ఎవరు పార్ట్ 10

ఎవరు పార్ట్ 10

“ఏంటి ఈ హడావిడి? ఎక్కడికి తీస్కుని వెళ్తున్నావ్?” నిద్ర బద్దకం వదలక పోవటం వల్ల వచ్చిన విసుగుతో అలీ ప్రశ్నలు సంధిస్తునాడు. “భాయ్, కాస్త మాట్లాడు.”

హడావిడిగా వెళ్తున్న నేను వెనక్కి తిరిగి “కాసేపు ఓపిక పట్టచ్చు కదా, నీకే తెలుస్తుంది. అంత మెల్లగా నడిస్తే ఎలా!”

“పోదు పొద్దునే పరుగులు నా వల్ల కాదు. మంచు కూడా ఇంకా పోలేదు.” నడుస్తున్న వాడు ఆగిపోయి, నడుము పట్టుకుని “ఎక్కడికో చెప్పు”

“పోతన కోసం”

“పోతన?” అలీ

“అదే నా ముందు ఇక్కడ పని చేస్తుండే తాత.”

“అది తెలుసు, ఇప్పుడు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళటం ఎందుకు?” అలీ

“తన మీద నాకు అనుమానం ఉంది”

“ఎప్పుడూ లేనిదీ ఇప్పుడు హఠాత్తుగా నీకు ఈ పరిశోధక బుద్ధి పుట్టింది ఏంటి?” అలీ

“ఇప్పటి వరకు ఏది ఎలా జరిగినా అది నా వరకు రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. దీని వెనక దేవుడో, దెయ్యమో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. సేద తీరింది చాలు పదా, ఇంకా చాలా దూరం వెళ్ళాలి. నడుస్తూ మాట్లాడుకుందాం.”

“నీ వరకు, అన్నది కాస్త ఆలస్యంగా అర్ధం అయ్యింది. లక్ష్మి గారి గురించి మాట్లాడ్తున్నావా?” ఏదో సాధించినట్టు అడిగాడు అలీ

“అవును. లక్ష్మి గారి మీద ప్రమాదం పొంచి ఉంది. అది ఎలాగైనా అడ్డుకోవాలి.”

అలీ నవ్వుతూ “మద్యం మైకం వదిలినట్టు ఉంది”

“నేను ఏమి మాట్లాడ్తున్నా, నువ్వు ఏమి మాట్లాడ్తున్నావ్? అది జరిగి నాలుగు రోజులు అయ్యింది.”

“పరేషాన్ ఎందుకు, సరదాగా అన్నాను. కానీ అందులోనూ నిజం ఉంది కదా, తాగటం ఎందుకు, అన్ని రోజులు తల పట్టుకోవడం ఎందుకు?”

మాట్లాడుకుంటూ, మాట్లాడుకుంటూ పోతన ఇంటికి చేరాము. కానీ ఇల్లు తాళం వేసి ఉంది. ఆరా తీయటానికి చుట్టు పక్కల ఇళ్ళు కనిపించలేదు. కానీ దూరంగా ఒక అతను పని చేసుకుంటూ కనిపించాడు.

అతని దగ్గరికి వెళ్ళాము. మమల్ని చూసి పని ఆపేసి మా మొహాలు చూసాడు.

“ఇక్కడ పోతన అని భూపతి గారి ఎస్టేట్స్ లో పనిచేసేవాడు. ఆయనను ఒకసారి కలవాలి.”

“పోతన ఇక్కడ ఎక్కడ ఉంటాడు, ఆడు ఎస్టేట్ లోనే ఉంటాడు. అక్కడికి పోతే కనబడతాడు.” తన తుండుతో చెమట తుడుచుకుంటూ సమాధానం చెప్పాడు.

అలీ “మేము అక్కడి నుండే వస్తున్నాము.”

అతను తుడ్చుకుంటున్న తుండు సంకలో పెట్టుకుని “మీరు భూపతి గారి తాలూకా సామి”

అలీ “అవును” అని తల ఊపాడు.

“నాకు తెల్వదు సామి, వాడు అక్కడే పని చేస్తున్నాడు అనుకుంటున్నా. అక్కడ లేకపోతే ఏడకి పొయ్యినట్టు?”

“సరే పెద్దాయానా మళ్ళీ కలుస్తాము.” వెళ్లిన పని అవ్వలేనందుకు చాలా నిరుత్సాహాంగా భవంతికి వచ్చాము. అప్పటికే పని వారితో ఎస్టేట్ పనులు పురమాయిస్తున్న లక్ష్మి గారిని చూసాను. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి,

“క్షమించాలి”

లక్ష్మి “ఎందుకు?”

“ఆలస్యం అయ్యింది కదా లక్ష్మి గారు.” ఆమె చేతిలో నుండి లెక్కల పుస్తకాలు తీసుకుంటూ “మీరు వెళ్ళండి మిగతా పనులు నేను చూసుకుంటాను.”

లక్ష్మి “మళ్ళీ కలువ కొలను దగ్గరికి వెళ్ళారా?” అని నవ్వింది.

నేను మాట్లాడలేదు. ఆమె కాసేపు అలానే చూసి వెళ్లిపోయారు. నేను పనివారికి పని వివరాలు చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్తుండగా లక్ష్మి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు.

లక్ష్మి “ఏమైంది నీకు?”

“అర్ధం కాలేదు లక్ష్మి గారు” అని లోపలి వెళిపోతున్న నా చెయ్యి పట్టుకున్నారు.

