటి వ్యాయామమా ?”
వీడికి అలా అర్థం అయ్యిందా! “ఆ… అలాంటిదే. నువ్వు… ఇక్కడ”
“నేను ఒక పని ఉండి వచ్చాను”
బట్టలు దులుపుకుంటూ “అందరూ పని ఉండే వస్తారు. ఆ పని ఏంటి అని?”
“నేను నాటక రచయితను. ఊరు మారితే ఆలోచనలు మారతాయి అని కొత్త కొత్త ప్రదేశాలు చూస్తూ ఈ ఊరు వచ్చాను. కానీ ఇక్కడ జనాలు మరీ విచిత్రంగా ఉన్నారు. నీ లాగా.. ”
“ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండు, నీకు నేను దేవుడిలా కనిపిస్తాను.” అని నాకు నీరు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపి నేను ఇంటికి వెళ్తుండగా “నాకు ఇక్కడ నివసించటానికి ఒక ఇల్లు కావాలి”
ఇతను మాట్లాడుతున్నదానికి అడుగుతున్నదానికి సంబంధం లేదు అనిపించింది. కానీ నాతో ఎవరన్నా ఉంటె నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది.
“మళ్ళి మౌనమా? నీకు ఇక్కడ ఎవరన్నా తెలుసా.”
“మా ఇంట్లో చోటు ఉందా అని అడుగుతున్నావా?”
“అలానే అనుకో”
“సరే నాతో రా.” అని అలీని నాతో తీసుకుని వెళ్ళాను.
ఆ రోజు మనసంతా అదోలా అనిపించింది. నేను చూసింది ఎలాగైనా పోలీస్ కి చెప్పాలి అనుకున్నా. కానీ వారి మీద నాకు నమ్మకం కుదరలేదు. అలీతో మాట్లాడితే కొంచెం మనసు కుదుటపడుతుంది, అలాగే పోలీసులకి చెప్పాలా వద్దా అనే విషయంలో అతని సలహా కూడా అడగొచ్చు అని అతని కోసం చూసాను. అతను మాత్రం గురక పెడుతూ గాఢ నిద్రలో నుంచి ఎంత సేపటికి లెగలేదు.
“వీడి గురక వల్ల ఉన్న కాస్త మనఃశాంతి కూడా పోయేటట్టు ఉంది” అని అనుకుంటూ ఉండగా, కారు శబ్దం వినిపించింది. బయట భూపతి గారు, దర్శన్ గారు కారులో ఉండి హార్న్ కొడుతున్నారు. దగ్గరికి వెళ్ళాను. డ్రైవర్ బదులు మహేష్ గారు డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు.
“నీకు డ్రైవింగ్ వచ్చా?” మహేష్ గారు
“రాదు సార్ ”
అంతలో పక్క నుండి దర్శన్ గారు మహేష్ చెవిలో మెల్లగా ఏదో చెప్పారు. నాకు అంత వినిపించలేదు కానీ ఈ ఒక్క మాట వినిపించింది “ఇతను ఎందుకు? ”.
మహేష్ గారు మాత్రం పైకి గట్టిగా “పర్లేదు రానివ్వండి, నువ్వు కారు ఎక్కు.”
ఎక్కడికి అని అడిగే ధైర్యం చేయలేదు. మౌనంగా కుర్చున్నాను. కారు మెల్లగా అడవిలోకి చేరుకుంది. దారి అంత బాలేదు, దానికి తోడు షరా మామూలుగా వర్షం. వెళ్తున్న కొద్దీ దర్శన్, మహేష్ గారి మోహములో చెమటలు కనిపించాయి. చినుకులు ఇంజిన్ పై పడి వేడి సెగలు విసురుతుంది. ఒక గూడెం లాంటి చోటికి చేరుకున్నాము. దారికి ఇరువైపులా చెట్లు, వాటి మీద అడవిజాతి వారు ఆయుధాలతో మమల్ని వింతగా చూస్తునారు. కారు నుండి కిందకి దిగాము. అక్కడ మా కోసం ఒక అతను నిలబడి ఉన్నాడు.
మహేష్ గారిని చూసి వంగి దండాలు పెట్టాడు. నన్ను చూసి అతను “ఇతను… లోపలికి “ అని సంకోచిస్తూ అన్నాడు.
దర్శన్ “ఇబ్బంది అనుకుంటే ఇక్కడే ఉంటాడు.”
