ఎవరు పార్ట్ 4
అలీ షాకారులో ఇంటికి వెళ్తున్నంత సేపు నా సంచిలో పత్రాలు ఎలా పోయాయి, జట్కా బండి ఎందుకు లేదు అనే ఆలోచనలో ఉండిపోయాను. భవంతి రాగానే మహేష్ గారు, నేను కారు దిగి లోపలికి వెళ్తున్నాము.
మహేష్ గారు “ఏమి ఆలోచిస్తున్నావు?”
“ఏమి లేదు సార్” అని నా ఆలోచనలని కప్పేసుకున్నాను.
“ఆ పోలీస్ నీ దగ్గర ఎంతో కొంత డబ్బు తీసుకోవచ్చని అలా అని ఉంటాడు. నువ్వు అది మనసులో పెట్టుకోకు. వెళ్లి విశ్రాంతి తీసుకో.”
“సరే” అని చెప్పి నేను అతిథిగృహానికి వెళ్తుండగా ఒక పెద్ద అరుపు వినిపించింది. వెనక్కి తిరిగి చూసాను, పని అమ్మాయి గట్టిగా అరుస్తూ, కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. ఆమె చూస్తున్న వైపు చూసాను. నాలుగు అడుగుల బాణం భూమి లోకి దిగి ఉంది, పక్కన భూపతి గారు కింద పడి ఉన్నారు. నేను పరిగెట్టుకుంటూ వెళ్లి, ఆయనను లేపాను.
నాతో పాటు పని వారు కూడా వచ్చారు. మహేష్ గారు మెల్లగా అదురు నుండి తేరుకున్నారు. నాకు ఆ బాణానికి కట్టి ఉన్న ఒక లేఖ కనిపించింది. దగ్గరికి వెళ్లి అది తీసి చదవబోయాను. నాకు ఆ భాష అర్థం కాలేదు. అంతలో మహేష్ గారు వచ్చి ఆ లేఖను తీసుకున్నారు. అది జేబు లో పెట్టుకుని భవంతిలోకి నడిచారు. మిగతా పని వారు అందరూ లేఖ గురించి గుసగుసలు మొదలుపెట్టారు. వెళ్తున్న మహేష్ గారు వెనక్కి తిరగ్గానే అందరూ నిశ్శబ్దంగా ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్లిపోయారు.
ఆ రోజు మహేష్ గారు గదిలో నుండి బయటకు రాలేదు. మరునాడు భవంతికి దర్శన చిత్రపాటి, పోలీస్ ఇన్స్పెక్టర్, ఇంకా చాలా మంది వచ్చి మహేష్ గారిని కలిశారు. కానీ ఆయన మాత్రం తన గది లో నుండి బయటకి రాలేదు. నేను కాఫీ ఎస్టేట్ కి బయల్దేరాను. వెళ్ళీ వెళ్ళగానే వెతక సాగాను. ఆ అమ్మాయి మళ్ళీ కనిపించాలని ఒక ఆశ.
వెనక నుండి వయసులో ఉన్న ప్రతి అమ్మాయి ఆమె లానే అనిపించారు. ముందుకు వెళ్లి చూస్తే గాని తెలిసిరాలేదు ఆమెకి వీరికి ఉన్న తేడా. ఎడారిలో ఎండమావి లాగా ప్రతి అమ్మాయీ ఆమె అనుకుని దగ్గరికి వెళ్ళటం చూసి నిరుత్సహపడటం. ఇంకా వెతికి ప్రయోజనం లేదు అనుకుని ఇంటికి బయల్దేరాను.
ఇంటికి రాగానే మహేష్ గారు నుండి కబురు వచ్చింది. మహేష్ గారి ఆఫీస్ రూమ్ కి వెళ్తుండగా అమ్మాయి నవ్వులు వినిపించాయి. అమ్మాయిలు అంటే పడని మహేష్ గారి గదిలో ఎవరా అమ్మాయి అని లోపలికి వెళ్లి చూసాను. గదిలో దర్శన చిత్రపాటి మరియు ఎవరో అమ్మాయి ఇంగ్లీష్ గౌన్ లో ఉంది. చూడడానికి చక్కగా ఉంది.