“ఏంటి ధైర్యం?”

“నడుము మీద రంగులు రాసినప్పుడు” అని కనురెప్పలు ఎగరేశారు. “అది ధైర్యం కదా”

“పనికి అసలే ఆలస్యంగా వచ్చాను అని మా యజమాని కోప్పడ్డారు. ఇప్పుడు ఇంకా ఆలస్యం అవుతుంది. పైగా ఎవరైనా చూస్తే?”

నా మాట పూర్తి కాకుండానే లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఆమె వెళ్తుంటే ఆ గజ్జలు శబ్దం పాత జ్ఞాపకాలని గుర్తుచేశాయి.

అంతలో కనుమూరి గారు లక్ష్మికి ఎదురుపడ్డారు. ఆమెతో ఏదో చెప్పి, ఇద్దరు నడుచుకుంటూ మళ్ళీ నా వైపుకి వచ్చారు.

కనుమూరి “లోపలికి పదండి.”

లోపల మేము కూర్చున్నాక, ఆయన జేబులో నుండి చుట్ట తీసి లక్ష్మి గారి వైపు చూస్తూ “మీకు అభ్యంతరం లేకపోతే?”

ఆమె సరే అనడంతో కనుమూరి గారు అది వెలిగించి “నువ్వు పోతనని కల్వటానికి ఎందుకు వెళ్ళావు?”

ఆశర్యంగా ఉందే, ఈయనకు అంత త్వరగా ఎలా తెలిసింది.

కనుమూరి “చెప్పండి రాయుడు గారు”

“నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో పోతన, నేను కలిసి గెస్ట్ హౌస్ లో ఉన్నాము. అప్పుడు ఒక రోజు, అర్థరాత్రి పోతన రహస్యంగా కొంతమందితో కలిసి భవంతిలో ప్రవేశించాడు. అది చూసినప్పటి నుండి పోతన మీద నాకు అనుమానం ఉంది. అసలు వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అని పోతనను కలవాటానికి వెళ్ళాను.”

కనుమూరి “కానీ ఇప్పుడు ఎందుకు వెళ్లవు?”

మౌనంగానే ఉన్నాను.

కనుమూరి “ఇప్పటి వరుకు ఎందుకు ఎవరితోనూ ఈ విషయం చెప్పలేదు.”

“పోతన, వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ ముసుగు మనుషులో మరోసారి వచ్చారు. అసలు వారు ఎందుకు వచ్చారో తెల్సుకుందాం అని తాళాలు వారికి ఇచ్చి నేను వారిని వెంబడించాను. కానీ వారు ఎందుకు వచ్చారో తెలియలేదు. ఇది ఎవరికైనా చెబితే అర్థం చేసుకోరేమో అని చెప్పలేదు”

కాస్త అవమానంగా అనిపించింది. లక్ష్మి ఏమి అనుకుంటుందో నా గురించి అని మనసులో పీకేస్తుంది.

కనుమూరి “అది పోతన..”

లక్ష్మి “మీకు ఇంతకు ముందు చెప్పాను. ఎవరో రాత్రి పూట భవంతిలోకి వస్తున్నారు అని, రాయుడు గారు చెప్పిన దానిలో కొత్త విషయం అల్లా పోతన గారి ప్రమేయం ఇందులో ఉంది అని. మనం విచారించాల్సింది రాయుడు గారిని కాదు, పోతనని. అతన్ని పట్టుకోండి.”

కనుమూరి “మొదటి తీగ”

లక్ష్మి “అర్ధం కాలేదు.”

కనుమూరి “ఏమి లేదు. నేను చూసుకుంటాను లక్ష్మి గారు.” నా వైపుకి తిరిగి “ఇక నుండి ఏది దాయకండి.”

*******

అవే ఆలోచనలతో ఇంటికి వెళ్లి పడుకున్న నాకు నిద్ర సరిగా పట్టలేదు. నా తల దగ్గర ఉన్న కిటికీ లోనుండి దీపం కాంతి కనిపించింది. అప్పటిలానే ఏదో నీడ వెళ్తున్నట్టు నాకు కనిపించింది. బయటికి వెళ్ళాలి అంటే భయం వేసినా వెతుకుతున్న రాయి కాలికి తగిలితే ఎలా వదిలేస్తాను! బయటకి వెళ్లి వారి కోసం చూసాను. గోడ పక్కన వెలుగు కనిపించి అటు వెళ్లి తొంగి చూసాను. అక్కడ ఒంటరిగా లక్ష్మి గారిని చూసి ఆశ్చర్యపోయాను.

“ఏంటి మీరు ఈ వేళలో?”

“మీరు అన్నారుగా అందరూ చుస్తున్నారు అని. అందుకే ఇప్పుడు వచ్చాను.” లక్ష్మి

“మీకు నిద్ర రావట్లేదూ?”

“రావట్లేదు. ఎందుకు మీరు నన్ను దూరం పెడుతున్నారు?”

లక్ష్మి గారి వెనకాల ఏదో అలికిడి. నా చేతితో లక్ష్మి గారిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేశాను. మెల్లగా కదులుతున్న మొక్కలు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఒక అతను మొక్కల వెనకాల కూర్చుని లక్ష్మీ గారి గది వైపే చూస్తున్నాడు. ఎండిపోయిన ఆకులు కాలి కింద పడి వచ్చిన శబ్దానికి వాడు నన్ను చూసాడు.

*******

– భరద్వాజ్ (Bj writings)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *