ఎరుపెక్కిన ఉదయం

ఎరుపెక్కిన ఉదయం

అన్నా ఏదైనా పని ఉంటే ఇయ్యన్న అంటూ బేలగా అడుగుతున్నా అమ్మాయి వైపు తెలిపారా చూసాడు నాయుడు. ఛామన ఛాయ లో ఉన్న కండపుష్టి బాగానే ఉంది. ఒడ్డు పొడవు కూడా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరమ్మా నువ్వు? ఏం పని చేయగలవు అంటూ అడిగాడు నాయుడు అయ్యా మాది పక్క ఊరు అక్కడ పనులు లేక ఇక్కడికి బతకడానికి వచ్చాము అంటూ అడిగింది సరస్వతి. ఏ పనైనా అంటే అన్ని పనులు చేస్తావా అంటూ వంకరగా నవ్వడు నాయుడు.

ఇవన్నీ తనకు అలవాటే అన్నట్టుగా సరస్వతి అన్ని పనులు చేస్తానయ్యా ఏదైనా ఇప్పించండి బాబు అంది ప్రాధేయ పడుతున్నట్లుగా, సరే సరే వెళ్ళు వెళ్లి ఆ ఇటుక బట్టిలలో ఉన్న ఇటుకలు సమానంగా పెట్టు పో అన్నాడు నాయుడు. కూలి మూడువందలు ఇస్తా అంటూ సరస్వతి వెనకాల ఉన్న పన్నెండేళ్ళ పద్మను చూస్తూ ఓహో మీరిద్దరూ పనికి వస్తారా అయితే కూలి ఇద్దరికీ ఇస్తాలే అన్నాడు నాయుడు.

దానికి సరస్వతి లేదయ్య అమ్మాయి కూలి చేయదు సదువుకుంటుది అంది. అబ్బో చదువుకుని ఏం చేస్తది ఉద్యోగాలు చేస్తాదా ఊరు ఏలుతదా సరే మీ ఇష్టం అదిగో అక్కడ కనిపిస్తున్న షెడ్డు నాదే అందులో ఒక పక్క మీరు ఉండండి అన్నాడు నాయుడు ఎంతో దయ చూపుతున్నట్టుగా, అయ్యా మీ దయ అట్టాగే అంది సరస్వతి.

సరేగానీ రాత్రికి చేపలు పంపిత్త గానీ మంచి చాపల పులుసు పెట్టు, గిన్నెలు, కట్టెలు అన్నీ ఉన్నాయి అన్నాడు నాయుడు. వంకరగా నవ్వుతూ, అతని నవ్వుకు అలవాటు పడిన సరస్వతి సరే అన్నట్టుగా తల ఊపింది.

సరస్వతి, శేఖరం కు పెద్దలు పెళ్లి చేశారు. పెద్దగా ఉన్నవారు చదువుకున్న వారు కాకపోవడం వల్ల ఏదో పనులు చేస్తూ బ్రతికేవారు. ఓ రోజు మేస్త్రి పనికి వెళ్లిన శేఖర్ బిల్డింగ్ కి ఇటుకలు మోస్తూ జారీ పడ్డాడు. అంతే పడిన వాడు మళ్లీ లేవలేదు. సరస్వతి తరపున పెద్దలు యజమాని తో గొడవ పడ్డారు నష్టపరిహారం ఇవ్వాలని కానీ అతను డబ్బున్న వాడు కావడం తో పోలీసుల తో బెదిరించాడు.

దాంతో పెద్దలు తగ్గి, సరస్వతి తో అమ్మ పెద్దవారితో మనకెందుకు జరిగింది ఏదో జరిగి పోయింది. ఇక నీ బతుకు నువ్వే చూసుకోవాలి అంటూ జారుకున్నారు తమ మీద పడుతుందేమో అనే భయం తో. సరస్వతి నిస్సహాయతతో ఏమి చేయలేక, ఎవరూ తనకు సహకరించరు అని అర్థం చేసుకుని ఇక భర్త తిరిగిన స్థలం లో తానుండ లేక ఊర్లు తిరుగుతూ పను చేసుకుంటూ బ్రతుకుతుంది తన పదేళ్ల కూతురితో….