దర్శన్ చిత్రపాటి: “రాయుడూ.. మొత్తం మీద పోతన దెబ్బ తట్టుకుని ఇక్కడే ఉన్నావు.”
“అర్థం కాలేదండి.”
“ఏమి లేదు. ఎలా ఉంది కొత్త ఉద్యోగం?”
“బాగుంది. ఈమె?” అని సాగదీసాను.
“ఆమె మా అమ్మాయి, ఆలోక్య చిత్రపాటి.”
ఆమెకు నమస్తే చెప్పాను. అంతలో భూపతి గారు లోపలికి వచ్చారు.
“ఏమి రాయుడు! ఎలా ఉంది ఇప్పుడు?” మహేష్ గారు. నేను ఒక చిరు నవ్వు నవ్వాను. ఆయన కుర్చీలో కూర్చుంటూ ఉండగా
“నిన్న వచ్చిన లేఖలో ఏమి ఉంది సార్?”
మహేష్ భూపతి ముఖకవళికలలో మార్పు కనిపించింది. అది గమనించిన ఆలోక్య గారు “అన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకొనుట అంత మంచిది కాదు.”
దర్శన్ గారు “కొత్తగా వచ్చాడు కదా, ఇక్కడ పద్ధతులు ఇంకా తెలిసి రాలేదు. ఇప్పుడు నిన్ను పిల్చింది అందుకే.”
మహేష్ గారు “కంగారు పడకు. ఉదయం జరిగిన విషయం బయటకు పొక్కనివ్వద్దు. పనివారికి కూడా అదే చెప్పు.”
“సరే సార్.”
దర్శన్: “ఇంక నువ్వు బయలుదేరచ్చు”
మహేష్ గారు “ఒక్క నిముషం, వీరు ఈ రాత్రి ఇక్కడే ఉండుటకు ఏర్పాటు చెయ్యి. మర్యాదలు విషయంలో మచ్చ పడకూడదు.”
దర్శన్ నవ్వుతు “మనకి మనకి మర్యాదలు ఎందుకు! ”
మహేష్ గారు “ఊరుకి దూరంగా పెరిగానేమో కానీ పద్ధతులకు కాదు.”
ఆలోక్య కనురెప్పలు ఎగరేస్తూ “well said.”
వారికి విందు, పడక వసతులు ఏర్పాటు చేసి నేను ఇంటికి వచ్చేసరికి రాత్రి చాలా సమయం అయ్యింది. అలిసిపోయి గాఢ నిద్రలోకి వెళ్లిన నాకు ఎవరో తలుపు కొడుతున్నట్టు అనిపించి లేచాను. మెల్లగా ఎవరో “పోతన.. పోతన” అని పిలుస్తున్నారు.
నాకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. కాసేపు అలాగే మౌనంగా ఉన్నాను. కాసేపటికి ఆ రాత్రి లాగా వింత కూత వినిపించింది. ఇంకా మౌనంగా ఉంటే లాభం లేదు అనిపించింది. నేను అక్కడే ఉన్న నల్ల దుప్పటి కప్పుకుని, భవంతి తాళాలు తీస్కుని అందులో నుండి ఖజానా గది తాళం, మహేష్ గారి గది తాళం తీసేసాను.
మళ్ళి తలుపు చప్పుడులు మొదలయ్యాయి. తలుపు తీసి వెనక్కి తిరిగి తాళం వారికి ఇచ్చాను. నేను నా గదిలో నుండి దీపం తీస్కుని బయటకి వచ్చాను. వారు వరసగా భవంతి వైపు నడుస్తూ వెళ్లారు. నేనూ వారి వెనక, వరసలో నడుస్తూ వెళ్ళాను.
