ఎన్నెల రోజులు
మా సిన్నప్పుడు ఊర్లో ఇటుకలతో కట్టిన ఇల్లు ఉండేది. మా అయ్యతో కలిపి ముగ్గురన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు అంటే మాకు అత్తలు, అవ్వ, నాయనవ్వ అంతా కలిసే ఉండేవాళ్ళం. ఇల్లంతా పొద్దున మహా సందడిగా ఉండేది.
మా అవ్వ మబ్బున్నే లేసి పొయ్యి ఏలిగించి, పెద్ద బాగొను లో నీళ్ళు యెట్టి, నోట్లో బోగ్గేసుకుని, చెబట్టికు పోయేది.
రాగానే నీళ్ళు తోలుపుకుని నాలుగు గుంజెలకు కట్టిన దడిలోకి ఏళ్ళి మొఖం కడుక్కుని,పేయ్యి కడుక్కొని అచ్చి, ఇంకో పొయ్యి మిన పెద్ద బోగొను లో అన్నం వండేది.
ఇగ పిల్లలం,పెద్దోళ్ళులేసి బోగ్గులతో పళ్ళు తోముకుని అచ్చెటోల్లు. అప్పటికి మా అవ్వ అన్నం అయ్యేది.
పెద్దోళ్ళు అంతా అంటే మా నాయిన, చిన్నాయినలు మొగాలు కడుక్కుని అచ్చి కూసుంటే మా అవ్వ అందరికీ సిల్వెండి కంచాల్లో బువ్వేసి చింతకాయ తొక్కు ఏసేది.
అందరూ ఉదుకుంటు బువ్వ తిని అవ్వ కట్టిన సద్ది తీసుకుని తునికాకు తెంపనికి గుట్టకు పోయేటోల్లు, ఎండాకాలం అయితే గుట్టకు పోయేటోల్లు, మిగిలిన కాలాలు అయితే కట్టెలకో, బీడిల ఆకుకో పోయే టోల్లు, ఇగ అవ్వ సుత ఇంత తిని, గోనె సంచులు పట్టుకుని పోయేది.
ఇంట్ల పిల్లలను పట్టుకుని నాయనవ్వ ఉండేది. అట్టా మబ్బున్నీ పోయినా వాళ్ళు అంతా మద్దేనం వరకు ఎండ నడి నెత్తిన అచ్చేదాక ఇంటికి సంచులు నింపుకుని అచ్చేవొళ్ళు.
పనికి పోయిన వాళ్లంతా రాక మునుపే మా నాయనవ్వ ఇంత అంబలి కాసేది. మిరం ఏసుకుని అంబలి తాగి అందరూ నిద్రలు పోయేటోల్లు.
ఇగ సాయంత్రం కాగానే మల్ల మా అవ్వ పొయ్యి రాజేసి ఇంత అన్నం వండేది. పిల్లలం అంతా పొయ్యి కాడ కుసో నీ అన్నం కుతకుత ఉడుకుడు గమ్మత్తుగా సూసే వొల్లం.
అవ్వ రాత్రి బువ్వలో ఉల్లిగడ్డ పులుసు గానీ, లేదంటే పప్పు చారు కానీ చేసేది. మా అత్త పిల్లలు, చిన్నయన పిల్లలు అందరం కలిసి ఉండే టోల్లం కాబట్టి మా అవ్వ అన్నం సారు కంగానే మా అందరికీ గిన్నెలో కలిపి బుక్కలు పెట్టేది.
అవన్నీ ఉదుకుంట తింటoటే సోర్గం కనిపించేది. ఇగ అందరం తిన్నాక అకిల్లో పెద్ద బిచ్చపు సాప ఏసి దాని మీన బొంతలు లేకుంటే చద్దర్ ఏసిస్తే మేమందరం పండుకుని, ఎన్నెల్లో ముచ్చట్లు వెట్టుకుంట అగో గా సుక్క నాది గీ సుక్క నీదంటూ లెక్కలు వెట్టుకుంట నిద్రలు బోయే టోల్లం తెల్వకుండనే… గప్పటి రోజులు మంచిగుండే..
-భవ్య చారు
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