“వదిలేయటమే మంచిది అయ్యా”
“సరే, నువ్వు ఇక్కడే ఉండు రాయుడు.” మహేష్ గారు.
నన్ను అక్కడే విడిచి, వాళ్ళు మాత్రం దూరంగా ఉన్న ఒక గుడిసెలోకి వెళ్లారు. అది ఆ గూడెం నాయకుడి నివాసంలాగా అనిపించింది. నేను చుట్టూ చూస్తూ వర్షం చినుకుల్లో ఉండటం ఎందుకు అని కారులో కూర్చున్నా. భయంతో ఆ చుట్టూ ఉన్న జనాన్ని చూడలేదు. కాసేపటికి ఒక పిల్లవాడు కారు దగ్గరికి వచ్చి వింతగా చూస్తూ, నా వైపు చూసి నవ్వాడు.
దగ్గరికి వచ్చి ఇంజిన్ దగ్గర తాకగానే అది వేడిగా ఉండటం వల్ల గట్టిగా అరిచాడు. కారును అడవిజాతి వారు చుట్టుముట్టారు. వారిని చూసి అంత చల్లని వాతావరణంలోనూ నాకు చెమటలు పట్టాయి. వాళ్ళ సైగలు లాంటి అరుపులు చూసి వాళ్ళకి కారు నచ్చలేదు అని అర్థం అయ్యింది. అంతలో మహేష్ భూపతి, దర్శన్ కారు దగ్గరికి వచ్చి, ఆ జనం మధ్యలో నుండి కారు ఎక్కారు.
అక్కడ నుండి ఇంటికి వచ్చే వరకు కారులో నిశ్శబ్దం. చర్చలు ఫలించలేదేమో అనిపించింది. భవంతి దగ్గరకు వచ్చాక మహేష్ గారు హడావిడిగా లోపలికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకుందాము అని దర్శన్ గారిని పిలిచాను. నా పిలుపికి వెనక్కి తిరిగి
“రాయుడు, ఇప్పుడు జరిగింది, చూసింది బయటకు పొక్క నివ్వకు.”
“ఏమి జరిగింది? ఏమి చూసాను? అని నన్ను బయటకు చెప్పద్దు అంటున్నారు” అని మనసులో అనుకుని, సరే అని తల ఆడించాను.
*******
మరునాడు నేను భవంతి లెక్కలు చూస్తుండగా గదిలోకి మహేష్ గారు వచ్చారు. మహేష్ గారు “లక్ష్మి” అని పిలిచారు. లోపలికి నా గజ్జెలు నడుచుకుంటూ వచ్చింది. నేను వెతుకుతున్న అమ్మాయి నా కళ్ళ ఎదుట ప్రత్యక్షం అయ్యేసరికి ఒళ్ళు జలదరించింది.
“ఈమె పేరు లక్ష్మి, ఇక నుండి భవంతి పనులు ఈమె చూసుకుంటుంది. నువ్వు ఇక్కడ వివరాలు ఈమెకు చెప్పు. అలానే ఉండటానికి గది కూడా చూపించు.”
ఆమె నాకు నమస్కారం పెడుతూ చిన్నగా నవ్వింది. ఆమెతో పాటు ఆమె చెవులకు ఉన్న లోలాకులు, తలలో నుండి దారి తప్పి మోము పక్కకు వేలాడుతున్న నల్లటి కురులు కూడా నన్ను పలకరించాయి.
మహేష్ గారు “నేను చెప్పింది వినపడిందా?” అని కసురుకున్నారు.
“వినపడింది అండి” అని నేను చెప్పగానే ఆయన అక్కడ నుండి వెళ్లిపోయారు. నేను ఆమె దగ్గరకు వెళ్లి
“నా పేరు నరేంద్ర రాయుడు. నేను ఇక్కడ నిర్వాహకుడుగా పనిచేస్తున్నాను.” ఆమె అలాగే అని తల ఆడించింది.
“ఒక రెండు ఘడియలు ఇక్కడ కూర్చోండి, చిన్న పని మధ్యలో ఉన్నాను, అది అయ్యాక, మీకు గది చూపిస్తాను.” ఆమె మళ్ళీ తల ఆడించి, అక్కడ కుర్చీలో కూర్చుంది.