అందరూ చాలా బలిష్టంగా ఉన్నారు. వంటికి బాగా నూనె రాసుకుని, చేతిలో పగ్గాలు, నడుముకి కట్టిన ఒరలో చిన్న కత్తి పెట్టుకుని ఉన్నారు. భవంతి దగ్గరికి రాగానే అందరూ వివిధ వైపుల నుండి చేతిలో పగ్గాలు తీసుకొని భవంతి పైకి విసిరి, ఉడుము లాగా పైకి పాక సాగారు. నాకు కంగారు, భయం మొదలయ్యాయి. నేను ఏమి చేశానో నాకే అర్ధం కాలేదు.
వాళ్లు ఎవరో తెలుసుకోబోయి, వారికి తాళము ఇచ్చి తప్పు చేసానా? చాల సేపు పిచ్చి ఆలోచనలో అలానే తిరుగుతూ ఉన్నా. వారు లోపల ఏమి చేస్తున్నారా అని భయం ఎక్కువ అయిపోయింది. దూరంగా ఉన్న చెట్టు వైపుకి పరిగెత్తి దాని వెనక నుండి ఇంతకు ముందు నేను విన్న అదే కూత కుశాను. చడీ చప్పుడు లేదు, భవంతి ప్రశాంతంగా ఉంది. కాసేపు ఆగి మళ్ళీ కూశాను. నాలో భయం నన్ను నిలువుగా నిలబడనివ్వలేదు. అందరిని లేపేద్దాము అని నిశ్చయించుకుని ముందుకు కదిలాను.
అంతలో వెనక నుండి “పోతన.. ఏమైంది?”
వెంటనే నా చేతిలో ఉన్న దీపం కిందకి ఉంచా. వెనక్కి తిరిగితే, గుర్తు పడితే? నేను అక్కడే నిలబడ్డాను.
“ఏంటి అక్కడే నిలబడ్డావు, రా” అని అతను నా పక్కన నుండి ముందుకి నడుస్తూ నా మీదకు తాళాలు విసిరాడు. అతను చేతిలో ఉన్న కాగడా వెలుగులో దారి చూసుకుంటూ వెళ్తున్నాడు. నేను దీపంతో అతని వెనకే నడిచాను. మెల్లగా భవంతి నుండి దూరంగా, అడివి అంచుల్లోకి వెళ్ళాము.
సమయం చూసి పారిపోవటం తప్ప నాకు వేరే దారి కనిపించట్లేదు. నా దీపం వెలుగులో అతని ఒరలో ఉన్న కత్తి మెరుస్తూ ఉంది. అతని ముందు దారిలో ఎవరో అడ్డుగా నిలబడి ఉన్నారు. అతను ఎవరా అని కాగడా ఎత్తి మొహం మీద కాంతి పడేలా ఉంచాడు. ఎదురుగా పోతన. నా గుండె ఆగిపోయింది.
అతను వెంటనే వెనక్కి తిరిగాడు. నేను నా చేతిలో ఉన్న దీపాన్ని కిందకు విసిరేసాను. అది కింద ఉన్న ఎండిపోయిన ఆకులని జతకలుపుకుని పెద్ద అగ్నిగుండంలా మంట రూపంలో పైకి లేచింది. నేను వెంటనే పరుగు మొదలు పెట్టాను. పరిగెడుతూ పరిగెడుతూనే ఉన్నాను.
వెలుగు వచ్చినా నా పరుగు ఆగలేదు. నా గుండె గట్టిగా అరుస్తుంది. ఎదురుగా వస్తున్న ఒకతన్ని ఢీ కొట్టి కింద పడిపోయాను. నా కళ్ళు తెరిచి ఎవరా అని చూసే ఓపిక కూడా లేకపోయింది. కష్టపడి కళ్ళు తెరిచి చూస్తే అది అలీ. మొహమ్మద్ అలీ షా.
– భరద్వాజ్ (Bj Writings)