!!ఎన్నెలమ్మ!!
సూర్యుడు గాలిని తోడేసుకుని
మరిగిపోవటం మననం చేస్తూ
విర్రవీగుతున్నాడు వే(వా)డి నాదేనంటూ
మనసు చచ్చి చిరిగిన పీలికల్ని గాలి గేలిచేస్తుంటే
అగ్ని స్నానం చేస్తోంది ఎన్నెలమ్మ
వికృత చూపుల తెరల్ని త(క)ప్పుకుంటూ
మాడిపోతున్న పేగుల్ని ఊతమేసుకుంటూ
కదులుతోంది కాకిలానైనా విదిలిస్తారేమోనని
గమ్యమంటూ ఉంటేగా గమనానికి
పొడారిన చూపుల్ని, తడారిన గొంతుని
తడుపుకుంటూ, తంటాలుపడుతూ
దిక్కూ, మొక్కూలేని జనారణ్యంలో
ఆకలి నోరు అల్లల్లాడిపోతోంది
సుళ్ళు సుళ్ళుగా దుఃఖం దూకుళ్ళు
బతుకు పోరాటం తెలీక
అలిసిపోయి ఏ చెట్టు నీడకో చేరుకుంటోంది
దయతలిచి ముద్ద పెడితే ఆరోజు తనదనుకుంటూ
చీకటి పడితే చెట్టుకిందే పక్క పరుచుకుంటుంది
వేటాడే కుక్కలు, పీక్కుతినే నక్కలు
పక్కనే ఉంటాయని తెలీక
ఉరుములు మెరుపుల్తో
ఉలిక్కిపడ్డ కామేశం,
ఇంటికి చేరని పట్నం కొడుకు కోసం
చూపుల్ని వీధి గుమ్మానికి విసిరేయగా
చెట్టు కింద ఏదో కదలిక
ఒక్క మెరుపు మెరిసింది
కామేశం మదిలో కామంలా
తాగిన మత్తు తొందర చేస్తుంటే
కటిక చీకటి దారి చూపిస్తుంటే
జోరువాన గొడుగు పట్టగా
అడుగులు చెట్టుకిందకు చేర్చాయి
ఆ కాళరాత్రి కేళీవినోదానికి
ఎండిన డొక్కల ఆకలి ఆరుపులు ఒకవైపు
నిండిన కడుపు “ఆకలి” కులుకులు ఒకవైపు
హోరు వానలో పెళ పెళ మంటూ
ఎదిరించే సత్తువలేక ఒకరు
బరితెగించే మత్తులో ఒకరు
ఆ “రెండు క్షణాలు”,
వర్షం సైతం చేష్టలుడిగి
ప్రాణాలు గాలిలో కలుస్తుంటే,
మౌనం పాటించింది
గొడ్ల సావిడి గొల్లుమంది
మూగజీవాల సాక్షిగా
శవ పంచనామా
కితాబులన్నీ కామేశానికే
మతలబు లెవీ పట్టించుకోని పిచ్చి జనం
చందా ఎక్కువేసుకున్నాడని
పొగడ్తల మత్తేమో కామేశంలో
ఛీత్కారమేమో కన్న కొడుకు కళ్ళల్లో
మూగజీవుల ఆక్రందనల్లో….
-గురువర్ధన్ రెడ్డి