లంగా ఓణిలో ఉన్న ఆమె, కుర్చీలో కూర్చుని చుట్టూ గమనిస్తుంది. చిత్రలేఖనం వస్తే చిత్రీకరించాలి అనుకునే, పదప్రయోగంలో ప్రావిణ్యం ఉంటె పద్యం పూరించాలి అనిపించే క్షణం అది. ఆమె అక్కడే ఉంటె, నా పని మీద ఏకాగ్రత ఎలాగో నిలుపలేను అని తెలిసి ఆమెకు గది చూపటానికి బయలుదేరాను.
తన గదిలో సామానులు పెట్టి “మీరు ఈ రోజుకి విశ్రాంతి తీసుకోండి. రేపు పని వివరాలు మాట్లాడుకుందాం.” మళ్ళీ తల ఆడించింది. ఒక మాట కూడా మాట్లాడదా?
తను నా వైపే చూస్తుంది. నేనూ మాట్లాడుతుందేమో అని అలానే చూస్తున్నా. కనుబొమ్మలు పైకి ఎగరేసింది. అప్పుడు గానీ నాకు అర్ధం కాలేదు, తాను నేను బయటకి ఎప్పుడు వెళ్తానా అని చూస్తుంది అని!
“నేను ఎదురుగుండా ఉన్న అతిథిగృహం లో ఉంటాను. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా పిలవండి.” అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. బయటకు రాగానే ఆమె తలుపు వేసుకుంది. నా చూపు ఆమెకు అర్థమైందా? ఇలా ప్రతిదానికి తలాడిస్తుంటే ఎలా? ఒక మాట అయన మాట్లాడచ్చు కదా?
అంతలో తలుపు తీసిన శబ్దం. వెనక్కి చూసాను.
“గదిలో త్రాగటానికి నీరు లేదు అండి?”
“అయ్యో, నేను తీసుకుని వస్తాను”
“మీరా?”
“అంత భయపడక్కర్లేదు అండి, నేనూ మాములు మనిషినే!”
“పెద్దవారు కదా”
“గెడ్డం, జుట్టు వల్ల అలా అనిపిస్తుంది లక్ష్మి గారు” అని ఒక చిలిపి నవ్వు నవ్వాను.
“వయసులో కాదు, వృత్తిలో అని నా ఉద్దేశం.”
“రెండు నిముషాలలో మీకు నీరు గదిలో ఉంటుంది.” అని చెప్పి అక్కడ నుండి వెళ్లి, పని అమ్మాయికి నీరు ఇమ్మని చెప్పి నేను మంగలవాడి ఇంటికి వెళ్ళాను.
*********
“కాస్త తల నీలాలు కత్తిరించాలి.”
“మీరు?”
“నేను ఎస్టేట్ కి కొత్తగా వచ్చిన నిర్వాహకుడిని.”
“మీరు ఎందుకు వచ్చారు, కబురు పెడితే నేనే అక్కడికి వచ్చేవాడిని కదా.”
“పర్వాలేదు, ఇప్పుడు మీ ఇంటి దగ్గర చేయగలవా?”
“రండి, ఇలా కూర్చోండి”
అని అతను తన పని మొదలుపెట్టాడు. నా దృష్టి అక్కడే ఉన్న ఒక చిత్రం మీద పడింది. పరిశీలనగా చూసాను. అది ఒక అమ్మవారి చిత్రపటం, అందులో వాడిన రంగులు గాని, అందులో ఉన్న అమ్మవారి రూపం కానీ నేను ముందెన్నడూ చూడలేదు. అది చూస్తునంత సేపు మనసులో అలజడి, ఆ పటంలో ఏదో ఆకర్షణ శక్తి, చూపు తిప్పలేకపోయాను.
“ఆ చిత్రపటం?”
“అది భూపతి గారు నాకు బహుమతిగా ఇచ్చారు.” అని చెప్పి ఆ పటం తీసి అతను లోపల పెట్టేసాడు.
నాకు అతను ఎందుకు లోపల పెట్టుకున్నాడో అర్థం కాలేదు. బహుశా అది నేను అడుగుతాననేమూ. అది లోపల పెట్టిన కాసేపటికి మళ్ళీ ఆ చిత్రాన్ని చూడాలి అని అనుభూతి. ఆ అనుభూతి విపరీతమై మళ్ళీ అలజడి.
– భరద్వాజ్ (BJ Writings)