భర్త లేడు అనగానే మృగాళ్లు చేసే వెక్కిలి వేషాలకు అలవాటు పడి బిడ్డ తను బ్రతికి ఉండాలంటే. ఇవన్నీ భరించాలి అనుకుంటూ అన్నిటికీ సర్దుకుని పోయింది. ఇప్పుడు బ్రతుకు తెరువులో భాగంగా ఇటుక బట్టికి కూలి ఎక్కువ ఇస్తారు అని తెలుసుకుని ఈ ఊరికి వచ్చింది. కూతురిని బాగా చదివించాలి అని అనుకుంది సరస్వతి.

అందుకే ఎంత కష్టం అయినా చేయాలనుకుంది. ఇటుకలన్నీ పేర్చిన తర్వాత అక్కడున్న అందరూ పరిచయం అయ్యి, ఆమె బాధకు కాసేపు బాధపడి, ఓదార్చి నాయుడు మంచివాడే కానీ లోంగాలి లేదంటే పని పోతుంది. నువ్వు వాడికి నచ్చితే ఎక్కువ కూలి ఇస్తాడు అంటూ పైగా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్పి వెళ్ళారు. అక్కడే గుడిసెలు వేసుకొని ఉన్న వారు తమ ఇళ్లలోకి వెళ్లి వంటలు చేసుకోవడం మొదలు పెట్టారు.

సరస్వతి షెడ్డులోకి వెళ్ళింది అదంతా చిందర వందరగా ఉండడం తో మంచిగా సర్ది, అందంగా చేసి, పాత్రలన్నీ కడిగి ఉన్న సామాను తో అన్నం, చేపల పులుసు చేసి, కూతురికి అన్నం పెట్టింది. అన్నం తిన్న కూతురు షెడ్డులో ఒక పక్కగా పడుకుంది. కాసేపటికి నాయుడు మందుతో పాటు వచ్చాడు. అతనికి మందు గ్లాసులో పోసి ఇచ్చింది. అంచుకు చేప ముక్కలు పెట్టింది. అబ్బో బాగానే చేసావు పులుసు అంటూ మెచ్చుకుని తిన్నంత తిని, తాగినంత తాగి సరస్వతిని ఒళ్ళోకి లాక్కున్నాడు. సరస్వతి అడ్డు చెప్పలేదు.

అతను చెప్పినట్టే అన్నీ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే సరస్వతికి నాయుడుకి బాగా స్నేహం కుదిరింది. నాయుడు బాగానే కూలి ముట్టచెప్పుతూ, చీరలు గట్రా కొనిచ్చేవాడు. అవన్నీ చూసిన మిగిలిన ఆడవారు అసూయా చెందితే ఇంకొందరు అనుభవజ్ఞులైన వారు మాత్రం తనను ఇంకాస్త జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారు. అలా రెండేళ్లు గడిచిపోయాయి. కూతుర్ని బడికి పంపుతుంది సరస్వతి.

అలా ఒక రోజు బడికి వెళ్ళిన పద్నాలుగేళ్ల పద్మ మధ్యలోనే ఇంటికి ఏడుస్తూ వచ్చింది. పద్మ విషయం తెలిసి సంతోషించాలో ఏడవాలో అర్థంకాక సరస్వతి అయోమయంలో ఉండగానే అమ్మలక్కలు అందరూ పద్మకు జరగవలసిన కార్యక్రమాలు అన్ని జరిపించారు.

పద్మ ఎదుగుతూ వస్తున్న కొద్ది సరస్వతి మనసులో ఆందోళన మొదలైంది. ఏం మృగాడి కళ్ళు తన కూతురిపై పడతాయో అని ఆందోళన చెందసాగింది. అయినా ఎదిగే వయసు ఆగదు కాబట్టి పద్మ వయసుకు వచ్చింది మంచిగా ఏపుగా తయారైంది.

నాయుడు ఈ మధ్య పద్మతో ఎక్కువగా మాట్లాడడం చేస్తున్నాడు పద్మ చదువు గురించి ఇంకా ఏమైనా పుస్తకాలు కావాలా అంటూ పదేపదే అడుగుతూ తనకు రకరకాల బట్టలు కొని ఇస్తున్నాడు ఇదంతా సరస్వతి గమనిస్తున్నా తనతో సంబంధం ఉంది కాబట్టి కూతురిలా భావిస్తున్నాడేమో అని సరిపెట్టుకుంది. అంతే తప్ప వేరే ఆలోచన ఆమెకు రాలేదు.

ఓ రోజు రాత్రి సమయం అవుతున్న బట్టీలోంచి ఇంకా పని ఎక్కువ ఉంది నువ్వు ఈ పని పూర్తిచేయి అంటూ సరస్వతికి ఇటుకలు పేర్చే పనిని అప్పగించాడు నాయుడు అందరూ వెళ్లిపోయాక కూడా తనొక్కదాన్నే చేయమంటుంటే సరే పోనీ రేపు లోడ్ ఎక్కించేది ఉందేమో అనుకుని తన పని తాను చేసుకుంటూ ఉంది సరస్వతి.

నాయుడు మెల్లిగా షెడ్డు దగ్గరికి వెళ్ళాడు అక్కడ పద్మావతి చదువుకుంటుంది. నాయుడుని చూసి మా అమ్మ రాలేదా అంటూ అడిగింది మీ అమ్మ రాలేదే నాకు ఆకలిగా ఉంది ఏమైనా ఉంటే పెట్టు అంటూ అడిగాడు నాయుడు. సరే తీసుకొస్తాను కూర్చోండి అంటూ లోపలికి వెళ్ళింది పద్మ ఆమె వెనకే నాయుడు కూడా వెళ్లి లోపలికి గడియ పెట్టాడు. ఏంటి గడియ పెడుతున్నారు తీయండి అంటూ పద్మ కాస్త గట్టిగానే అంది పర్లేదు అమ్మా చల్లగాలి వస్తుంది అందుకే తలుపులు వేశాను నేను ఇక్కడ కూర్చుంటా కానీ వెళ్లి అన్నం పెట్టుకురా అంటూ అక్కడ ఉన్న బెంచి మీద కూర్చున్నాడు.

పరదా పక్కనే ఉన్న జాగాలో చిన్నగా వంటిల్లు లాగా చేసుకున్నారు వాళ్ళు అక్కడికి వెళ్లి కంచం తీసుకొని అన్నం పెడుతూ ఉన్న పద్మ దగ్గరికి వెనకాలే వెళ్లి గట్టిగా కౌగిలించుకున్నాడు నాయుడు అది ఊహించని పద్మావతి కింద పడి వదలండి వదలండి అంటూ గట్టిగా అరవ సాగింది. ష్ నోరు ముయ్ అందరికీ వినిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ మామూలే ఒక్కసారి అయిపోతే అంతా తెలిసిపోతుంది చాలా బాగుంటుంది మీ అమ్మ నీకు ఎప్పుడూ చెప్పలేదా అంటూ దగ్గరికి లాక్కుంటూ అన్నాడు నాయుడు.

ఛీ వదులు అంటూ అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయ సాగింది పద్మ కానీ అతని ముందు పద్మ బలం ఏమాత్రం సరిపోలేదు అలా గింజుకుంటూ గింజుకుంటూ ఎంతసేపు అయిందో గమనించలేదు ఇంతలో షెడ్డు తలుపులు తెరుచుకున్నాయి వర్షంలో తడిసిన సరస్వతి గొడ్డలితో తలపై నుంచి నీళ్లు కారుతూ ఉండగా అక్కడ నిలబడింది అది చూసి నాయుడు పద్మను వదిలేసి, అదే వర్షం పడుతుంటే భయపడుతుందని అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నం చేశాడు.

కానీ ఇంతలోనే అతని తలపై గట్టి దెబ్బ పడింది రక్తం అంతా సరస్వతి ముఖంపై జింపిల్లింది. ఆ సంఘటనకు తల్లి కూతురు ఇద్దరు బిత్తరపోయి వెనక్కి తిరిగి చూశారు అక్కడ కౌసల్య నిలబడి రాడ్తో నాయుడు తలపై మరొక్కసారి బలంగా దెబ్బ వేసింది దాంతో ఆరడుగుల నాయుడు కుప్పకూలిపోయాడు సరస్వతి కాళ్ళ ముందు. ఇంకా కోపం చల్లారని కౌసల్య అతని వెన్ను మీద బాదుతూనే ఉంది.

చటుక్కున తెలివి తెచ్చుకున్న సరస్వతి గబగబా వచ్చి కౌసల్యని ఆపింది కౌసల్య సరస్వతిని చూస్తూ రాడ్డు కింద పడేసి గట్టిగా కౌగిలించుకొని ఏడవడం మొదలు పెట్టింది. ఇంతలో ఈ హడావుడికి పక్క గుడిసెల వాళ్ళు అందరూ వచ్చారు వారంతా కౌసల్యను, సరస్వతిని అక్కడ పడున్న నాయుడుని చూసి జరిగింది ఏమిటో గ్రహించారు

అందులోంచి రత్నమ్మ ముందుకు వచ్చి వీడికి ఇలా కావాల్సిందే ముత్యం లాంటి బిడ్డను నాశనం చేసి ఆ బిడ్డ చావుకు కారణం అయ్యాడు అంటూ తిట్టడం మొదలు పెట్టింది అర్థం కాని సరస్వతి రత్నమ్మవైపు అయోమయంగా చూసింది. రత్నమ్మా సరస్వతి కి చెప్పడం మొదలు పెట్టింది కౌసల్యకి కూడా నీలాగే ఒక కూతురు ఉండేది ఆ అమ్మాయి భర్త కూడా తనని వదిలేసి వెళ్లాడు.

కౌసల్య తన కూతురు కోసమే ఈ ఇటుక బట్టీలో పనిచేయడం మొదలు పెట్టింది. నీ బిడ్డ లాగే తన బిడ్డను కూడా చదివించడం వల్ల ఆ బిడ్డ చాలా బాగా చదువుకునేది తన కూతురి పేరు రత్న. రత్నం లాంటిది చాలా బాగా చదువుకునేది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగం చేసి తల్లిని బాగా చూసుకోవాలని అనుకున్నది.

పది పాస్ అయ్యి ఇంటర్లోకి అడుగుపెట్టిన ఆ అమ్మాయిని ఇలాంటి ఒక రాత్రే ఈ నాయుడు చెరిచాడు అవమానాన్ని తట్టుకోలేక రత్న ఉరిపోసుకొని చచ్చిపోయింది. ఆమె చావుకు కారణం నాయుడే అని తెలిసినా కూడా మేము ఏమీ చేయలేం ఎందుకంటే వాడు డబ్బున్న వాడు. ఏం చేసినా మళ్లీ బయటకు వస్తాడు తప్ప వానికి శిక్ష పడదు కౌసల్య అవకాశం కోసం ఎదురుచూస్తుంది.

ఇప్పుడు ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయబోతుంటే ఆమెను కాపాడడానికి అంటే నీ కూతుర్ని కాపాడడానికి తనే వాడిని చంపేసింది చాలా మంచి పని చేసింది. కూలికి వచ్చారు వీరికి ఆత్మ అభిమానం లాంటివి ఏమీ ఉండవని అనుకునే ఇలాంటి వెధవలకి ఇదే తగిన గుణపాఠం అంది రత్నమ్మ.

ఆ రాత్రంతా వాళ్ళందరూ నాయుడు శవం చుట్టూ అలాగే నిలబడి ఉన్నారు ఎవరు ఉప్పదించారో తెలియదు కానీ పోలీసులు ఎరుపెక్కిన సూర్యుడు రాకముందే అక్కడ వాలారు. అక్కడ పరిస్థితి చూసిన వారందరికీ అర్థమైంది కానీ వాళ్ళు చేయాల్సింది చేయాలి కాబట్టి కౌసల్యని తీసుకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. కౌసల్య చుట్టూ అందరిని ఒకసారి చూసి పోలీసుల వెంట ముందుకు నడిచింది.

కానీ సరస్వతీ తనని ఆపి రెండు చేతులతో ఆమెకి దండం పెట్టింది అప్పుడు కౌసల్య నాకంటూ ఎవరూ లేరు నా జీవితం ఇలా గడిచిపోతుంది నువ్వు నీ కూతురిని బాగా చదివించు నా కూతురు కలలు నీ కూతురు కలలు అవ్వాలి కూలి వాళ్లు అంటే చులకన భావం పోవాలి అంటూ చెప్పి ముందుకు కదిలింది. ఇలాంటి మృగాలు ప్రతి చోట ఉంటారు వారికి తగిన బుద్ధి చెప్పాలి కానీ చావే పరిష్కారం లేదా చంపడమే పరిష్కారం కాదు.

– భవ్య చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *